



Best Web Hosting Provider In India 2024

AP Inter Results 2025 : ఈసారి ‘వాట్సప్’లో ఏపీ ఇంటర్ ఫలితాలు..! విద్యార్థుల చేతికి వెంటనే ‘షార్ట్ మెమోలు’
AP Inter Result 2025 Updates : ఏపీ ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ఇవాళ్టితో పూర్తి కానుంది. ఆపై మార్కుల ఎంట్రీతో పాటు కంప్యూటరీకరణ పనులను పూర్తి చేస్తారు. ఇవన్నీ పూర్తి కాగానే ఫలితాలను ప్రకటిస్తారు. ఈసారి వాట్సాప్ ద్వారా ఫలితాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఏపీ ఇంటర్ పరీక్షలు పూర్తి కావటంతో విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు మూల్యాంకన ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇవాళ్టితో అన్ని పేపర్లు స్పాట్ పూర్తవుతుంది. మూల్యాంకనం పూర్తి కాగానే…. మార్కుల ఎంట్రీతో పాటు ఇతర సాంకేతికపరమైన అంశాలపై కసరత్తు చేస్తారు.
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1న ప్రారంభమై…. మార్చి 20వ తేదీతో ముగిశాయి. ఆ వెంటనే బోర్డు వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఫలితాలను వేగంగా ప్రకటించడానికి చర్యలు చేపట్టింది. ఈఏపీసెట్ తో పాటు ఇతర ఎంట్రెన్స్ పరీక్షల దృష్ట్యా… సాధ్యమైనంత త్వరగా ఫలితాలను ప్రకటించాలని చూస్తోంది.
ఫలితాలు ఎప్పుడు రావొచ్చు…!
ఇవాళ్టితో మూల్యాంకన ప్రక్రియ పూర్తవుతుంది. ఆపై కంప్యూటరీకరణ ప్రక్రియను చేపడుతారు. దీనికి వారం రోజులపాటు పటొచ్చు. ఆపై ప్రభుత్వ అనుమతి రాగానే… ఫలితాలను ప్రకటిస్తారు. అన్ని కుదిరితే ఏప్రిల్ 12 లేదా 13వ తేదీల్లో ఏపీ ఇంటర్ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిల్ 12న ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈసారి వాట్సాప్ లోనే ఫలితాలు…!
ఏపీలో మన మిత్ర వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పౌర సేవలన్నీ కూడా దీని ద్వారానే పొందవచ్చు. ఇందులో భాగంగా ఈసారి ఇంటర్మీడియట్ ఫలితాలను కూడా వాట్సాప్ ద్వారానే అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈసారి పదో తరగతి, ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు కూడా వాట్సాప్ సేవల ద్వారానే పొందారు. మన మిత్ర నెంబర్ 9552300009 కు వాట్సాప్ సందేశం పంపడం ద్వారా ప్రస్తుతం 200 రకాల పౌర సేవలను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇంటర్మీడియట్ ఫలితాలను కూడా వాట్సాప్ ద్వారానే తెలుసుకోవచ్చు.
పరీక్ష రాసిన విద్యార్థులు ‘9552300009’ మన మిత్ర నెంబర్ కు హాయ్ అనే సందేశం పంపి నేరుగా ఫలితాలను పొందవచ్చు. మార్కుల జాబితా పీడీఎఫ్ రూపంలో డిస్ ప్లే అవుతుంది. ఆ దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మాదిరిగా వచ్చే మార్కుల జాబితాలు…. షార్ట్ మెమోలుగా ఉపయోగపడనున్నాయి.
గతంలో ఫలితాలు విడుదలైన తర్వాత కొన్నిరోజులకు షార్ట్ మెమోలు అందుబాటులోకి వచ్చేవి. అప్పటి వరకు విద్యార్థులు వేచి చూసేవారు. కానీ ఈసారి మనమిత్ర వాట్సాప్ ద్వారానే ఈ తరహా మెమోలను పొందవచ్చు. ఫలితంగా విద్యార్థుల చేతికి క్షణాల వ్యవధిలోనే షార్ట్ మెమోలు అందినట్లు అవుతుంది. ఏపీ ఇంటర్ ఫలితాలను వాట్సాప్ లోనే కాకుండా… ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ ( bieap.gov.in)లోనూ చెక్ చేసుకోవచ్చు.
టాపిక్