



Best Web Hosting Provider In India 2024

Telangana VS Andhra Pradesh : ఏపీ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ‘న్యాయ’ పోరాటం…! సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్
ఏపీ సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ న్యాయపోరాటానికి సిద్ధమైంది. రాయలసీమ ఎత్తిపోతల, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. హైదరాబాద్ లోని జలసౌధలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు ప్రధాన నదుల అనుసంధాన ప్రాజెక్టులైన గోదావరి-బనకచెర్ల లింక్ స్కీం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (ఆర్ఎల్ఐఎస్)పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.
శుక్రవారం హైదరాబాద్ లోని జలసౌధలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇటీవలనే ఆమోదం తెలిపింది.
చట్ట ఉల్లంఘనే…!
సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై న్యాయనిపుణులు, నీటి పారుదల శాఖ స్టాండింగ్ కౌన్సిల్స్, అడ్వకేట్ జనరల్ తో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు 1980 నాటి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) అవార్డును, 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని (ఏపీఆర్ఏ) నేరుగా ఉల్లంఘిస్తోందన్నారు.
రాయలసీమలోని నాలుగు జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరులోని 1.9 మిలియన్ల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2020 ఆగస్టులో వైఎస్ జగన్ సర్కార్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్ఎల్ఐఎస్)ను చేపట్టింది. ఈ పథకాన్ని కూడా సవాలు చేయాలని సమావేశం తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.
గోదావరి, కృష్ణా నదీ జలాల్లో తమకు రావాల్సిన న్యాయమైన వాటాను కాపాడుకుంటామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులు…. నీటి పంపకాల ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి అవసరాలకు తీవ్ర ముప్పుగా మారుతాయని చెప్పుకొచ్చారు.
సంబంధిత రెగ్యులేటరీ అథారిటీల అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా ప్రాజెక్టులను చేపడుతోందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండబోదని… అక్రమ నిర్మాణాలు, నీటి మళ్లింపును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టులో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ప్రకటించారు.
రూ.80,112 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టులో గోదావరి నది నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా 200 టీఎంసీల నీటిని రాయలసీమకు మళ్లించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేయాలని ప్రతిపాదించింది.
పోలవరం-బనచెర్ల లింక్ ప్రాజెక్టును 100 శాతం ప్రభుత్వ ఆధీనంలోని జల హారతి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
రూ.3,278 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆర్ఎల్ఐఎస్ ప్రాజెక్టు ద్వారా సంగమేశ్వరం సమీపంలోని శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (ఎస్ఆర్ఎంసీ)లోకి పంపింగ్ చేసి నాలుగు జిల్లాల్లోని వివిధ సాగునీటి కాలువలకు నీరందించనున్నారు.
ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్రస్థాయిలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంటుందని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే… సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ), కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), అపెక్స్ కౌన్సిల్ నుంచి ఆంధ్రప్రదేశ్ తప్పనిసరిగా అనుమతులు పొందలేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వీలు కల్పించే ఏపీ విభజన చట్టంలోని సెక్షన్లు 46(2), 46(3)లను ఉపయోగించుకుని కేంద్ర నిధులను పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తోందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. అయితే ఇలాంటి నిబంధనలు చట్టబద్ధమైన అనుమతులు, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను అధిగమించలేవని హెచ్చరించారు.
టాపిక్