




Best Web Hosting Provider In India 2024

AP Aqua Farmers : అమెరికా సుంకాల ప్రభావం.. ఏపీ అక్వా రైతుల సంచలన నిర్ణయం.. 10 ముఖ్యాంశాలు
AP Aqua Farmers : మత్స్య ఎగుమతిదారులపై అమెరికా సుంకాల ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఇదే అదనుగా పలు కంపెనీలు దోపిడీకి పాల్పడుతున్నాయి. భారీగా ధర తగ్గించి రొయ్యలు కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్వా రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

అమెరికా మత్స్య ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను భారీగా పెంచింది. దీని ప్రభావం భారతీయ మత్స్య ఎగుమతిదారులపై పడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే రొయ్యలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. గుజరాత్ విషయం ఎలా ఉన్నా.. ఏపీ నుంచి షిప్‌మెంట్లు నిలిచిపోయాయి. ఇదే అదనుగా కంపెనీలు దోపిడీకి తెరలేపాయి. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
10 ముఖ్యాంశాలు..
1.అమెరికా దిగుమతి సుంకం ఏపీ మత్స్య ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రత్యక్షంగా భారం పడనుంది.
2.ఏప్రిల్ మొదటి వారంలో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యేందుకు మత్స్య ఉత్పత్తులతో 2 వేల షిప్‌మెంట్లు సిద్ధంగా ఉన్నాయి. మరో 2,500 షిప్‌మెంట్లకు సరిపడా సరుకు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంది. మొత్తంగా దాదాపు 3,500 షిప్‌మెంట్లు ఏపీకి చెందినవేనని ఎగుమతిదారులు వివరిస్తున్నారు.
3.డొనాల్డ్ ట్రంప్ కొత్తగా విధించిన దిగుమతి సుంకం ప్రకారం లెక్కిస్తే.. వీటిపై భారం రూ.600 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
4.ఈ రూ.600 కోట్లు నష్టపోవడమే తప్ప.. ఈ భారాన్ని తిరిగి కొనుగోలుదారులపై వెయ్యలేని పరిస్థితి ఉందని ఎగుమతిదారులు వాపోతున్నారు.
5.గత ఆర్థిక సంవత్సరంలో భారత్- అమెరికాల మధ్య జరిగిన వ్యాపార లావాదేవీల విలువ 6.6 బిలియన్ డాలర్లుగా ఉంది. వీటిలో ఎగుమతుల విలువ 5 బిలియన్ డాలర్లు, దిగుమతుల విలువ 1.6 బిలియన్ డాలర్లుగా ఉంది.
6.ఎగుమతుల్లో మత్స్య ఉత్పత్తుల విలువ 2.55 బిలియన్ డాలర్లపైమాటేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
7.అమెరికాకు ఆహార, మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాల్లో 42.3 శాతంతో భారత్ మొదటి స్థానంలో ఉంది. 26.9 శాతంతో ఈక్విడార్ రెండో స్థానంలో ఉంది.
8.భారత్‌పై 27 శాతం దిగుమతి సుంకం విధించిన ట్రంప్.. ఈక్విడార్ నుంచి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తులపై కేవలం 10 శాతం మాత్రమే సుంకం విధించారు. ఈ కారణంగా ఈక్విడార్ నుంచి పోటీని తట్టుకోవడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
9.భారత్‌కు వచ్చే ఆర్డర్స్ అన్నీ ఇక ఈక్విడార్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఏటా 11 నుంచి 12 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో ఈక్విడార్ మన దేశాన్ని రెండవ స్థానానికి నెట్టేసింది.
10.ఏపీలో శుక్రవారం వరకు కిలోకు రూ.20 నుంచి రూ.40 మేర కోత పెట్టి రొయ్యలు కొనుగోలు చేశారు. కానీ శనివారం ఏకంగా రూ.30 నుంచి రూ.90 వరకు తగ్గించి కొనుగోలు చేశారు. రెండ్రోజుల కిందటి వరకు 30 కౌంట్ రొయ్యలు కిలో రూ.470 ఉండగా.. శనివారం రూ.380తో కొనుగోలు చేశారు. 50 కౌంట్ అయితే రూ.360 నుంచి రూ.300కు తగ్గించేశారు. దీంతో కంపెనీల నుంచి స్పష్టత వచ్చే వరకు.. రొయ్యలు పట్టొద్దని ఆక్వా రైతు సంఘాలు నిర్ణయించాయి. దాదాపు 15 రోజుల వరకు రొయ్యల పట్టుబడులు బంద్ అయ్యే అవకాశం ఉంది.
టాపిక్