




Best Web Hosting Provider In India 2024

Warangal Police Commissionerate : వరంగల్ లో నేటి నుంచి ‘సిటీ పోలీస్ యాక్ట్’ – నెలపాటు ఆంక్షలు
వరంగల్ కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి సిటీ పోలీస్ యాక్ట్ అమల్లోకి రానుంది. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ యాక్ట్ ప్రకారం పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి మీటింగులు, ర్యాలీలు, సభలు నిర్వహించడానికి వీలు ఉండదు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్టు సెక్షన్ 30 అమలులో ఉంటుందని సీపీ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సీపీ సన్ ప్రీత్ సింగ్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ 30– సిటీ పోలీస్ యాక్ట్ అమలులోకి తీసుకొచ్చినట్టు సీపీ తెలిపారు.
పర్మిషన్ తప్పనిసరి…
సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం పోలీస్ ఆఫీసర్ల అనుమతి లేకుండా ఎలాంటి మీటింగులు, ర్యాలీలు, సభలు నిర్వహించడానికి వీలు లేదని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఒక వేళ నిబంధనలకు విరుద్ధంగా, ముందస్తుగా పోలీసుల అనుమతి లేకుండా ఎవరైనా మీటింగులు, ర్యాలీలు, సభలు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతేగాకుండా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం నేరమని ఆయన తెలిపారు. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే చిక్కులు తప్పవని హెచ్చరించారు.
డీజేల వినియోగంపై నిషేధం…
చిన్న పిల్లలు, వృద్ధులు, రోగులతో పాటు విద్యార్థుల చదువులను దృష్టిలో పెట్టుకుని డీజే బాక్సులు, లౌడ్ స్పీకర్లు వినియోగించడం కూడా నిషేధించినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. డీజే సౌండ్స్, లౌడ్ స్పీకర్లతో శబ్ధ కాలుష్యం ఏర్పడుతోందని, అందుకే వాటిపై నిషేధం కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా తప్పని సరిగా మైకులు ఏర్పాటు చేయాల్సి వస్తే మాత్రం ముందస్తుగా సంబంధిత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని సీపీ చెప్పారు.
పర్మిషన్ తీసుకున్నప్పటికీ మైకుల వాడకంపై కూడా ఆంక్షలు ఉంటాయన్నారు. వాటిని ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించుకోవాలని, మిగతా సమయంలో నిషేధం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రాత్రి సమయాల్లో మైకులను వినియోగించకూడదన్నారు. అలాగే హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు వంద మీటర్ల పరిధిలో మైకులను ఏర్పాటు చేయకూడదని సీపీ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు.
మే 5వ తేదీ వరకు
వరంగల్ కమిషనరేట్ పరిధిలో నెల రోజులపాటు 30- సిటీ పోలీస్ యాక్టు అమలులో ఉంటుందని సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ యాక్టు అమలులో ఉంటుదన్నారు. ఈ ఉత్తర్వులను ఎవరైనా అతిక్రమిస్తే, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ఈ మేరకు కింది స్థాయి సిబ్బందికి కూడా ఉత్తర్వులు అందాయి. దీంతో కమిషనరేట్ పరిధిలోని ప్రజలంతా నిబంధనలు పాటిస్తూ తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యహరించి, చిక్కుల్లో పడొద్దని సూచిస్తున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).
టాపిక్