




Best Web Hosting Provider In India 2024

CM Chandrababu Letter : అమెరికా సుంకాలతో ఏపీ ఆక్వారంగం కుదేలు, ఆదుకోవాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
CM Chandrababu Letter : అమెరికా సుంకాల పెంపుతో ఏపీ ఆక్వా రంగం తీవ్రంగా నష్టపోతోందని సీఎం చంద్రబాబు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు. సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులు మినహాయింపు పొందేలా చర్చలు జరపాలని కోరారు కోరారు.

CM Chandrababu Letter : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల సుంకాల బాంబ్ పేల్చారు. భారత్ సహా చాలా దేశాల ఎగుమతులపై భారీగా సుంకాలు విధించారు. దీంతో ముఖ్యంగా ఏపీ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఆక్వా ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికా సుంకాలతో నష్టపోతున్న ఏపీ ఆక్వారంగాన్ని ఆదుకోవాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు.
ఏపీ జీడీపీలో మత్స్యరంగం కీలకం
అమెరికా సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులు మినహాయింపు పొందేలా యూఎస్ ప్రభుత్వంతో చర్చలు జరపాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరారు. ఏపీ జీడీపీలో మత్స్యరంగానికి కీలక పాత్ర అని గుర్తుచేశారు. సంక్షోభ సమయంలో ఆక్వా రైతులకు అండగా ఉండాలని కేంద్రాన్ని కోరారు. భారత్‌పై అమెరికా 27శాతం సుంకం విధింపుతో ఆక్వారంగానికి తీవ్ర నష్టమని పేర్కొన్నారు. అధిక సుంకాల వల్ల భారత్ దేశ ఆర్డర్లను ఇతర దేశాలు రద్దు చేసుకుంటున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఏపీ శీతల గిడ్డంగుల్లోనూ నిల్వ కోసం స్థలం లేదని, ఆక్వా రైతులు గందరగోళంలో ఉన్నారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు సీఎం చంద్రబాబు.
ఏపీ రొయ్య రైతులపై తీవ్ర భారం
యూఎస్ సుంకాల పెంపుతో ఏపీ రొయ్య రైతులు చిక్కుల్లో పడ్డారు. ఒక్కసారిగా 27 శాతం సుంకం విధించడంతో రొయ్యల ధరల్లో కోత పడింది. కిలోకు రూ.40 వరకు తగ్గించేశారని రైతులు ఆందోళన చెందుతున్నారు. 100 కౌంట్ రొయ్య ఉత్పత్తికి కిలోకు రూ.250 ఖర్చు అవుతుందని, నెల కిందటి వరకు రూ.240 రేటు పలికిందని, యూఎస్ సుంకాల నేపథ్యంలో ఇప్పుడు రూ.200 కంటే తక్కువకు అడుగుతున్నారన్నారు. కిలో రూ.230 చొప్పున రేట్లు ఉన్నాయన చెబుతున్నా ఎక్కడా అమలు కావడం లేదని ఆవేదన చెందారు.
అమెరికా సుంకాల పెంపుతో ధరలు మరింత తగ్గే ప్రమాదం ఉందనే రైతులు భయాందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో రొయ్య సాగు చేస్తున్న రైతుల్లో 90 శాతానికి పైగా చిన్న, సన్నకారు రైతులే(5 ఎకరాల లోపు) ఉన్నారు. రొయ్యల వార్షిక ఉత్పత్తిలో 70 శాతం ఏప్రిల్-సెప్టెంబర్ నెలల మధ్య వస్తుంది. సుంకాల పెంపుతో ఆక్వా రైతులు మరింత నష్టం పోయే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నిల్వకు సరైన వసతులు లేకపోవడంతో వచ్చిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు వాపోతున్నారు.
భారత్ పై భారం
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు 2.55 బిలియన్ల డాలర్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. వీటిలో రొయ్యలే 92 శాతం వాటాను కలిగిఉన్నాయి. అమెరికాకు రొయ్యల ఎగుమతిలో భారతదేశంపై 27 శాతం దిగుమతి సుంకం విధించడంతో ఆక్వా రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. ఈక్వెడార్ వంటి ఎగుమతిదారులపై కేవలం 10 శాతం పన్ను మాత్రమే విధిస్తు్న్న యూఎస్… భారత్ పై 27 శాతం పన్ను విధించింది. దీనికి తోడు భారత్ ఎగుమతిదారులపై 5.77 శాతం కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ భారాన్ని వేస్తున్నారు.
అమెరికా విధించిన కొత్త సుంకాలు ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో అమెరికాకు భారత్ నుంచి వెళ్లే అన్ని ఎగుమతులపైనా ఈ భారం పడుతుంది. గతంలో వచ్చిన ఆర్డర్లకు ఇప్పటికే సేకరించిన ఉత్పత్తులను ప్కాక్ చేసి కోల్డ్ స్టోరేజ్ లు, పోర్టులలో ఎగుమతికి రెడీ ఉన్నాయి. సుంకాల విధింపుతో తమపై అధిక భారం పడుతోందని ఆర్డర్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. వియత్నాం, థాయిలాండ్, జపాన్ దేశాలు భారత్ నుంచి సీఫుడ్ కొనుగోలు వాటిని ప్రాసెస్ చేసి అమెరికాకు ఎక్స్ పోర్ట్ చేస్తుంటాయి.
సంబంధిత కథనం
టాపిక్