


Best Web Hosting Provider In India 2024

Warangal Road Accident : గుడికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం-బీటెక్ విద్యార్థి మృతి, మరో విద్యార్థినికి తీవ్ర గాయాలు
Warangal Road Accident : వరంగల్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు విద్యార్థులు బైక్ పై గుడికి వెళ్తుండగా…ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.

Warangal Road Accident : వరంగల్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా ఓ ఇద్దరు స్టూడెంట్స్ బైక్ పై గుడికి వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన అశోక్ లే ల్యాండ్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు తలకు తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోగా.. బైక్ పై ఉన్న యువతి గాయాలతో ఆసుపత్రి పాలైంది. బాధిత కుటుంబ సభ్యులు, హసన్ పర్తి పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ ఆర్కే-6 కాలనీకి చెందిన రామటెంకి శ్రవణ్ పెద్ద కొడుకు అయిన రామటెంకి ఉదయ్ (18) హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ శివారులో ఉన్న ఎస్ఆర్ యూనివర్సిటీలో బీటెక్ ఈఈఈ చదువుతున్నాడు. ఇదే యూనివర్సిటీలో రాంశెట్టి రజిత అనే యువతి బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతోంది. ఇద్దరూ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటుండగా.. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది.
భద్రకాళి గుడికి వెళ్తుండగా..
రామటెంకి ఉదయ్, రాంశెట్టి రజిత ఇద్దరు స్నేహితులు కాగా.. ఆదివారం శ్రీరామ నవమి కావడంతో ఇద్దరూ కలిసి గుడికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు టీజీ 24, 5371 నెంబర్ గల ఆర్15 బైక్ పై ఇద్దరూ వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారి గుడికి వెళ్లేందుకు ఉదయం 10.30 గంటల సుమారులో బయలు దేరారు. ఈ క్రమంలో 10.40 గంటల సుమారులో హసన్ పర్తి సమీపంలోని నల్లగట్టు గుట్ట వద్దకు చేరుకోగా.. హనుమకొండ వైపు నుంచి ఎల్కతుర్తి వైపు వెళ్తున్న అశోక్ లే ల్యాండ్ వాహనం ఉదయ్, రజిత వెళ్తున్న బైక్ ను ఎదురుగా ఢీకొట్టాడు. వేగంగా ఢీకొట్టడంతో రామటెంకి ఉదయ్, రజిత బైక్ పై నుంచి ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదంలో ఉదయ్ తలకు తీవ్ర గాయాలు కాగా.. రజిత కుడి కాలుకు గాయమైంది.
దీంతో గమనించిన స్థానికులు వెంటనే హసన్ పర్తి పోలీసులతో పాటు 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ఉదయ్, రజితను అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా తల భాగంలో గాయాలు కావడంతో తీవ్ర రక్త స్రావం జరిగి ఉదయ్ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. రజిత కుడి కాలు విరగడంతో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే అశోక్ లే ల్యాండ్ వాహనం నడిపిన నూనావత్ పవన్ పై మృతుడు ఉదయ్ తండ్రి శ్రావణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హసన్ పర్తి సీఐ చేరాలు వివరించారు.
ప్రమాదాలకు కేరాఫ్ నల్లగట్టుగుట్ట
హసన్ పర్తి – ఎర్రగట్టు గుట్ట మధ్యలో స్థానిక పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న నల్లగట్టు గుట్ట ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇక్కడ తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. గతంలో పోలీస్ అధికారులు దీనిని బ్లాక్ స్పాట్ గా గుర్తించారు. అప్పట్లో ప్రమాదాల నివారణ కోసమని ఇక్కడ ప్లాస్టిక్ కోన్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడవి కనిపించకుండా పోగా.. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రమాదకరంగా నల్లగట్టు గుట్ట క్రాస్ వద్ద తగిన చర్యలు చేపట్టి, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం
టాపిక్