




Best Web Hosting Provider In India 2024

Gold Smuggling: సినీ ఫక్కీలో మోసం… విదేశీ బంగారం కాజేసిన ఇద్దరు అరెస్టు.. మరో ఇద్దరు పరారీ
Gold Smuggling: కస్టమ్స్ అధికారుల కళ్ళుగప్పారు. విదేశాల నుంచి బారీగా గోల్డ్ తీసుకొచ్చారు. నిర్దేశించిన వ్యక్తికి ఇవ్వకుండా మరో వ్యక్తికి ఇచ్చి కాజేయాలని చూశారు. కానీ వ్యూహం బెడిసి కొట్టి ఇద్దరు పోలీసులకు చిక్కగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. విదేశీ బంగారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టిస్తుంది.

Gold Smuggling: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన ఆవసరాల నిమిత్తం సౌదీఅరేబియా నుంచి తెప్పించుకున్న బంగారాన్ని తీసుకొచ్చిన వ్యక్తులే కాజేసిన ఘటన వేములవాడలో వెలుగులోకి వచ్చింది.
వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన రుద్ర రాంప్రసాద్ సౌదీ ఆరేబియాలోని తన సమీప బంధువు రవీందర్ ద్వారా 400 గ్రాముల బంగారం తెప్పించుకునేందుకు అతనికి రూ.30 లక్షలు పంపించాడు.
ఈ క్రమంలో రవీందర్ తన స్నేహితుడు సౌదీలో ఉంటున్న వేములవాడకు చెందిన కాల్వ వెంకటేష్ కు పరిచయస్తులైన చందుర్తి మండలం జోగాపూర్ కు చెందిన తొంటి భీరయ్య, గడ్డం అనిల్ పంపించాడు. ఈ మొత్తం బంగారంను కాజేయాలని కాల్వ వెంకటేశ్, భీరయ్య, అనిల్ పథకం పన్నారు. ఈ విషయాన్ని తమ సమీప బంధువు ఇండియాలో ఉన్న ఏనుగుల నాగరాజుకు తెలిపారు.
విమానాశ్రయంలో దిగిన వెంటనే నాగరాజుకు బంగారం బిస్కెట్లు ఇవ్వడంతో అతను మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తనకు సంబంధించిన వ్యక్తులకు బంగారం ఇవ్వలేదని మల్లాపూర్ కు చెందిన రాంప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసుల విచారణతో వెలుగులోకి…
రాంప్రసాద్ పిర్యాదుతో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగగా విదేశాల నుంచి అక్రమంగా బంగారం తరలించడమే కాకుండా కాజేశారనే విషయం బయటపడింది. చందుర్తి మండలం తొంటి బీరయ్య, గడ్డం అనీల్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మోసానికి తెరలేపిన ఏ1 కాల్వ వెంకటేశ్ సౌదీలో ఉండగా, విదేశీ బంగారంతో ఉడాయించిన ఏ2 నాగరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
వారిద్దరిని పట్టుకునేందుకు ఇద్దరు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఏఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న ఏనుగుల నాగరాజులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.
అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారుల కన్నుగప్పి పెద్ద మొత్తంలో బంగారం తీసుకురావడంలో ఇంకా ఏదైనా ముఠా హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 400 గ్రాముల బంగారం రికవరీ చేయడమే కాకుండా త్వరలోనే మిగిలిన నిందితులను కూడా పట్టుకుంటామని తెలిపారు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం
టాపిక్