


Best Web Hosting Provider In India 2024
Hyderabad : ఒత్తు జుట్టు కోసం వెళ్తే.. ఉన్న వెంట్రుకలు ఊడిపోయాయి.. హైదరాబాద్‌లో ఘరానా మోసం!
Hyderabad: బట్టతలపై జుట్టు వస్తుందా.. అవును వస్తుంది.. అంటూ ఓ వ్యక్తి వీడియో రిలీజ్ చేశాడు. అదికాస్త వైరల్ అయ్యింది. దీంతో బట్టతల బాబులు అతని వద్దకు క్యూకట్టారు. వారందరికీ గుండు గీసిన సదరు మోసగాడు.. కెమికల్స్ పూశాడు. ఆ తర్వాత సీన్ రివర్సైంది. సైడ్ ఎఫెక్ట్స్‌తో చాలామంది ఆస్పత్రుల్లో చేరారు.
హైదరాబాద్‌లో ఘరానా మోసం జరిగింది. బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ.. ఢిల్లీకి చెందిన షకీల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. హైదరాబాద్ పాతబస్తీలోని తన ఫ్రెండ్ షాపునకు రావాలని చెప్పాడు. దీంతో చాలామంది బట్టతల ఉన్నవారు షకీల్ వద్దకు వెళ్లారు. ఒక్కొక్కరి దగ్గర రూ.100 తీసుకుని గుండు కొట్టి, కెమికల్స్ రాసి పంపించాడు.
తలపై బొబ్బలు..
గుండు ఆరిపోకుండా ఉంచాలని.. అప్పుడే మళ్లీ వెంట్రుకలు నిండుగా వస్తాయని షరతు కూడా పెట్టాడు. అందుకు అంగీకరించి చాలామంది కెమికల్ రాసుకున్నారు. వారి దగ్గర డబ్బులు తీసుకొని షకిల్ వెళ్లిపోయాడు. అయితే.. కొంతమందిపై కెమికల్ ఎఫెక్ట్ చూపించింది. తలపై బొబ్బలు వచ్చాయి. బట్టతల ఏమో కాని.. ఉన్న వెంట్రుకలూ పోయాయని వందలాది మంది యువకులు లబోదిబోమంటున్నారు. బాధిత యువకులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు.
జుట్టు ఎందుకు రాలిపోతుంది..
జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. జన్యుపరమైన కారణాల వల్ల జుట్టు రాలుతుంది. కొన్ని వైద్య పరిస్థితులు, అంటే అలోపేసియా అరేటా, స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు, ఇతర చర్మ వ్యాధులు జుట్టు రాలడానికి కారణమవుతాయి. కొన్ని మందులు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి. శారీరక లేదా మానసిక ఒత్తిడి జుట్టు రాలడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
నీటిలో మార్పుల వల్ల కూడా..
విటమిన్లు, ఖనిజాల లోపం జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. జుట్టుకు అధిక వేడిని ఉపయోగించడం, రసాయన చికిత్సలు, బిగుతుగా కట్టడం వంటివి జుట్టు రాలడానికి కారణమవుతాయి. వయస్సు పెరిగే కొద్దీ జుట్టు రాలడం సహజం. కాలుష్యం జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. నీటిలో మార్పుల వల్ల కూడా జుట్టు రాలవచ్చు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
బట్టతలపై జుట్టు ఎలా వస్తుంది..
జుట్టు మళ్లీ రావాలంటే.. ప్రోటీన్లు, ఐరన్, జింక్, విటమిన్ బి, విటమిన్ ఇ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలు, గింజలు, డ్రై ఫ్రూట్స్, గుడ్లు, పప్పులు, చేపలు వంటి ఆహారాలు జుట్టు ఆరోగ్యానికి మంచివి. నెత్తికి నూనెతో మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది, ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కొబ్బరి నూనె, ఆముదం, ఆలివ్ నూనె, ఉసిరి నూనె వంటి సహజ నూనెలను ఉపయోగించవచ్చు.
మోసపోవద్దు..
మినోక్సిడిల్, ఫినాస్టరైడ్ వంటి మందులు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనేది శాశ్వత పరిష్కారం. ఏదైనా చికిత్స ప్రారంభించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. బట్టతలకి కారణం తెలుసుకొని సరైన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ.. ఇలాంటి ప్రకటనలు నమ్మి మోసపోవద్దు అని నిపుణులు సూచిస్తున్నారు. అవగాహన లేకుండా ఏదైనా కెమికల్స్ వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్