World Health Day 2025: బయట ఆహారాలు తినడం వల్ల వచ్చే 5 రకాల వ్యాధులు, తగిన జాగ్రత్తల గురించి తెలుసుకోండి!

Best Web Hosting Provider In India 2024

World Health Day 2025: బయట ఆహారాలు తినడం వల్ల వచ్చే 5 రకాల వ్యాధులు, తగిన జాగ్రత్తల గురించి తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu
Published Apr 07, 2025 02:00 PM IST

World Health Day 2025: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బయట ఆహారం, ముఖ్యంగా రోడ్డు పక్కనే దొరికే ఆహారం ఏ విధమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందో తెలుసుకోండి. ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ ఆహారాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి.

బయటి తిండి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యుల తలెత్తుతాయి
బయటి తిండి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యుల తలెత్తుతాయి ( freepik)

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (World Health Day) ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడం, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల ప్రాధాన్యతను చర్చించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి, నివారణ చర్యలను ప్రోత్సహించడం లక్ష్యంగా స్థాపించింది. అంతేకాదు ప్రతి ఏడాది ఈ రోజును ఒక ప్రత్యేక థీమ్‌తో ఈ రోజును జరుపుకుంటారు.

పేదరికం, నీటి కొరత, మానసిక ఆరోగ్యం, వాతావరణ మార్పు వంటి గ్లోబల్ సమస్యలపై దృష్టి పెట్టడమే దీని ఉద్దేశం. ఈ రోజున చాలా చోట్ల ఆరోగ్య సంరక్షణ విషయంలో అవగాహన కార్యక్రమాలు, చర్చలు, ప్రచారాలు వంటి జరుపిస్తారు. ఈప్రత్యేకమైన రోజున మనం బయట ఆహారాలు తినడం వల్ల కలిగే ముఖ్యమైన 5 రకాల వ్యాధులు, వీటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

బయట ఆహారాలు తినడం వల్ల వచ్చే 5 రకాల వ్యాధులు:

1. ఫుడ్ పాయిజనింగ్(Food poisoning):

బయట దొరికే ఆహారాలు కలుషితమై ఉంటాయి. పరిశుభ్రత లోపం కారణంగా ఈ ఆహారాల్లో బ్యాక్టీరియా ఎక్కువగా చేరుకుంటుంది. వీటిని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని తరచూ తినడం వల్ల ఈ.కోలై, సాల్మోనెల్లా వంటి సమస్యలతో పాటు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు కలుగుతాయి.

2. కడుపులో సంక్రమణ(stomach infection)

అపరిశుభ్రంగా తయారుచేసిన ఆహారాలు తినడం వల్ల కలరా, టైఫాయిడ్ లేదా హెపటైటిస్ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. బయట తినేటప్పుడు పరిశ్రుభ్రతను పరిగణలోకి తీసుకోవడం మర్చిపోకండి.

3. అలర్జీలు(Allergies)

బయట ఆహారాలను విక్రయించే వాళ్లలో చాలా మంది పాడైపోయిన పదార్థాలను ఉపయోగించడం, ఆహారాలను వేడి చేసి చేయడం, వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడటం వంటివి చేస్తుంటారు. ఇలాంటి వాటి వల్ల వీటిని తింటే చర్మంపై దద్దుర్లు వంటి అలెర్జీలు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటివి కలుగుతాయి. కాబట్టి బయట తినేటప్పుడు నమ్మదగిన ప్రదేశాలను మాత్రమే ఎంచుకోండి. వీలైనంత వరకూ ఇంట్లో తయారు చేసిన ఆహారాలనే తినండి.

4. బరువు పెరగడం, గుండె జబ్బులు(Weight gain and heart disease)

బయట వేయించిన ఆహారాలు, ఎక్కువ నూనెతో తయారుచేసిన ఆహారాలను తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ అధికమవుతుంది. ఇది అనారోగ్యకరమైన బరువును పెంచుతుంది. ఎందుకంటే ఇందులో ట్రాన్స్ కొవ్వు, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి బరువు పెరగడానికి కారణం అవుతాయి.

5. జీర్ణ సంబంధిత సమస్యలు(Digestive problems)

కారం, మసాలాలు అపరిశుభ్రమైన వాతావరణం కలగలిపి తయారైన ఆహార పదార్థాలను తినడం వల్ల అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటివి ఏర్పడి జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తాయి. కారం ఆహారంలో ఉండే కెప్సైసిన్ వంటి రసాయనాలు జీర్ణవ్యవస్థలో మంటను కలిగిస్తాయి, అజీర్ణం లక్షణాలను కలిగిస్తాయి. అపరిశుభ్రమైన ఆహారంలో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లు జీర్ణవ్యవస్థలో ఇన్ఫెక్షన్ కు కారణమవుతాయి.

బయట ఆహారాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

1. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

బయట ఆహారం తీసుకునే ముందు పరిశుభ్రతను చెక్ చేసుకోండి. ఉదాహరణకు, ఆహారం అందించే వ్యక్తి చేతులు, పాత్రలు, నీటి నాణ్యతను పరిశీలించండి. నమ్మకం కలిగితేనే తినండి.

2. తాజా ఆహారం తినండి

ఆరోగ్యంగా ఉండటానికి, ఎల్లప్పుడూ ఇంట్లో తయారుచేసిన తాజా ఆహారం తినడానికి ప్రయత్నించండి. పాత లేదా చెడిపోయిన ఆహారం తినడం మానుకోండి. బయటకు వెళ్ళాల్సి వస్తే, ఇంటి నుండి నీరు, తేలికపాటి పోషకాహారం తీసుకెళ్ళండి. రోడ్డుపక్కన అమ్ముతున్న జ్యూస్, ఐస్ క్రీం లేదా కోల్డ్ డ్రింక్స్ తాగడం మానుకోండి.

3. నీటి శుద్ధి ముఖ్యం

బయట ఆహారం తీసుకునేటప్పుడు బాటిల్డ్ వాటర్ లేదా మరిగించి శుద్ధి చేసిన నీరు త్రాగండి. తెరిచి ఉంచిన నీరు తాగడం మానుకోండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024