


Best Web Hosting Provider In India 2024
Health of the Nation 2025 : హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025.. నివేదిక విడుదల చేసిన అపోలో.. పూర్తి వివరాలు ఇవే
Health of the Nation 2025 : హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025 నివేదికను అపోలో హాస్పిటల్స్ విడుదల చేసింది. ఈ నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. విద్యార్థుల నుంచి పెద్దల వరకు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను వివరించింది. దేశవ్యాప్తంగా 25 లక్షల మందిని పరీక్షించిన తర్వాత.. ఈ నివేదికను విడుదల చేసింది.
అపోలో హాస్పిటల్స్ తమ ‘హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025 (హెచ్‌ఓఎన్ –2025)’ నివేదికను విడుదల చేసింది. ‘లక్షణాల కోసం వేచి చూడకండి–నివారణ ఆరోగ్యాన్ని మీ ప్రాధాన్యతగా మలుచుకోండి’ అని సందేశాన్ని ఇచ్చింది. భారతదేశంలో అపోలో హాస్పిటల్స్‌లో 25 లక్షల మందికి పైగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వీటి ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
లక్షణాలు లేకున్నా..
నివేదిక ప్రకారం.. లక్షలాది మంది ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ దీర్ఘకాలిక అనారోగ్య స్థితిని కలిగి ఉంటున్నారు. ఎలాంటి లక్షణాలు లేకున్నా 26 శాతం మంది హైపర్‌టెన్షన్ కలిగి ఉన్నారు. 23 శాతం మంది మధుమేహం కలిగి ఉన్నారు. నివారణ ఆరోగ్య పరీక్షలు అసాధారణంగా పెరుగుతున్నట్లుగా అపోలో హాస్పిటల్స్ స్పష్టం చేసింది. 2019లో పది లక్షలుగా ఉన్న ఈ పరీక్షలు 2024కు వచ్చేసరికి 25 లక్షలకు చేరుకున్నాయి. కేవలం ఐదు సంవత్సరాలలో 150 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రజల్లో అవగాహన పెరగుతుండటాన్ని ఇది సూచించడమే కాదు, ఆరోగ్య సంరక్షణ కోసం చురుకైన చర్యలు తీసుకుంటుండటమూ ప్రతిబింబిస్తుందని అపోలో అభిప్రాయపడింది.
ఆరోగ్య సవాళ్ల నివేదిక..
హెచ్‌ఓఎన్ –2025 నివేదికలో వెల్లడించిన అంశాలను.. డీ–ఐడెంటిఫైడ్ ఎలక్ట్రానిక్ మోడల్ రికార్డ్స్ (నివారణ ఆరోగ్య పరీక్షల ఈఎంఆర్‌లు), నిర్మాణాత్మక క్లీనికల్ పరిశీలనలు, అపోలో హాస్పిటల్స్, క్లీనిక్స్, డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లు, వెల్‌నెస్ కేంద్రాల్లో ఏఐ ఆధారిత రిస్క్ సంతృప్తి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని వెల్లడించారు. ఈ నివేదిక ప్రధానంగా మూడు అత్యవసర ఆరోగ్య సవాళ్లు – ఫ్యాటీ లివర్ రోగాలు, మెనోపాజ్ తరువాత వచ్చే ఆరోగ్య సమస్యలు, బాల్యదశలో వచ్చే ఉబకాయం గురించి వెల్లడించింది. చికిత్స జోక్యం, జీవనశైలి ఆధారిత సంరక్షణ నమూనాలను గురించి నొక్కి చెప్పింది.
ఆరోగ్య భారతం కోసం..
ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రతి ఇంటిలోనూ ఆరోగ్యానికి అమిత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సంతోషకరమైన, ఆరోగ్యవంతమైన కుటుంబాలను సృష్టించే అవకాశాన్ని పొందేలా భారతదేశం నిలవాలి. నివారణ ఆరోగ్యం అనేది ఇక ఎంతమాత్రమూ భవిష్యత్ కోరిక కాదు. అది నేటి దేశ శ్రేయస్సుకు మూలం. ఈ నివేదిక వేగంగా మనం చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని, లోతుగా పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతను, ప్రతి ఒక్కరికీ ఈ అంశాల పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా తగిన అవకాశాలను కల్పించాల్సిన సమిష్టి బాధ్యతను వెల్లడిస్తుంది. కార్పోరేట్ ప్రయోజనాలు, కుటుంబ దినచర్యల్లో నివారణ ఆరోగ్య సంరక్షణను భాగంగా చేసుకునేందుకు సమయమిది. అప్పుడు మాత్రమే అనారోగ్యానికి చికిత్స చేయించుకోవడం నుంచి ఆరోగ్యంను కాపాడుకునే దిశగా మనం మారగలం. భావి తరాల కోసం ఆరోగ్యవంతమైన భారతావనిని సృష్టించగలం’ అని వ్యాఖ్యానించారు.
66 శాతం మందికి ఫ్యాటీ లివర్..
అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీతా రెడ్డి మాట్లాడుతూ.. ‘ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తు అనేది ముందస్తుగా, డాటా ఆధారితంగా, వ్యక్తికతీకరించబడుతుందనే అపోలో దీర్ఢకాల సిద్ధాంతాన్ని’హెల్త్ ఆఫ్ ద నేషన్’ నివేదిక పునరుద్ఘాటిస్తుంది. పరీక్షలు చేయించుకున్న వ్యక్తులలో 66 శాతం మంది ఫ్యాటీ లివర్ కలిగి ఉన్నారు. వీరిలో 85 శాతం మంది ఆల్కహాల్ తీసుకోని వారే. ఇది నూతన ఆరోగ్య పరీక్షలు, విస్తృత స్థాయిలో ముందస్తుగా సమస్యను కనుగొనడం వంటి అత్యవసర స్థితిని వెల్లడిస్తుంది. సంప్రదాయ పరీక్షలు ఎంత మాత్రమూ సరిపోవు. అపోలో ప్రో హెల్త్ ప్రోగ్రామ్ కేవలం వ్యక్తులను తమ ఆరోగ్యం తాము కాపాడుకునేందుకు తగిన అవకాశాలను కల్పించడం మాత్రమే కాదు.. నివారణ ఆర్యోగ సంరక్షణ కోసం పునాదిని కూడా వేస్తోంది. ప్రో హెల్త్ చూపుతున్న ఫలితాలు ప్రకారం.. స్ధిరంగా పరీక్షలు చేయటం, వాస్తవ సమాచారంతో పెద్ద స్థాయిలో ప్రభావాన్ని సృష్టించగలం. నివారణ అనేది భారతదేశంలో ఎక్కువగా విస్తరించతగిన ఆరోగ్య సంరక్షణ పరిష్కారం. నివారణ ఆరోగ్యాన్ని అందరికీ చేరువ చేసే లక్ష్య సాకార దిశగా అపోలో కృషి చేస్తోంది’ అని వివరించారు.
ముఖ్యాంశాలు..
1.ఫ్యాటీ లివర్- పరీక్షించబడిన 257,199 మందిలో 65 శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉంది. వీరిలో 85 శాతం మంది మద్యపానం అలవాటు లేనివారే.
2.గుండె ప్రమాదాలు- 46 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ.. అథెరోస్క్లెరోసిస్ లక్షణాలు కనిపిస్తున్నాయి.
3.మెనోపాజ్ తర్వాత ఆరోగ్యం- మధుమేహం ఒక్కసారిగా 14 శాతం నుండి 40 శాతానికి పెరిగింది. ఊబకాయం 76 శాతం నుండి 86 శాతానికి పెరిగింది.
4.పిల్లలు, విద్యార్థులు- కళాశాల విద్యార్థులలో 28 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. 19 శాతం మంది ప్రీ-హైపర్‌టెన్సివ్ గా ఉన్నారు
5.హైపర్ టెన్షన్- 4,50,000 కంటే ఎక్కువ మంది వ్యక్తుల్లో జరిపిన పరీక్షల్లో 26 శాతం మంది కంటే ఎక్కువగానే అధిక రక్తపోటు కనిపించింది.
6.పోషక లోపాలు- 77 శాతం మంది మహిళలు, 82 శాతం మంది పురుషుల్లో విటమిన్ డి లోపం ఉంది.
7.మానసిక ఆరోగ్యం- పరీక్షలు నిర్వహించిన 47,424 మందిలో 6 శాతం మందిలో నిరాశ సంకేతాలు కనిపించాయి.
8.నిద్ర రుగ్మతలు- పరీక్షించబడిన 53,000 మందిలో 24 శాతం మందికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) ప్రమాదం ఎక్కువగా ఉంది.
9.ప్రోహెల్త్ ప్రోగ్రామ్ ఫలితాలు- 59 శాతం మందిలో HbA1C (డయాబెటిస్ మార్కర్) తగ్గితే, 51 శాతం మందిలో బీపీ తగ్గింది. 47 శాతం ప్రవర్తనా పరమైన మార్పుల ద్వారా బరువు తగ్గారు.
టాపిక్