




Best Web Hosting Provider In India 2024

Apollo Health Report : సైలెంట్ గా విస్తరిస్తోన్న గుండె జబ్బులు, ప్రతి నలుగురిలో ఒకరి -అపోలో ఆరోగ్య నివేదిక
Apollo Health Report : అపోలో హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా 25 లక్షల మందికి నిర్వహించిన ఆరోగ్య పరీక్షల ఆధారంగా ‘హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025′ నివేదిక రూపొందించింది. ఎలాంటి లక్షణాలు లేకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని పేర్కొంది. లక్షణాలు లేనప్పటికీ 26% మందికి హైబీపీ, 23% మంది మధుమేహంతో బాధపడుతున్నారు.

Apollo Health Report : అపోలో హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా 25 లక్షల మందికి పైగా నిర్వహించిన ఆరోగ్య పరీక్షల ఆధారంగా ‘హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025′(HON 2025) నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ఆధారంగా ‘ఆరోగ్యా్న్ని మీ ప్రాధాన్యతగా మలుచుకోండి’ అనే స్పష్టమైన సందేశం ఇచ్చింది. అపోలో నివేదిక ప్రకారం చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ దీర్ఘకాలిక అనారోగ్య స్థితిని కలిగి ఉంటున్నారని పేర్కొంది. ఎలాంటి లక్షణాలు లేకున్నప్పటికీ 26 % మంది హైపర్‌టెన్షన్ కలిగి ఉంటే, 23% మంది మధుమేహం కలిగి ఉన్నారని గుర్తించింది.
ఒకప్పుడు మద్యం తాగే వారికి మాత్రమే వచ్చే ఫ్యాటీ లివర్ ఇప్పుడు ఊబకాయం, మధుమేహం, రక్తపోటుతో ముడిపడిన ఆరోగ్య సమస్యగా మారింది. 257,199 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా… ఆశ్చర్యకరంగా 65% మందికి ఫ్యాటీ లివర్ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. కాగా వారిలో 85% మంది మద్యం సేవించనివారు కావడం గమనార్హం. సగానికి పైగా సాధారణ రక్త పరీక్షలు -అంటే సంప్రదాయ రోగ నిర్ధారణ పరీక్షలు మాత్రమే సమగ్ర వ్యాధి నిర్థారణకు సరిపోవు.
మహిళల ఆరోగ్యం
హెచ్ఓఎన్ నివేదిక 2025 ప్రకారం మెనోపాజ్ తర్వాత మహిళలకు ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. మెనోపాజ్ కు ముందు మధుమేహం 14% మందిలో కనిపిస్తే ఆ తరువాత కాలంలో 40%కి పెరుగుతున్నాయి. ఊబకాయం కేసులు 76% నుండి 86%కి పెరిగాయి. ఫ్యాటీ లివర్ ప్రాబల్యం 54% నుండి 70%కి పెరిగింది. ఈ మార్పులు మహిళల దీర్ఘకాలిక ఆరోగ్యంపై హార్మోన్ల మార్పులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని నివేదిక పేర్కొంది. మెనోపాజ్ కు చేరుకుంటున్న మహిళలకు చురుకైన, వ్యక్తిగత ఆరోగ్య ప్రణాళిక పాటించాలని ఈ నివేదిక చెబుతోంది.
పిల్లలలో ఊబకాయం కేసులు పెరుగుతున్నాయి
విద్యార్థులలో ఊబకాయం వేగంగా పెరుగుతోంది. ఇది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ నివేదిక ప్రకారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులలో 8% మంది ఇప్పటికే అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. ఇది ప్రారంభ సూచిక మాత్రమే. కౌమారదశలో ఊబకాయ గణనీయంగా పెరుగుతుంది. ఈ సమస్య కళాశాల విద్యార్థులలో 28% కనిపిస్తోంది. జీవనశైలి, ఆహార మార్పుల ప్రభావాన్ని ఇది తెలియజేస్తుంది. అదనంగా, కళాశాల విద్యార్థులలో 19% మంది ప్రీ-హైపర్‌టెన్సివ్‌గా ఉన్నట్లు కనుగొన్నారు. గతంలో గుర్తించిన దానికంటే చాలా ముందుగానే నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు (NCDలు) వ్యాపిస్తున్నాయి.
అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ ప్రీత రెడ్డి మాట్లాడుతూ, “హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 నివేదిక మనం పరిష్కరించాల్సిన కీలకమైన సమస్యలను, ముఖ్యంగా మహిళల ఆరోగ్యం, బాల్య ఊబకాయానికి సంబంధించిన సమస్యలను వెల్లడిస్తుంది. మెనోపాజ్ తర్వాత జీవక్రియ ప్రమాదాల పెరుగుదల మనకు సాధారణ ఆరోగ్య పరీక్షల కంటే మరింత ఎక్కువ అవసరమనే దానికి స్పష్టమైన సూచిక. మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. మహిళలకు వారి ఆరోగ్య ప్రయాణంలోని ప్రతి దశలోనూ మద్దతును అందిస్తున్నాము. పిల్లలలో పెరుగుతున్న ఊబకాయం, ప్రీ-హైపర్‌టెన్షన్ రేట్లను కూడా ఈ నివేదిక నొక్కి చెబుతుంది. ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదు, త్వరగా చర్య తీసుకోవాల్సిన సంకేతాలు. ఒక మార్గదర్శక సంస్థగా, దేశవ్యాప్తంగా వ్యక్తుల జీవితాల్లో, సామాజిక పరంగా మార్పు తీసుకురావాలని అపోలో నిశ్చయించుకుంది” అని అన్నారు.
రక్తపోటు
రక్తపోటు నిశ్శబ్దమైనదే కానీ నిత్య ప్రమాదంగా మారుతోంది. 2024లో సుమారు 4,50,000 మంది వ్యక్తులను పరీక్షించగా, వారిలో 26% మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని, ఎటువంటి లక్షణాలు లేకుండా ఉన్నారని అపోలో నివేదిక తేలింది. భారతదేశంలో హృదయ సంబంధిత వ్యాధుల భారానికి అధిక రక్తపోటు కీలక తోడ్పాటుదారునిగా నిలుస్తుంది. దీనికి సరైన చికిత్స అందడంలేదు. రక్తపోటుపై మరింత అవగాహన కల్పించాలని ఈ నివేదిక కోరుతుంది. బీపీ ఆరోగ్య సంరక్షణ ప్రక్రియలో ఒక సాధారణ భాగంగా చేయాలని పేర్కొంది.
సాధారణ ఆరోగ్య సమస్యల మాటున గుండె జబ్బులు
ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనరీ కాల్షియం స్కోరింగ్ చేయించుకున్న వ్యక్తులలో 46% మందికి రక్త నాళాలలో కాల్షియం పేరుకుపోవటం కనిపించింది, అది అథెరోస్క్లెరోసిస్ తొలి సంకేతం. వీరిలో 25% మందికి అబ్స్ట్రక్టివ్ కరోనరీ ఆర్టరీ వ్యాధి (CAD) ఉంది. ఆందోళనకరమైన అంశమేమిటంటే, రక్త నాళాలలో కాల్షియం అధికంగా ఉన్నవారిలో 2.5% మంది 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. ముందస్తుగా ప్రమాదాన్ని గుర్తించడానికి కాల్షియం స్కోరింగ్, సీటీ యాంజియోగ్రఫీ వంటి అధునాతన ఇమేజింగ్ పద్ధతుల ప్రాముఖ్యతను ఈ గణాంకాలు మరింతగా వెల్లడిస్తున్నాయి. ప్రతి నలుగురిలో ఒకరికి గుండె సమస్యలు ఉన్నట్లు గుర్తించింది.
మానసిక ఆరోగ్యం
భారతదేశ ప్రజారోగ్యంలో మానసిక ఆరోగ్యం చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉంది. కానీ తాజా డేటా దీనిపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది. PHQ-9 స్కేల్ ఉపయోగించి డిప్రెషన్ కోసం పరీక్షించిన 47,424 మంది వ్యక్తులలో, 7% మంది మహిళలు, 5% మంది పురుషులు క్లినికల్ గా డిప్రెషన్ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ భారం మధ్య వయస్కులలో (40–55) గరిష్ట స్థాయిలో కనిపించింది. ఈ గణాంకాలు పెరుగుతున్న సమస్యను మాత్రమే కాకుండా, ముందస్తు జోక్యానికి ఆటంకం కలిగించే లోతైన సామాజిక అపోహలను కూడా వెల్లడిస్తున్నాయి. సాధారణ ఆరోగ్య పరీక్షలలో సమగ్ర మానసిక ఆరోగ్య అంచనాలు, డిజిటల్ మానసిక ఆరోగ్య వేదికల విస్తృత ఉపయోగం, సానుకూల, సకాలంలో సంరక్షణను అందించడానికి సామాజిక స్థాయి అవగాహన కోసం అపోలో హాస్పిటల్స్ ప్రచారం చేస్తోంది.
అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) -విస్మరించరాని నిద్రలేమి సమస్యలు
ది హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 నివేదిక ఆశ్చర్యకరమైన ధోరణిని వెల్లడిస్తుంది. ప్రతి నలుగురు భారతీయులలో ఒకరు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) ప్రమాదానికి అధిక చేరువలో ఉన్నారు. ఇది ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులు, పగటిపూట అలసటతో దగ్గరి సంబంధం ఉన్న సమస్య. దాదాపు 53,000 మంది వ్యక్తులపై నిర్వహించిన పరీక్షల ఆధారంగా, 33% మంది పురుషులు, 10% మంది స్త్రీలను అధిక ప్రమాద స్థాయికి దగ్గరగా ఉన్న వ్యక్తులుగా గుర్తించారు. వయస్సుతో పాటు ప్రమాద స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. ఇది 55 ఏళ్లు పైబడిన 68% మంది పురుషులు, 22% మంది స్త్రీలను ప్రభావితం చేస్తుంది. అధిక ప్రాబల్యం ఉన్నప్పటికీ, OSA నిర్ధారణ తక్కువగానే ఉంది. తరచుగా సాధారణ అలసట లేదా ఒత్తిడిగా తప్పుగా భావిస్తున్నారు. జీవక్రియ పరీక్షలలో సాధారణ నిద్ర ప్రమాద అంచనాలు, OSA లక్షణాల గురించి విస్తృత స్థాయిలో ప్రజా అవగాహన, నివారణ సంరక్షణకు అత్యంత కీలకంగా నిద్రను గుర్తిస్తూ ఆఫీస్ వెల్‌నెస్ కార్యక్రమాలకు అపోలో పిలుపునిస్తోంది.
క్యాన్సర్ గుర్తింపు
2024లో గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణకు సగటు వయస్సు 49 సంవత్సరాలు, రొమ్ము క్యాన్సర్‌కు 57 సంవత్సరాలు, ఊపిరితిత్తుల క్యాన్సర్ 61 సంవత్సరాలుగా ఉంది. పట్టణ, గ్రామీణ జనాభాలో సాధారణ ఆరోగ్య పరీక్షలు, అవగాహన మెరుగుపరచడం కోసం వయస్సు పరిమితిని తగ్గించాలని నివేదిక సూచించింది.
సూక్ష్మపోషక లోపాలు:
రక్తహీనత 45% మంది స్త్రీలను, 26% మంది పురుషులను ప్రభావితం చేసింది. అయితే విటమిన్ D లోపం 77% మంది స్త్రీలను, 82% మంది పురుషులను ప్రభావితం చేసింది. విటమిన్ B12 లోపం కూడా అధికంగా ఉంది, 38% మంది పురుషులు, 27% మంది స్త్రీలు తక్కువ స్థాయిలను చూపించారు. 40 ఏళ్లలోపు వారిలో ఈ లోపం మరింత స్పష్టంగా కనిపించింది. 49% మంది పురుషులు, 35% మంది స్త్రీలు విటమిన్ B12 లోపంతో ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే, శక్తి, జ్ఞానం, జీవక్రియ పనితీరును దెబ్బతింటుంది. జాతీయ పోషకాహారం, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన మొదటి అడుగుగా విస్తృత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను అపోలో పునరుద్ఘాటిస్తుంది.
ఊబకాయం, జీవక్రియ పనిచేయకపోవడం
పరీక్షలు చేయించుకున్న వ్యక్తులలో 61% మంది ఊబకాయం కలిగి ఉన్నారని, మరో 18% మంది అధిక బరువుతో ఉన్నారని నివేదిక వెల్లడించింది. ఊబకాయం అనేక రకాల NCD లకు మూల కారణంగా కనిపిస్తూనే ఉంది. పాఠశాలలు, కార్యాలయాల్లో అవగాహనను విస్తరించడానికి, BMI , జీవక్రియ పరీక్షలను ప్రతి సంవత్సరం ఆరోగ్య తనిఖీలో భాగంగా చేయడానికి అపోలో మద్దతు ఇస్తుంది.
ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ దిశగా
అపోలో హాస్పిటల్ ప్రోహెల్త్ ప్రోగ్రామ్ భారతదేశ ఆరోగ్య సంరక్షణ విధానంలో చికిత్స నుంచి నివారణకు, లక్షణాల నుంచి డేటా ఆధారిత వరకూ ఒక నమూనా మార్పు కోసం ప్రచారం చేయటం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రోహెల్త్ ప్రోగ్రామ్ అధునాతన రోగ నిర్ధారణలు, నిపుణులైన వైద్యుల ద్వారా వెల్నెస్‌కు మార్గనిర్దేశనం, ఏఐ- ఆధారిత ప్రిడిక్టివ్ రిస్క్ స్కోర్‌లు, వ్యక్తిగత ఆరోగ్య ప్రోత్సాహకాలు, ముందస్తు జోక్యాలను మిళితం చేయటం ద్వారా దాని ప్రభావాన్ని నిరూపించింది. ఈ కార్యక్రమం కీలకమైన ఆరోగ్య కొలమానాలను వాస్తవ సమయంలో ఒడిసి పడుతుంది. ప్రతి వ్యక్తికి అనుగుణంగా కార్యాచరణ సిఫార్సులను అందిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా 59% మధుమేహ వ్యాధిగ్రస్తులు HbA1C స్థాయిలను తగ్గించుకోగలిగారని, 51% అధిక రక్తపోటు ఉన్నవారు తమ రక్తపోటును తగ్గించుకున్నారని తెలిపింది. అధిక బరువు ఉన్నవారిలో 47% మంది బరువు తగ్గించుకోగలిగారని పేర్కొంది.
ఆరోగ్య ప్రమాదాలను ముందుగానే గుర్తించటం, వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ, సంక్లిష్ట చికిత్స అవసరమయ్యే ముందు వ్యాధుల పురోగతిని తగ్గించడం ఈ కార్యక్రమం లక్ష్యం. మొత్తంమీద, హెచ్ఓఎన్ -2025 ఫలితాలు ప్రజారోగ్య విధానం, ఆరోగ్య బీమా కవరేజ్, నివారణ ఆరోగ్య సంరక్షణను పొందడానికి అవసరమైన కీలక అంశాలను అందిస్తున్నాయి. ముందస్తు ప్రమాద గుర్తింపు, జీవనశైలి మార్పు, రోగ నిర్ధారణలకు సమానమైన అవకాశాలలోనే ముందుకు సాగే మార్గం ఉంది.
ఆరోగ్య పరీక్షల సంక్షిప్త సమాచారం
ఏపీ, తెలంగాణలో – 24% మంది వ్యక్తులకు అధిక రక్తపోటు ఉన్నట్లు పరీక్షల్లో తెలిసింది. పరీక్షించిన జనాభాలో మొత్తం మీద 82% మంది అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉన్నారు. 81% మంది విటమిన్ D లోపంతో బాధపడుతున్నారు. దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరికి (47%) లో గ్రేడ్-I ఫ్యాటీ లివర్ సంకేతాలు కనిపించాయి. ఇది ఊబకాయం, జీవక్రియ అసమతుల్యతలతో ముడిపడి ఉన్న ప్రారంభ దశ. పరీక్షించిన 27% మందికి రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఐరన్ అధికంగా ఉండే ఆహారాలలో పోషకాహార లోపాలను సూచిస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్