




Best Web Hosting Provider In India 2024

హార్వర్డ్ అధ్యయనం ప్రకారం మెదడు సంబంధిత వ్యాధులకు దారితీసే 17 ప్రమాద కారకాలు ఇవే!
వృద్ధాప్యంలోనూ మెదడును చురుగ్గా ఉంచుకోవాలనుకుంటున్నారా? డిప్రెషన్, డెమెన్షియా వంటి మెదడు సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండాలనుకుంటున్నారా? అయితే మెదడు అనారోగ్యానికి కారణమయ్యే కొన్ని అలవాట్లు, సమస్యల గురించి తెలుసుకోండి. మీ జీవినశైలిలో మార్పులకు తావివ్వండి.

వయస్సు పెరిగే కొద్దీ ఆలోచనల్లో, మెదడు పనితీరులో కాస్త మందగింపు ఉంటుంది. కొందరిలో అది మితిమీరి మతిమరుపుతో పాటు ఇతర సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. అయితే, మెదడు అనారోగ్యానికి గురి కావడానికి వయస్సొక్కటే కాదట. బ్రెయిన్ స్ట్రోక్, డైమెన్షియా లాంటి ప్రమాదకరమైన సమస్యలకు గురైన వారిలో ఈ ప్రమాదకారకాలను గుర్తించిందొక అధ్యయనం. హార్వర్డ్‌కు అనుబంధంగా ఉన్న మాస్ జనరల్ బ్రిఘమ్‌లోని పరిశోధకులు గుర్తించిన 17 జీవనశైలి మార్పులను గుర్తుంచుకుంటే, రాబోయే బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గించుకోవచ్చు.
మీ రోజువారీ కార్యక్రమంలో చిన్న మార్పులు చేయడం ద్వారా, కొన్ని ఆరోగ్య పరిస్థితులను మెయింటైన్ చేయడం ద్వారా మెదడును రక్షించుకునేందుకు పెద్ద మార్పును తీసుకురావొచ్చట. బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలను తీసుకొచ్చే ప్రమాద కారకాలేంటంటే..
17 ప్రమాద కారకాలు:
1. డయాబెటిస్ – ఈ దీర్ఘకాలిక వ్యాధి మెదడులోని మూడు ప్రధాన భాగాల్లో ప్రమాదాన్ని పెంచుతుంది.
2. హై బీపీ – స్ట్రోక్, డిమెన్షియా, డిప్రెషన్‌కు ప్రధాన కారణం.
3. మూత్రపిండ వ్యాధి – కిడ్నీ వ్యాధి రక్తపోటుపై ప్రభావం చూపుతుంది. స్ట్రోక్ కలిగే ప్రమాదాన్ని పెంచుతుంది. మెదడులో రక్తప్రవాహ వేగాన్ని తగ్గించి, నాడీ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.
4. హై ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ – ఉదయం లేచిన వెంటనే బ్లడ్ షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే కూడా మెదడుపై తీవ్ర ప్రమాదం కలిగించొచ్చు.
5. హై కొలెస్ట్రాల్ – ముఖ్యంగా స్ట్రోక్, జ్ఞాన సంబంధిత క్షీణతకు దారి తీయవచ్చు.
6. అధిక మద్యం సేవనం – మద్యానికి బానిస అయిన వారిలో మెదడు ఆరోగ్యం క్షీణిస్తుంది. మానసిక స్థితిని ప్రతికూలంగా మార్చేస్తుంది.
7. ఆరోగ్యకరమైన ఆహారం లేకపోవడం – మెదడు పనితీరును ప్రభావితం చేసే ప్రమాద కారకాలలో ఆరోగ్యకరమైన ఆహారం లేకపోవడం పెద్ద పాత్ర పోషిస్తుంది.
8. వినికిడి లోపం – వినికిడి లోపం ఉన్న వారు మాటలను అర్థం చేసుకోవడానికి మెదడు శక్తిని ఎక్కువగా వినియోగించాల్సి ఉంటుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి, ఆలోచనలపై దృష్టి పెట్టలేరు. క్రమంగా ఇది డిమెన్షియా ప్రమాదానికి దారి తీస్తుంది.
9. దీర్ఘకాలిక నొప్పి – మానసిక శ్రేయస్సు, జ్ఞాన సంబంధిత పనితీరును ప్రభావితం చేస్తుంది.
10. శారీరక శ్రమ లేకపోవడం – శరీరానికి తగ్గ శ్రమ లేకపోవడం వల్ల మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. మెదడుకు సాధారణ ప్రమాద కారిగా ఉంటుంది.
11. లక్ష్యం లేకపోవడం – లక్ష్యం లేకుండా శ్రమించడం వల్ల విజయవంతం కాలేరు. ఫలితంగా డిప్రెషన్ ప్రమాదం పెరుగుతుంది.
12. పేలవమైన నిద్ర – కంటికి సరిపడ నిద్ర లేకపోవడం వల్ల మెదడుపై అదనపు భారం పడుతుంది. ఇది భావోద్వేగ, మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
13. ధూమపానం – వివిధ మెదడుకు సంబంధించిన వ్యాధులకు కారణం అవుతుందని అందరికీ తెలిసిందే.
14. ఒంటరితనం – మానసికంగా ఒంటరితనంలో కుమిలిపోయే వారిలో డిప్రెషన్, జ్ఞాన సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
15. దీర్ఘకాలిక ఒత్తిడి – మానసిక, మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది.
16. చికిత్స చేయని డిప్రెషన్ – డిప్రెషన్ కలుగుతుందని తెలిసి పరిష్కారం దిశగా వెళ్లాలి. దానిని నిర్లక్ష్యపెడుతూ పోతే మరింత న్యూరోలాజికల్ సమస్యలకు దారితీస్తుంది.
17. ఊబకాయం – స్ట్రోక్, డిమెన్షియా, డిప్రెషన్‌కు అవకాశాలను పెంచుతుంది.
మెదడు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి
మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, చురుకుగా ఉండటం, హై బీపీ లేదా డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచుకోవాలి. సామాజికంగా నిమగ్నమై ఉండటం వంటి సరళమైన జీవనశైలి మార్పుల ద్వారా, ప్రజలు తమ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అర్థవంతమైన చర్యలు తీసుకోవడానికి సహకరిస్తుంది. వృద్ధాప్యంలోకి వెళ్ళే కొద్దీ డిమెన్షియా, డిప్రెషన్, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి, ఈ అధ్యయనం మనం అనుకున్న దానికంటే మనకు ఎక్కువ నియంత్రణ ఉండవచ్చు. ధూమపానం మానేయడం, నిద్రను మెరుగుపరచడం లేదా నేడు ఒత్తిడిని నిర్వహించడం వల్ల ఆరోగ్యకరమైన మెదడు, మెరుగైన జీవనశైలికి దారి తీస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.