




Best Web Hosting Provider In India 2024

AP TG Weather : ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్స్- రేపు, ఎల్లుండి అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షం
AP TG Weather : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన చేసింది. ఏపీలో రేపు, ఎల్లుండి అకస్మాత్తుగా పిడుగులతో కూడిన అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్ష సూచన చేసింది. అయితే ఉష్ణోగ్రతలు మాత్రం 41 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నాయి.

AP TG Weather : బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో గురు,శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రేపు(ఏప్రిల్ 8), ఎల్లుండి అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
సోమవారం నంద్యాలలో 41.5°C, కర్నూలు జిల్లా నడిచాగిలో 41.1°C, వైఎస్సార్ జిల్లా బలపనూరులో 41°C, ప్రకాశం జిల్లా నందనమారెళ్ళలో 40.8°C, తిరుపతి జిల్లా గూడూరు, విజయనగరం జిల్లా నెలివాడలో 40.6°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైందని అధికారులు తెలిపారు. 39 చోట్ల 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వెల్లడించారు. ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండతీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలి, గొడుగు ఉపయోగించాలని సూచించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం
ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం ఉదయం 8.30 గంటలకు దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది రేపటి వరకు వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాతం వైపు, ఆ తరువాత 48గంటల్లో ఉత్తరదిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపుగా కదిలే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ తమిళనాడు వరకు నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. మరాఠ్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక అంతర్భాంగా ఉత్తర-దక్షిణ ద్రోణిని ఈరోజు తక్కువగా గుర్తించారు.
తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణలో రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2-4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రేపు(ఏప్రిల్ 8) తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ నెల 10, 11.12,13 తేదీల్లో రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
సంబంధిత కథనం
టాపిక్