




Best Web Hosting Provider In India 2024

Tuesday Motivation: శక్తివంతుడు మాత్రమే ఎదుటివారి తప్పులను మన్నించి క్షమించగలడు, మీరు శక్తివంతులా? కాదా?
Tuesday Motivation: క్షమించడం చాలా చిన్న పని. కానీ ఆ పని చేయడం ఎంతోమందికి కష్టంగా ఉంటుంది. తమను అవమానించిన వారిని, మోసం చేసిన వారిని క్షమించలేరు. క్షమాపణ అనేది మిమ్మల్ని మరింత ఉన్నతంగా మారుస్తుంది.

భారతదేశం అప్పట్లో ఇంకా బ్రిటిష్ వారి కోరల్లోనే ఉన్న కాలం. ఇక భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. అదే సమయంలో వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడైన గోపాలకృష్ణ గోఖలే ఎక్కడకో అర్జెంటుగా వెళ్లవలసి వచ్చింది. ఆయన రైలులో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో కూర్చొన్నాడు. ఆయన కూర్చున్న తర్వాత ఒక ఆంగ్ల అధికారి అక్కడికి వచ్చి అదే కంపార్ట్మెంట్లో కూర్చున్నాడు.
గోపాలకృష్ణ గోఖలేను చూసిన వెంటనే ఆంగ్లేయుడికి కోపం వచ్చేసింది. భారతదేశ ప్రజలు బ్రిటిష్ వారు ఎక్కే కంపార్ట్మెంట్లోకి ఎలా ఎక్కుతారని అరిచాడు. అంతేకాదు గోపాలకృష్ణ గోఖలేని అవమానించాడు. అతడు సామానులు తీసి కంపార్ట్మెంట్ నుంచి బయటకు విసిరేసాడు. చుట్టుపక్కలా ఉన్నవారు అలా చూస్తూ ఉండిపోయారు.
ఈ సంఘటన జరుగుతున్న సమయంలో గోపాలకృష్ణ గోఖలేతో పాటు అతని సహచరుడు ఒకరు ఉన్నారు. అతడు ఆంగ్లేయుడుతో మాట్లాడుతూ ‘నువ్వు ఎవరి వస్తువులు విసిరేసావో తెలుసా? అతను వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడు’ అని చెప్పారు
ఆంగ్లేయుడికి పశ్చాత్తాపం కలిగింది. తాను చేసింది తప్పని గ్రహించాడు. గోపాలకృష్ణ గోఖలే భారతదేశంలోనే అతి ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరని అర్థం చేసుకున్నాడు. భారత స్వాతంత్రానికి కృషి చేసిన వారిలో ఆయన ప్రముఖుడని తెలిసింది. వెంటనే విసిరేసిన సామాను తానే తీసుకొచ్చి కంపార్ట్మెంట్లో అదే స్థలంలో ఉంచాడు. ఆ తర్వాత గోపాలకృష్ణ గోఖలే దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాడు.
గోఖలే చాలా వినయంగా ఆ ఆంగ్లేయుణ్ణి క్షమించినట్టు చెప్పాడు. వెంటనే ఆంగ్లేయుడు తన స్థానంలో వెళ్లి కూర్చొన్నాడు. గోఖలే త్వరగానే బ్రిటిష్ వ్యక్తిని క్షమించాడు, కానీ అతనితో ఉన్న సహోద్యోగి మాత్రం తీవ్రమైన కోపంతో ఉన్నాడు. అతడు ఆ అధికారిపై పైవారికి శిక్షించాలని కోరుతూ లేఖ రాశాడు. ఆ లేఖను గోఖలే చూశారు.
‘ఇలా చేయడం సరైన పద్ధతి కాదేమో… కోపాన్ని పొడిగించుకోవడం వల్ల మీ శక్తి సమయం వృధా అవ్వడం తప్ప ఇంకేమీ దొరకదు. శక్తిని సరైన సమయంలో సరైన స్థానంలో ఉపయోగించాలి. అతడు విసిరేసింది నా సామానునే. దానికి బాధపడాల్సిన అవసరం లేదు. తన తప్పు తాను తెలుసుకొని తిరిగి తెచ్చిపెట్టాడు. తప్పు తెలుసుకున్న వ్యక్తిని క్షమించే గుణం మనకి ఉండాలి. ఇలా ఎదుటి వ్యక్తిని క్షమించే గుణం కేవలం శక్తివంతులకే ఉంటుంది. నువ్వు నీ శక్తిని వృధా చేసుకోకుండా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయ్.. అని ఆ లేఖను చింపి పడేయ్’ అని చెప్పాడు.
గోఖలేతో పాటు ఉన్న ఆ సహోద్యోగి ఆ మాటలకు కరిగిపోయాడు. నిజమే అనవసరం విషయాలు ఎక్కువగా పట్టించుకుని లాగడం వల్ల సమస్య పెద్దవుతుంది. అనవసరమైన తలనొప్పులు పెరుగుతాయి. పైగా ఎంతో శక్తి, సమయం వృధా. అతడు తన తప్పు తెలుసుకున్నాడు. కాబట్టి ఇంక తాను ఆయనకు శిక్ష వేయమని అడగాల్సిన అవసరం లేదు అని గ్రహించాడు. ఆ లేఖను చింపి పడేసి గోఖలేతో కలిపి ప్రయాణం సాగించాడు.
ఎవరైనా తప్పు చేశాక, ఆ తప్పును గ్రహించి క్షమాపణ కోరితే వారిని వెంటనే క్షమించాలి. అంతే తప్ప ఆ కోపాన్ని అలా పెంచుతూ సమయాన్ని శక్తిని వృధా చేసుకోకండి. ఈ రెండు కూడా మీ భవిష్యత్తులో కచ్చితంగా ఉపయోగపడతాయి. కాబట్టి క్షమాపణ గుణాన్ని పెంచుకుంటే మీరు మీ జీవితంలో సుఖంగా ఉంటారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
సంబంధిత కథనం