




Best Web Hosting Provider In India 2024

మీరు ఎండిపోయినట్టు సన్నగా మారుతున్నారా? అయితే ఈ విటమిన్ లోపం ఉందేమో తెలుసుకోండి
కొంతమంది ఎండిపోయినట్టు సన్నగా అవుతూ ఉంటారు. వారు తింటున్నా కూడా శరీరం పెరగదు. దీనికి కారణం విటమిన్ బి12 లోపం కావచ్చు అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

మన శరీరానికి విటమిన్ బి12 అత్యవసరం. విటమిన్ బి12 లోపం ఏర్పడితే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే మీ శరీరం ఎండిపోయినట్టు కర్రలాగా అవుతుంది. మీరు ఎన్ని ఆహారాలు తింటున్నా కూడా శరీరం ఆరోగ్యంగా కనిపించదు. దీనికి కారణం విటమిన్ బి12 లోపమే. దీన్ని కోబాలమిన్ అని పిలుస్తారు. కాబట్టి మీ శరీరం నిండుగా, చూడగానే ఆకట్టుకునేలా ఆరోగ్యంగా కనిపించాలంటే విటమిన్ బి12 ఉండే ఆహారాలను తినాల్సిన అవసరం ఉంది.
విటమిన్ బి12 లోపం వల్ల కనిపించే లక్షణాలు
విటమిన్ బి12 లోపిస్తే మీరు తీవ్ర అలసట బారిన పడతారు. బలహీనంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. చేతులు, కాళ్లల్లో తిమ్మిరి పట్టడం, జలదరింపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చర్మం కూడా పసుపు రంగులోకి మారుతుంది. నాలుకలో నొప్పి లేదా వాపు కనిపిస్తుంది. బరువు తగ్గిపోతూ ఉంటారు. వికారంగా, వాంతులు వస్తున్నట్లు అనిపిస్తుంది. విరేచనాలు కూడా అధికంగా అవుతాయి. మలబద్ధకం కూడా రావచ్చు. గ్యాస్ విపరీతంగా ఉత్పత్తి అవుతుంది. ఆకలి వేయదు. అప్పుడప్పుడు మైకం కమ్మిన లక్షణాలు కనిపిస్తాయి. ఒక వ్యక్తికి ప్రతిరోజు 2.4 మైక్రోగ్రాముల విటమిన్ బి12 అవసరం పడుతుంది.
విటమిన్ బి12 కోసం బలవర్ధకమైన ఆహారాలు తినాల్సిన అవసరం ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిర్వహించిన అధ్యయనంలో పూర్తి ఫోర్టిఫైడ్ ఫుడ్స్ ను అధికంగా తీసుకునే వారిలో బి12 స్థాయిలు ఉన్నతంగా ఉన్నాయని తేలింది. కాబట్టి మీరు విటమిన్ బి12 కోసం బలవర్ధకమైన మంచి ఆహారాన్ని తినాలి.
విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహారాలు
విటమిన్ బి12 పులిసిన ఆహారాల్లో అధికంగా ఉంటాయి. దోశ పిండి, ఇడ్లీ పిండి వంటి వాటితో చేసిన ఆహారాలు పులిసి ఉంటాయి. కాబట్టి వాటిలో విటమిన్ బి12 ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే పనీర్ లో కూడా విటమిన్ బి12 ఉంటుంది. ఏ ఆహారాలైతే బ్యాక్టీరియాతో కూడిన ప్రక్రియకు గురవుతాయో వాటిలో విటమిన్ బి12 ఉండే అవకాశం ఉంది. అలాగే చికెన్, చేపలు, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి వాటిలో కూడా విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం విటమిన్ బి12 ఆహారాలను ప్రతి రోజు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
మటన్ లివర్, చికెన్ లివర్, గొర్రె కిడ్నీలు వంటి వాటిలో కూడా విటమిన్ బి12 సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ బి12 లోపం అధికంగా ఉన్నవారు ఇలా చికెన్ లివర్, మటన్ లివర్, కిడ్నీలు వంటివి తినడం ద్వారా ఆ లోపాన్ని త్వరగా తీర్చుకోవచ్చు.
విటమిన్ బి12 లోపం తీవ్రంగా ఉంటే మాత్రం శరీరం అనేక రోగాల బారిన పడుతుంది. ఆ లోపం వల్ల వచ్చే లక్షణాలను భరించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి వెంటనే వైద్య సహాయం అవసరం. వారికి విటమిన్ బి12 సప్లిమెంట్లు వైద్యులు అందిస్తారు. అయితే ఈ సప్లిమెంట్లను వైద్యుని సంప్రదించకుండా ఎవరికి వారు వేసుకోకూడదు. అధిక మొత్తంలో విటమిన్ బి12 సప్లిమెంట్లు తీసుకుంటే అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్