Boiled Egg Fry: ఉడికించిన గుడ్లతో ఇలా ఎగ్ ఫ్రై చేశారంటే జీవితంలో మర్చిపోరు, రెసిపీ అద్భుతంగా ఉంటుంది

Best Web Hosting Provider In India 2024

Boiled Egg Fry: ఉడికించిన గుడ్లతో ఇలా ఎగ్ ఫ్రై చేశారంటే జీవితంలో మర్చిపోరు, రెసిపీ అద్భుతంగా ఉంటుంది

Haritha Chappa HT Telugu
Published Apr 08, 2025 11:30 AM IST

Boiled Egg Fry: ఉడికించిన గుడ్లతో ఎగ్ ఫ్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. చాలామంది గుడ్లు కొట్టి ఫ్రై చేస్తూ ఉంటారు. ఉడికించిన గుడ్ల ఫ్రై అద్భుతంగా ఉంటుంది. రెసిపీ తెలుసుకోండి.

బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెసిపీ
బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెసిపీ

కోడిగుడ్లతో చేసే రెసిపీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కోడిగుడ్డు ఫ్రై అనగానే అందరికీ నూనెలో కోడి గుడ్డును పగలగొట్టి చేసే ఉక్కిరి గుర్తొస్తుంది. నిజానికి ఉడకబెట్టిన కోడిగుడ్లతో టేస్టీ ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు. దీన్ని చూస్తేనే నోరూరిపోతుంది. ఇక అన్నంలో కలుపుకుని తింటే అద్భుతం అనకుండా ఉండలేరు. చపాతీ, రోటీల్లో కూడా ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇక ఉడికించిన కోడిగుడ్లతో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకోండి.

బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెసిపీకి కావాల్సిన పదార్థాలు

కోడిగుడ్లు – ఐదు

నూనె – రెండు స్పూన్లు

ఉప్పు – రుచికి సరిపడా

కసూరి మేథి – అర స్పూను

కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

ఉల్లిపాయలు – మూడు

పచ్చిమిర్చి – రెండు

పసుపు – అర స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను

కారం – ఒక స్పూను

కరివేపాకులు – గుప్పెడు

ధనియాల పొడి – ఒక స్పూను

బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెసిపీ

1. బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసేందుకు ముందుగా కోడిగుడ్లను ఒక గిన్నెలో వేసి అవి మునిగే వరకు నీళ్లు వేసి చిటికెడు ఉప్పు వేసి బాగా ఉడికించాలి.

2. ఉప్పు వేయడం వల్ల తొక్క సులువుగా వచ్చేస్తుంది. వాటి పొట్టు తీశాక కోడిగుడ్లను కోసుకొని లోపలి నుంచి చందమామను తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇక మిగతా తెల్ల భాగాన్ని సన్నగా తరిగి ముక్కలుగా కోసుకోవాలి. చందమామలు మాత్రం అలా వదిలేయాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

5. ఆ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి.

6. తర్వాత పచ్చిమిర్చి తరుగు, కరివేపాకుల తరుగు వేసి బాగా కలుపుకోవాలి.

7. పసుపు, అర స్పూను కారం వేసి బాగా కలపాలి.

8. ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న గుడ్లు ముక్కలు, చందమామను వేసి గరిటెతో కలుపుకోవాలి.

9. ఆ తర్వాత మళ్లీ అర స్పూన్ కారము, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, కసురు మేథి వేసి బాగా కలపాలి.

10. చిన్న మంట మీద పది నిమిషాల పాటు వేయించాలి.

11. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి.

12. ఒకసారి కలుపుకోవాలి. అంతే టేస్టీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయినట్టే. ఇది వండుతుంటేనే నోరూరిపోతుంది. అద్భుతంగా ఉంటుంది. తినాలన్న కోరిక పెరిగిపోతుంది.

బాయిల్డ్ ఎగ్ ఫ్రై వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే సాంబారు పప్పు అన్నం తింటున్నప్పుడు పక్కన దీన్ని పెట్టుకొని నంజుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. రోటీ, చపాతీతో తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసి చూడండి. మీకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. దీనిలో ఎక్కువ పదార్థాలు వాడాల్సిన అవసరం కూడా లేదు. మనం బాయిల్డ్ చేసిన కోడిగుడ్లనే వేసాము. కాబట్టి వాటిలోని పోషకాలు కూడా బయటకి పోకుండా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెసిపీ మీ ఇంట్లో ప్రయత్నించండి.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024