


Best Web Hosting Provider In India 2024
Dilsukhnagar Bomb Blast Case : దిల్‌సుఖ్‌నగర్ బాంబు బ్లాస్ట్ కేసులో ఇప్పటివరకు ఏం జరిగింది?
Dilsukhnagar Bomb Blast Case : ఫిబ్రవరి 21, 2013.. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ దద్దరిల్లింది. వరుసగా రెండు బాంబులు బ్లాస్ట్ అయ్యాయి. ఏం జరుగుతుందో తెలియక జనాలు పరుగులు తీశారు. తామే బ్లాస్ట్ చేశామని ఇండియన్ ముజాహిద్దీన్ ప్రకటించింది. ఐదుగురికి కోర్టు ఉరిశిక్ష విధించింది.
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఫిబ్రవరి 21, 2013న.. రెండు బాంబులు ఒకదాని తర్వాత మరొకటి నిమిషాల వ్యవధిలో పేలాయి. జంట బాంబు పేలుళ్లలో 18 మంది మరణించారు. 131 మందికి గాయాలయ్యాయి. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ టేకప్ చేసింది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్, జియా-ఉర్-రెహమాన్, తెహసీన్ అక్తర్, అజాజ్ షేక్‌లను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
2016లో ఉరిశిక్ష..
ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ ఇంకా పరారీలో ఉన్నాడు. 2016 డిసెంబర్ 13న, ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ ఐదుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. డిసెంబర్ 19న వారికి మరణశిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సవాలు చేస్తూ.. నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 8, 2025న తుది తీర్పును వెలువరించింది.
సమర్థించిన హైకోర్టు..
ఈ పేలుళ్ల కేసులో నిందితులకు ఉరిశిక్ష సరైందేనని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారుచేసింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్ధించింది. అసదుల్లా అక్తర్, రెహ్మాన్, తహసీన్ అక్తర్, భక్తల్, అజాజ్‌కు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఈ దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లు హైదరాబాద్‌లో జరిగిన తీవ్రమైన ఉగ్రవాద దాడుల్లో ఒకటిగా నిలిచిపోయాయి. ఈ ఘటన అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
గతంలోనూ పేలుళ్లు..
హైదరాబాద్‌లో మరో రెండుచోట్ల పేలుళ్లు సంభవించాయి. మే 18, 2007న మక్కా మసీదులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా, 58 మందికి పైగా గాయపడ్డారు. ఆగస్టు 25, 2007న రెండు వేర్వేరు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. లుంబినీ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో ఒకటి, గోకుల్ చాట్ భండార్‌లో మరొకటి. ఈ ఘటనల్లో 42 మందికి పైగా మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
టార్గెట్ హైదరాబాద్..
హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ముస్లిం జనాభా ఉంది. కొన్ని విదేశీ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ వంటి సంస్థలు స్థానిక యువకులను తమ కార్యకలాపాల కోసం నియమించుకుంటున్నాయి. నగరంలో స్లీపర్ సెల్స్‌ను ఏర్పాటు చేయడం సులభమని భావిస్తాయి. అందుకే హైదరాబాద్‌పై ఉగ్రవాదులు గురిపెడతారు అని.. రిటైర్డ్ పోలీస్ అధికారి ఒకరు ‘హిందుస్తాన్ టైమ్స్ తెలుగు’తో మాట్లాడుతూ చెప్పారు.
నిఘా వ్యవస్థ పటిష్టం..
హైదరాబాద్ నగరంలో ఉగ్రదాడులు జరిగిన తర్వాత.. నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత.. లక్షలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్‌లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన కొన్ని కెమెరాలు రాత్రిపూట కూడా స్పష్టమైన దృశ్యాలను అందించడానికి నైట్ విజన్ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి.
టాపిక్