



Best Web Hosting Provider In India 2024

Kia Car Engines stolen: కియా కార్ల పరిశ్రమలో భారీ చోరీ, 900 కార్ ఇంజిన్లు మాయం, పోలీసులకు ఫిర్యాదు
Kia Car Engines stolen: ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండలో ఉన్న కియా కార్ల పరిశ్రమలో భారీ చోరీ జరిగింది. కియా కార్ల తయారీ ప్లాంట్‌లో జరిగిన చోరీలో 900 ఇంజిన్లు మాయమైనట్టు పరిశ్రమ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Kia Car Engines stolen: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కియా కార్ల తయారీ ప్లాంటులో భారీ చోరీ వెలుగు చూసింది. శ్రీసత్యసాయి జిల్లాలో ఉన్న పెనుగొండలో కియా కార్ల తయారీ ప్లాంట్ ఉంది. ప్లాంటులో చోరీ జరిగినట్టు కొద్ది రోజుల క్రితం పోలీసులకు సమాచారం అందింది. దీనిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కియా కార్ల తయారీ ప్లాంటు నుంచి 900 కియా కార్ల ఇంజిన్లు చోరీకి గురయ్యాయని దక్షిణ కొరియా కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో కియా కార్ల తయారీ కర్మాగారాన్ని నడుపుతోంది, ఇక్కడ కార్ ఇంజిన్ల దొంగతనం దాదాపు ఐదేళ్ల క్రితం ప్రారంభమైందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో కంపెనీ మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2020లో ఇంజిన్ దొంగతనాలు ప్రారంభమయ్యాయి. దాదాపు ఐదేళ్లుగా ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగినట్టు అనుమానిస్తున్నారు. దర్యాప్తు లోతుగా దర్యాప్తు చేస్తామని పెనుకొండ సబ్ డివిజనల్ పోలీసు అధికారి వై.వెంకటేశ్వర్లు తెలిపారు.
గత ఐదేళ్లలో 900 ఇంజిన్లు చోరీకి గురైనట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెంకటేశ్వర్లు తెలిపారు. తయారీ కర్మాగారానికి వెళ్లే మార్గంలో, లోపలి నుంచి ఇంజిన్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. కియా కార్లను తమిళనాడులోని హ్యుండాయ్ ప్లాంటులో తయారు చేసి పెనుగొండ తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటి దొంగల సాయంతో వాటిని దారి మళ్లించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కియా కార్ల తయారీ ప్లాంట్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఏర్పాటైన మొదటి భారీ పరిశ్రమ కాగా 2019లో ఉత్పత్తి ప్రారంభించింది. 2019 జూన్‌లో కియా మొదటి కారు మార్కెట్‌లోకి విడుదలైంది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుండాయ్ అనుబంధంగా కియా బ్రాండ్ కంపెనీ కార్లను తయారు చేస్తోంది. ఈ భారీ దొంగతనం ‘ఇన్ సైడ్ జాబ్’గా పోలీసులు అనుమానిస్తున్నారు. కంపెనీ ఉద్యోగుల ప్రమేయంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారాలతో సంబంధం ఉన్న ఉద్యోగులను ప్రశ్నిస్తున్నారు.
కియా ప్లాంట్‌లోకి బయటి వ్యక్తుల ప్రవేశం సాధ్యం కాదు. కియా యాజమాన్యం అనుమతి లేకుండా చిన్న ముక్క కూడా బయటకు రాదని పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందో పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టామని, కొన్ని లొసుగులను నిర్ధారించామని, పాత ఉద్యోగులపై విచారణ జరపడమే తమ ప్రధాన లక్ష్యమని, కొందరు ప్రస్తుత ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ చోరీపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి పలు రికార్డులను కూడా సేకరించారు. ఈ వ్యవహారంపై కియా కంపెనీ ప్రతినిధులు అధికారికంగా స్పందించలేదు.
సంబంధిత కథనం
టాపిక్