



Best Web Hosting Provider In India 2024
‘ఏప్రిల్ 29వరకు సౌదీ విడిచి వెళ్లండి.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు’
Saudi Arabia Deadline For Pilgrims : సౌదీ అరేబియాలో అనుమతించిన తేదీలకు మించి అంటే ఏప్రిల్ 29 తర్వాత నివసించడం చట్ట ఉల్లంఘనగా పరిగణిస్తామని ఆ దేశ ప్రభుత్వం చెప్పింది. దోషులుగా తేలిన విదేశీయులకు కఠిన శిక్షలు విధిస్తామని ప్రకటనలో తెలిపింది.

మక్కాలో లేదా దేశవ్యాప్తంగా ఉమ్రా యాత్రికులు, హజ్ యాత్రికులు అక్రమంగా గుమికూడకుండా నిరోధించడానికి సౌదీ అరేబియా 14 దేశాల వీసాలను తాత్కాలికంగా నిషేధించింది. ఇందులో భారత్ కూడా ఉంది. ఇప్పుడు సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ఉమ్రా కోసం వీసాలు పొందిన వారు ఏప్రిల్ 29 లోగా ఉమ్రా పూర్తి చేసి తమ దేశాలకు తిరిగి వెళ్లాలని ప్రకటించింది. విదేశీ ఉమ్రా యాత్రికులు దేశం విడిచి వెళ్లడానికి ఏప్రిల్ 29 చివరి రోజు అని మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రవేశం తేదీ
‘ఈ సంవత్సరం ఉమ్రా యాత్రికులకు సౌదీ అరేబియాలోకి ప్రవేశించడానికి చివరి తేదీ ఏప్రిల్ 13, తీర్థయాత్ర కాలం ఏప్రిల్ 29న ముగుస్తుంది.’ అని మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనను ఉటంకిస్తూ గల్ఫ్ న్యూస్ తెలిపింది. ఈ గడువు తర్వాత సౌదీ అరేబియాలో ఉంటున్న యాత్రికులను ఆ దేశ వీసా, తీర్థయాత్ర నిబంధనలను ఉల్లంఘించినవారిగా పరిగణిస్తారు.
ఏప్రిల్ 29 తర్వాత నివసిస్తే
సౌదీ అరేబియాలో అనుమతించిన తేదీలకు మించి అంటే ఏప్రిల్ 29 తర్వాత నివసించడం చట్ట ఉల్లంఘనగా పరిగణిస్తామని, దోషులుగా తేలిన విదేశీయులకు కఠిన శిక్షలు విధిస్తామని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో నొక్కి చెప్పింది. నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులు, కంపెనీలు, ఉమ్రా సర్వీస్ ప్రొవైడర్లకు లక్ష సౌదీ రియాల్ వరకు జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చని తెలిపింది.
గతేడాది ఘటనతో
హజ్ యాత్రను సౌకర్యవంతంగా మార్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో సౌదీ అరేబియా ఈ నిర్ణయం తీసుకుంది. అక్రమంగా యాత్రికులు మక్కాకు వెళ్లకుండా అడ్డుకోవడమే సౌదీ అరేబియా లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది మక్కాలో తొక్కిసలాట జరిగి 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సౌదీ అరేబియా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది.
18 వేల మందికిపైగా అరెస్ట్
సౌదీ అరేబియాలో అక్రమంగా నివసిస్తున్న 18,407 మంది విదేశీయులను అరెస్టు చేసి జైలుకు పంపింది. అంటే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా వారు అక్కడే ఉంటున్నారు. వలసలు, కార్మిక, సరిహద్దు రక్షణ చట్టాలను ఉల్లంఘించారని వారిపై అభియోగాలు మోపారు. వీరికి 15 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా.. లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
హజ్ యాత్రను నిర్వహించే అన్ని సర్వీస్ ప్రొవైడర్లు, సంస్థలు విదేశీ యాత్రికుల నిష్క్రమణ గడువులు, రిపోర్టింగ్ ప్రోటోకాల్స్‌ను పూర్తిగా పాటించాలని సౌదీ అధికారులు ఆదేశించారు. ఓవర్ స్టేలను రిపోర్ట్ చేయనందుకు ఈ సంస్థలకు గరిష్టంగా జరిమానా విధించనున్నట్లు తెలిపారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link