



Best Web Hosting Provider In India 2024

Sangareddy Tragedy: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితుల మృతి.. కర్ణాటక- తెలంగాణ సరిహద్దులో విషాదం
Sangareddy Tragedy: కర్ణాటక- తెలంగాణ సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూలీ పనుల కోసం వెళ్లిన ముగ్గురు మిత్రులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు వెంటిలేటర్‌పై ఉన్నారు. దీంతో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Sangareddy Tragedy: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. శారీరక శ్రమపై ఆధారపడిన కుటుంబాల వీధిన పడ్డాయి. విధి వారి జీవితాలను ఒక విషాదభరితమైన నాటకంగా మార్చింది. స్నేహితులు మూడు రోజుల వ్యవధిలో మృత్యు ఒడిలోకి చేరుకున్న విషాద ఘటన తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం…
బీదర్ దగ్గర పనికి వెళ్లి వస్తూ
సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు కూలీ పనులకు వెళుతుంటారు. మున్నూరు రమేష్ (45) , ఇస్మాయిల్ (24), చాకలి బస్వరాజ్ (47) రోజులాగే ఆదివారం ఉదయం నవ్వుతూ ఇంటి నుంచి కూలి పనికి వెళ్లారు. కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి కూలి పనికి వెళ్లారు.
పని ముగించుకుని బైక్‌పై తిరిగి వస్తుండగా బీదర్ జిల్లాలోని బాల్కి ఖానాపూర్ సమీపంలో వారిని వెనుక నుండి వేగంగా వచ్చిన టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇస్మాయిల్ (24) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రోజు వారి కూలి కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
కూలి నాలి చేస్తూ జీవనం …
ఇస్మాయిల్ తల్లిదండ్రులు పూర్తిగా అతనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మున్నూరు రమేష్, చాకలి బస్వరాజును బీదర్ ఆస్పత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. రమేష్ మృత్యువుతో పోరాడుతూ సోమవారం తుదిశ్వాస విడిచాడు. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమేష్ రోజువారి కూలిగా ఉంటూ గ్రామంలోని 40 నుంచి 50 మంది కులీ కార్మికులకు పని కల్పించేవాడు. భార్య శ్రీదేవి కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు.
వెంటిలేటర్ పైన బస్వరాజ్….
ఇక మిగిలిన మరో స్నేహితుడు బస్వరాజ్ ప్రస్తుతం వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇతడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య పుష్పమ్మ కూలి పని చేస్తుంది. ఒకరి తర్వాత మరొకరి మృతదేహాలు గ్రామానికి చేరుతుండటంతో గ్రామస్తులు, బంధువులు, స్నేహితుల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామస్తుల కన్నీటి ధార ఆగడం లేదు.
దీంతో రత్నాపూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల తల్లిదండ్రులు, భార్యాపిల్లల ఆర్తనాదాలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. మరో మృతదేహం వస్తుందేమోనని భయపడుతూ, ప్రాణాలతో పోరాడుతున్న బస్వరాజు ఆయుష్షు పెంచాలని గ్రామస్తులు దేవుడిని వేడుకుంటున్నారు.
నాయకుల నుండి స్పందన ఏది…
ఇంతటి విషాదం సంభవించినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక నాయకులు ఎవరూ స్పందించకపోవడం, వారిని పరామర్శించకపోవడం రత్నాపూర్ గ్రామస్తులను మరింత దుఃఖానికి గురిచేసింది. ఘటన కర్ణాటకలో జరగడంతో ఖానాపూర్ పరిధిలోని దన్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
సంబంధిత కథనం
టాపిక్