




Best Web Hosting Provider In India 2024

CM Chandrababu: ఏప్రిల్ 11న ఒంటిమిట్టకు సీఎం చంద్రబాబు, రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం దంపతులు
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 11న ఒంటిమిట్టకు రానున్నారు. ఒంటిమిట్టలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొంటారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

CM Chandrababu: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు కడప జిల్లా యంత్రాంగం, టిటిడి సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి ఈవో జె. శ్యామలరావు తెలిపారు. ఒంటిమిట్ట ఆలయ ప్రాంగణంలోని పరిపాలన భవనం సమావేశ మందిరంలో ఏర్పాట్లపై సమీక్షించారు. శ్రీ సీతారాముల కళ్యాణానికి టీటీడీ చేపట్టిన ఏర్పాట్లను ఈవో వివరించారు.
ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పణ
సీతారాముల కల్యాణం సందర్భంగా ఏప్రిల్ 11న సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న గ్యాలరీలలో భక్తులు సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేందుకు ఏర్పాటు చేసినట్టు ఈవో తెలిపారు. ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారామెడికల్, టిటిడి ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు చేపడతారు.
కల్యాణ వేదిక ప్రవేశ మార్గంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 క్యూయేస్క్ లు (కౌంటర్లు) ఏర్పాటు చేశారు. కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణం, అన్నప్రసాదాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
- ఆలయ ప్రాంగణంలో నడిచే భక్తులకు ఎండ వేడి ఉపసమనం కొరకు ఆలయ నాలుగు మాడ వీధులలో వైట్ పెయింట్ వేశారు. ఆలయ సమీపంలో 3 వేల మంది భక్తులు వేచి ఉండేందుకు, క్యూ లైన్లలో వెళ్ళెందుకు జర్మన్ షెడ్డు ఏర్పాటు చేశారు.
- సీతారాముల కల్యాణోత్సవంలో ఉండే భక్తులతో పాటు, కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా ఈ ఏడాది భక్తుల సౌలభ్యం కొరకు అత్యాధునిక టెక్నాలజితో 21 ఎల్ ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు.
- ఆలయం , కల్యాణ వేదిక, పరిసర ప్రాంతాల్లో విద్యుత్ కాంతులతో 38 వివిధ దేవతామూర్తుల ప్రతిమలు, భక్తులు సులువుగా గుర్తించేదెలా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.
నిఘా మరియు భద్రత:
శ్రీవారి కళ్యాణోత్సవానికి టీటీడీ విజిలెన్స్ విభాగం నుండి 350 మంది, జిల్లా పోలీస్ యంత్రాంగం నుండి 2500 మంది భద్రతా సిబ్బందితో భద్రత కల్పిస్తారు. 130 సిసి కెమెరాలు, 20 డ్రోన్ లు ఏర్పాటు చేస్తున్నారు. 4 ఫైర్ ఇంజన్లు, ఒక అత్యవసర వాహనాలతో పాటు అత్యవసర సేవలందించేందుకు ఫైర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంల ఏర్పాటు చేస్తున్నారు. సాలాబాద్ జంక్షన్ నుండి సాయినగర్ వరకు దాదాపు 21 కి.మీ మేర లైటింగ్, సూచిక బోర్డులు, మొబైల్ పెట్రోలింగ్, పర్యవేక్షణ టీంలు ఏర్పాటు చేశారు.
అన్నప్రసాదాలు:
కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ ప్రాంగణంలో, కల్యాణ వేదిక వద్ద అన్నప్రసాద వితరణ చేస్తారు. కల్యాణాన్ని వీక్షించేందుకు గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు సాయంత్రం లెమన్ రైస్, చక్కర పొంగలి, బిస్కెట్ ప్యాకెట్, కారాసు అందిస్తారు. బ్రహ్మోత్సవాలకు దాదాపు 3 లక్షల తాగునీరు బాటిల్స్, వాటర్ టబ్బుల ద్వారా నీటి సరఫర, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తారు.
రవాణా
ఆర్‌టిసి ద్వారా కడప నుండి ఒంటిమిట్ట వరకు 85 బస్సులతో 425 ట్రిప్పులు, రాజంపేట నుండి ఒంటిమిట్ట వరకు 40 బస్సులతో మొత్తం 625 ట్రిప్పుల ద్వారా భక్తులకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు.
ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.
ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఏప్రిల్ 10వ తేదీన ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
రెండవరోజు ఏప్రిల్ 11న శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.
చివరిరోజు ఏప్రిల్ 12న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.
ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.
ఏప్రిల్ 10న సేవలు రద్దు
వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ.
వసంతోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 10న తిరుప్పావడ సేవ, ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
సంబంధిత కథనం
టాపిక్