


Best Web Hosting Provider In India 2024
అమెరికా, చైనా టారిఫ్ వార్.. 104 శాతం ప్రతీకార సుంకాలతో బిగ్ షాక్ ఇచ్చిన ట్రంప్
US-China Tariff War : అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం పెరుగుతోంది. డ్రాగన్‌పై మరోసారి యూఎస్ భారీగా సుంకాలు విధించింది.

అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ గట్టిగా నడుస్తోంది. చైనా వస్తువులపై అదనపు సుంకాలను విధించాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు యూఎస్ భారీ స్థాయిలో సుంకాలు విధించింది. చైనా వస్తువులపై టారిఫ్ 104 శాతం చేసింది. అంతేకాదు ఏప్రిల్ 9 నుంచే ఈ టారిఫ్స్ అమల్లోకి వస్తాయని అమెరికా ప్రకటించింది. అమెరికా, చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో ఇప్పటివరకు తీసుకున్న అత్యంత దూకుడు చర్యలలో ఇది ఒకటి. ఫాక్స్ బిజినెస్ ప్రకారం, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. అమెరికాపై చైనా తన ప్రతీకార సుంకాలను ఎత్తివేయలేదని అన్నారు. అటువంటి పరిస్థితిలో అమెరికా ఏప్రిల్ 9 నుండి చైనా దిగుమతులపై మొత్తం 104 శాతం సుంకాన్ని విధించడం ప్రారంభిస్తుందని చెప్పారు.
అస్సలు తగ్గేదేలే
నిజానికి మెుదట ట్రంప్ 34 శాతం విధించిన టారిఫ్‌లకు ప్రతీకారంగా చైనా కూడా 34 శాతం విధించింది. దీంతో ట్రంప్‌నకు కోపం వచ్చి ఓ ప్రకటన జారీ చేశారు. అదనపు సంకాల ప్రతీకారాన్ని చైనా వెనక్కు తీసుకోవాలని లేదంటే.. మరింత పెంచుతామని ప్రకటించారు. దీనిపై చైనా కూడా ఘాటుగా స్పందించింది. చైనా సొంత ప్రయోజనాలు కాపాడుకోవడానికి అమెరికాకు వ్యతిరేకంగా చివరివరకూ పోరాడుతామని వెల్లడించింది. దీంతో చైనాపై ప్రతీకార సుంకాలు 104 శాతానికి పెంచేశారు ట్రంప్.
ట్రంప్ బెదిరింపులు
ఏప్రిల్ 8 నాటికి చైనా తన 34 శాతం సుంకాన్ని ఉపసంహరించుకోకపోతే.. సుంకాన్ని విధిస్తామని ట్రంప్ అన్నారు. ట్రంప్ బెదిరింపులకు తలొగ్గడానికి చైనా నిరాకరించింది. అమెరికాతో పోరాడటం గురించి ప్రకటన చేసింది. దీంతో వైట్ హౌస్ చైనాపై కొత్త సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది.
10 నుంచి 104 శాతం వరకు
కిందని నెల వరకు చైనా వస్తువులపై అమెరికా 10 శాతం సుంకం ఉండేది. ఏప్రిల్ 2న చైనాపై 34 శాతం ప్రతీకార సుంకాన్ని ప్రకటించింది. దీంతో 44 శాతానికి వెళ్లింది. ఆ తర్వాత 10 శాతం రెసిప్రొకల్ టారిఫ్‌ను వసూలు చేస్తున్నట్టుగా ప్రకటించింది అగ్రరాజ్యం. దీంతో చైనాపై సుంకాలు 54 శాతానికి చేరుకున్నాయి. తాజాగా ప్రతీకార సుంకాలతో 104 శాతానికి వెళ్లాయి.
దిగజారుతున్న సంబంధాలు
ఈ విధానం న్యాయమైన వాణిజ్యాన్ని నిర్ధారించడం, అమెరికా ఆర్థిక ప్రయోజనాలను కాపాడటం అని ట్రంప్ అధికారులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు వాణిజ్య పరంగా అమెరికాను చాలా దారుణంగా చూశాయని డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అభిప్రాయపడ్డారు. ట్రంప్ ప్రత్యేకంగా చైనా తన వాణిజ్య, సుంకాల విధానాలను మార్చుకోవాలని అడుగుతున్నారు. దీని కారణంగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు నిరంతరం దిగజారుతున్నాయి.
సుంకాలు విధించడం ద్వారా డోనాల్డ్ ట్రంప్ ఆర్థిక బెదిరింపులు చేస్తున్నారని చైనా పేర్కొంది. అమెరికా సుంకాల విధానం ప్రపంచ ఉత్పత్తి, సరఫరా గొలుసు స్థిరత్వాన్ని దెబ్బతీసిందని చైనా ఆరోపిస్తోంది. దీని కారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని అంటోంది.
సంబంధిత కథనం
టాపిక్
Best Web Hosting Provider In India 2024
Source link