

Best Web Hosting Provider In India 2024

AP TG Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం – ఏపీ, తెలంగాణకు వర్ష సూచన, ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు..!
ఏపీ, తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. అల్పపీడనం, ఉపరిత ఆవర్తనం ప్రభావంతో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. పలు ప్రాంతాలకు హెచ్చరికలను జారీ చేసింది.

పశ్చిమ మధ్య మరియు దానికి అనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో బుధవారం ఉదయం నుంచి అల్పపీడనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పిరిక్ ఆవరణం వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ఇది వచ్చే 12 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరం వైపు కదిలే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఉత్తర – ఈశాన్య దిశగా తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతం మీదుగా క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీలో వర్షాలు….
ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం….ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములు కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని అంచనా వేసింది.
రాయలసీమలో చూస్తే ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములు కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల బలమైన ఈదురు గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు కోస్తా, యానాంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉందని వివరించింది.
తెలంగాణకు వర్ష సూచన – హెచ్చరికలు జారీ
తెలంగాణలోనూ రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం… ఇవాళ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు కూడా పలు జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏప్రిల్ 11వ తేదీ నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
టాపిక్