




Best Web Hosting Provider In India 2024

Renu Desai on Second Marriage: నేను అందుకే రెండో పెళ్లి చేసుకోలేదు.. నాకూ పార్ట్‌నర్ కావాలనిపిస్తోంది: రేణు దేశాయ్
Renu Desai on Second Marriage: పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాను ఎందుకు రెండో పెళ్లి చేసుకోలేదో వివరించింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె దీనిపై స్పందించింది. అంతేకాదు 2018లో తాను చేసుకున్న నిశ్చితార్థం ఎందుకు రద్దు చేసుకుందో కూడా వెల్లడించింది.

Renu Desai on Second Marriage: పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ పెళ్లి, తర్వాత విడాకుల ఎపిసోడ్ తెలుగునాట ఓ సంచలనం. వీళ్లు విడిపోయిన తర్వాత పవన్ మూడో పెళ్లి చేసుకున్నా.. రేణు మాత్రం ఒంటరిగానే మిగిలిపోయింది. అయితే తాను తన పిల్లల కోసమే రెండో పెళ్లి చేసుకోకూడదన్న నిర్ణయం తీసుకున్నట్లు తాజా ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ వెల్లడించింది.
రెండో పెళ్లిపై రేణు దేశాయ్
రేణు దేశాయ్ తాజాగా నిఖిల్ విజయేంద్ర సింహాతో పాడ్‌కాస్ట్ లో మాట్లాడింది. ఈ సందర్భంగా తాను ఒంటరిగానే ఉండటానికి, 2018లో నిశ్చితార్థం రద్దు చేసుకోవడానికి కారణమేంటో తెలిపింది. పవన్ తో విడిపోయిన తర్వాత తనకెప్పుడైనా మళ్లీ ఓ పార్ట్‌నర్ కావాలని అనిపించిందా అన్న ప్రశ్నకు రేణు ఇలా స్పందించింది.
“నిజమే. నాకూ ఓ పార్ట్‌నర్ కావాలని అనిపించింది. కానీ నా పిల్లలపై నాకున్న బాధ్యత ఆ దిశగా నేను ఆలోచించకుండా చేసింది. వ్యక్తిగతంగా చూసుకుంటే నాకూ బాయ్‌ఫ్రెండ్ ఉండి ఉండాలి. పెళ్లి చేసుకొని ఉండాలి. నాకూ ఓ జీవితం ఉండాలి. కానీ పిల్లల కోణంలో ఆలోచిస్తే సరికాదు” అని రేణు చెప్పింది.
నిశ్చితార్థం అందుకే రద్దు
పవన్ తో విడిపోయిన తర్వాత 2018లో రేణు దేశాయ్ నిశ్చితార్థం చేసుకుంది. అయితే ఆ తర్వాత రద్దు చేసుకుంది. దీనికి కారణమేంటో కూడా ఆమె వెల్లడించింది. “మళ్లీ ట్రై చేశాను. నిశ్చితార్థం చేసుకున్నాను. అది పెద్దలు కుదిర్చినది. కానీ నేను ఆ రిలేషన్షిప్ కు, నా పిల్లలకు న్యాయం చేయలేనని అనిపించింది. నేను సింగిల్ పేరెంట్.
వేరే వాళ్లను పెళ్లి చేసుకొని వాళ్లతో పిల్లలను కంటే అది వేరే విషయం. కానీ ఒకరితో పిల్లలు కలిగిన తర్వాత మరొకరు జీవితంలోకి రావడం అనేది సున్నితమైన విషయం. నేను ఆధ్య పెరిగి పెద్దదవడానికి వేచి చూస్తున్నాను. ఆమె 15 ఏళ్లు ఉంది. 18 ఏళ్ల వయసొచ్చి కాలేజీకి వెళ్లిన తర్వాత చూస్తాను” అని రేణు చెప్పింది.
రేణు, పవన్ ప్రేమ, పెళ్లి ఇలా..
బద్రి సినిమాలో కలిసి నటించిన తర్వాత వీళ్లు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచీ కలిసే ఉన్నారు. 2004లో వీళ్లకు అకీరా నందన్ పుట్టాడు. ఆ తర్వాత 2009లో పెళ్లి చేసుకున్నారు. 2010లో ఆధ్య జన్మించింది.
2011లో విడాకులకు దరఖాస్తు చేసుకోగా 2012లో విడిపోయారు. ఆ తర్వాత 2013లో పవన్ మూడో పెళ్లి చేసుకున్నాడు. నిజానికి అంతకుముందు 1997లోనే పవన్ మొదటి పెళ్లి చేసుకున్నా.. 1999లో వాళ్లు విడిపోయారు.
సంబంధిత కథనం