



Best Web Hosting Provider In India 2024

Missing Mobiles : సంగారెడ్డిలో మొబైల్ రికవరీ మేళా, 2150 ఫోన్ లు బాధితులకు అప్పగింత
Missing Mobiles : సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మిస్ అయిన ఫోన్లను గుర్తించి, వాటిని బాధితులకు అందించారు పోలీసులు. ఇప్పటి వరకూ నమోదు చేసిన 9,878 దరఖాస్తులలో 2,150 ఫోన్లను గుర్తించి బాధితులకు అందించారు.

Missing Mobiles : సీఈఐఆర్(CEIR) పోర్టల్ ప్రారంభమైన నాటి నుంచి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదు చేయబడిన 9,878 దరఖాస్తులలో 2,150 ఫోన్లను గుర్తించి, ఇప్పటివరకు బాధితులకు అందించారు. ఇందులో గత 15 రోజుల క్రితం ఏర్పాటు చేయబడిన స్పెషల్ టీమ్స్ ద్వారా 332 సెల్ ఫోన్ లను తెలంగాణలోనే కాకుండా, పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. పరితోష్ పంకజ్ వాటిని ఈ రోజు “మొబైల్ రికవరీ మేళ” కార్యక్రమం ద్వారా బాధితులకు అందించారు.
మొబైల్ పొతే విలువైన సమాచారం కూడా పోతుంది
మొబైల్ ఫోన్ లేనిదే ఒక చిన్న లావాదేవీ కూడా చేయలేని ఈ రోజుల్లో, మన విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్ వంటివి మొబైల్ లో సేవ్ చేసి పెట్టుకుంటారని తెలిసిన సైబర్ నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్ వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు.
ఫోన్ పోయిన తక్షణమే నమోదు చేసుకోండి
సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై DOT (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ-కమ్యూనికేషన్) CEIR పోర్టల్ ను 2023 మే లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్పీ అన్నారు. ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని ఎస్పీ వివరించారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగతానికి గురైనా వెంటనే CEIR పోర్టల్ ( https://www.ceir.gov.in )లో బ్లాక్ చేసి, సంబంధిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ లను కొనుగోలు చేసినట్లైతే అట్టి షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్పీ పరితోష్ పంకజ్ అవగాహనా కల్పించారు. సెల్ ఫోన్ దొంగలు, దొంగిలించిన ఫోన్ లను, మొబైల్ షాప్ లలో అమ్ముతున్నారని, తక్కువ ధరకు వస్తుందని, దొంగిలించిన ఫోన్ అని తెలియక, కొనుగోలు చేసిన అమాయక ప్రజలు మోసాలకు గురి అవుతున్నారన్నారు. ఎవరైనా చోరీ చేసిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేసినట్లైతే అట్టి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
ఆన్ లైన్ బెట్టింగ్ పాల్పడితే కేసులు పెడతాం
ఆన్లైన్ బెట్టింగ్, బెట్టింగ్ యాప్స్ మాటున సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారని గుర్తించాలని అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆడిన, ప్రమోట్ చేసిన అట్టి వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. డిజిటల్ అరెస్ట్ అని, కస్టమ్స్ అధికారినని, వీడియో కాల్స్ వస్తే నమ్మరాదని, సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని, అత్యాశకు పోయి అనవసర లింక్ లను ఓపెన్ చేయకూడదని, ఆన్లైన్ లో అపరిచితులతో పరిచయాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైనట్లైతే వెంటనే 1930 కు కాల్ చేసి గాని, సైబర్ క్రైమ్ (https://www.cybercrime.gov.in) నందు గాని ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.
సంబంధిత కథనం
టాపిక్