




Best Web Hosting Provider In India 2024

Thursday Motivation: ఇలాంటి స్నేహితులు గడ్డిలో పాము లాంటివారు, వీరికి ఎంత దూరంగా ఉంటే మీ జీవితం అంత ఆనందంగా ఉంటుంది
Thursday Motivation: ప్రతి ఒక్కరికీ స్నేహితులు ఉంటారు. స్నేహం అనే ముసుగులో కొంతమంది ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. గడ్డిలో దాక్కున్న పాముల్లాగా వారి కంటికి కనిపించని వ్యక్తిత్వం మీకు ఎప్పటికైనా కీడు చేస్తుంది.

ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహానికి ఎంతో విలువ ఉంటుంది. నర్సరీ క్లాసు నుంచే ఇప్పుడు స్నేహాలు మొదలైపోతాయి. బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మన జీవితంలోని ప్రతి దశలో ఎవరో ఒకరు స్నేహితులు అవుతూనే ఉంటారు. కష్టసుఖాల్లో ఆ స్నేహితులు సహాయం చేయడం మనం చూస్తూనే ఉంటాం.
ప్రతి స్నేహం మనసుకు హత్తుకునేంత దగ్గరగా ఉండదు. కానీ కొంతమంది మాత్రం మనకు ఎంతో దగ్గరవుతారు. కొంతమంది స్నేహితులు భావోద్వేగ పరంగా కూడా మీ మనసులో చోటు సంపాదిస్తారు. అయితే కొంతమంది స్నేహితులు మాత్రం స్నేహం ముసుగులో మీకు శత్రువుల్లా ప్రవర్తిస్తారు. వారిని సమయానికి గుర్తించడం చాలా ముఖ్యం.
గడ్డిలో దాక్కున్న పాములాగా వీరు స్నేహం ముసుగులో మీతో పాటు ఉంటారు. కానీ వారి వల్ల మీకు ఎప్పటికైనా చెడే జరుగుతుంది. అలాంటి స్నేహితులను గుర్తించి దూరంగా ఉంచాలి. ఎలాంటి స్నేహితులు మీ జీవితంలో ఉండకూడదో తెలుసుకోండి.
వెన్నుపోటు పొడిచేవారు
కొంతమంది మీ ముందు మీతో చక్కగానే మాట్లాడతారు. మీరు చేసే ప్రతి పనిని ప్రశంసిస్తారు. కానీ మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడతారు. మీరు చేసే పనులను విమర్శిస్తారు. అలాంటి వ్యక్తులు పాము లాంటివారు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా కాటు వేస్తారు. మీ స్నేహితుల్లో ఎవరైనా ఇలా ప్రవర్తిస్తున్నట్టు మీకు అనుమానం వస్తే వారికి దూరంగా ఉండటం చాలా మంచిది. అలాంటి స్నేహితులు ఎప్పటికైనా మీకు కీడే చేస్తారు తప్ప మేలు చేయరు.
దుఃఖంలో వదిలివెళ్ళేవారు
సంతోషంగా ఉన్నప్పుడు పక్కన ఎవరు ఉన్నా లేకపోయినా ఫర్వాలేదు, దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రం ఓదార్చే ఒక మనిషి అత్యవసరం. భుజంపై అతను వేసే చేయి ఎంతో ధైర్యాన్ని, ఓదార్పును అందిస్తుంది. స్నేహితుడు అనే వాడు సమయం బాగున్నప్పుడే కాదు, సమయం బాగోనప్పుడు కూడా పక్కనే ఉండాలి. ఒకరినొకరు ఆదుకోవాలి. ఎప్పుడైతే మీకు కష్ట సమయం వచ్చినప్పుడు మీ స్నేహితుడు మిమ్మల్ని విడిచి వెళతాడో, సాకులు చెప్పి మీ దగ్గరికి రాకుండా తప్పించుకుంటాడో… అలాంటి స్నేహానికి అర్థం లేదు. మీరు అలాంటి వ్యక్తిని మీ స్నేహితుల జాబితాలో నుంచి తొలగించడం మంచిది. ముఖ్యంగా వారితో సమయాన్ని గడపడం కూడా పూర్తిగా వృధా. మీ జీవితంలో ఇలాంటి స్నేహితుడు లేకుండా చేసుకోండి.
సొంత ప్రయోజనాల కోసం
ఈ రోజుల్లో మనుషులు ఎంతో మారిపోయారు. సొంత ప్రయోజనాల కోసమే స్నేహం చేసేవారు కూడా ఉన్నారు. స్వార్థపూరిత ఆలోచనలతో మీకు దగ్గరయ్యే స్నేహితులను సకాలంలో గుర్తించాలి. మీ స్నేహితుడు ఎల్లప్పుడూ మీ వల్ల తనకు కలిగే ప్రయోజనాల గురించే మాట్లాడుతూ ఉంటే అతడి ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోండి. మీతో అవసరం ఉన్నంతకాలమే అతను మీ పక్కన ఉంటాడు. అవసరం తీరిపోతే ఎప్పుడో ఒకసారి వదిలి వెళ్ళిపోతాడు. కాబట్టి అలాంటి స్నేహితులు ఉండడం కన్నా ఒంటరిగా ఉండడమే ముఖ్యం. మీ పదవిని, డబ్బును, మీ అధికారం మాత్రమే అతను కి విలువైనదిగా కనిపిస్తే అతడు ఎప్పటికీ మీ స్నేహితుడు కాలేడు.
నెగిటివ్ థింకింగ్
మీరు జీవితంలో ముందుకు వెళ్లాలన్నా, పురోగతి సాధించాలన్నా పాజిటివ్ గా ఆలోచించాలి. మీరు పాజిటివ్‌గా ఆలోచిస్తున్నా మీ పక్కన ఉన్న మీ స్నేహితుడు ప్రతికూలంగా మాట్లాడడం, నెగిటివ్ ఆలోచనలను నింపడం వంటివి చేస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఆ నెగిటివ్ ఆలోచనలు మిమ్మల్ని ఇంకా కుంగదీస్తాయి. అలాంటి స్నేహితులకు దగ్గరగా ఉండడం కూడా మంచిది కాదు. వారు జీవితంలో ముందుకు వెళ్లరు. మిమ్మల్ని వెళ్ళనివ్వరు. కాబట్టి నెగిటివ్ థింకింగ్ చేసే స్నేహితులు మీ జీవితంలో ఉంటే వారిని వీలైనంతవరకు దూరంగా పెట్టడం ఉత్తమం.
సంబంధిత కథనం