


Best Web Hosting Provider In India 2024
High Security Plates: తెలంగాణలో పాత వాహనాలకూ హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్, 2019 ఏప్రిల్ 1 ముందు కొన్న వాహనాలకు తప్పనిసరి…
High Security Plates: తెలంగాణలో పాత వాహనాలకు కూడా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ వినియోగాన్ని తప్పనిసరి చేశారు. నిర్ణీత గడువులోగా వాహనాలన్నింటికి హై సెక్యూరిటీ ప్లేట్లను అమర్చాల్సి ఉంటుంది. గడువు దాటిన తర్వాత పాత నంబర్ ప్లేట్లను కొనసాగిస్తే జరిమానా విధిస్తారు.
High Security Plates: తెలంగాణలో 2019 ఏప్రిల్ 1కు ముందు తయారైన వాహనాలకు కూడా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రకాల పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల వినియోగాన్ని తప్పనిసరి చేశారు.
తెలంగాణలో పాత వాహనాల నంబర్ ప్లేట్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలు మొదలుకుని అన్ని రకాల వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను తప్పనిసరి చేస్తూ తెలంగాణ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 30వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. వాహనాల నంబర్ ప్లేట్లపై మార్గదర్శకాలను జారీ చేస్తూ బుధవారం గెజిట్ విడుదలైంది.
ఛార్జీలను ఖరారు చేసిన ప్రభుత్వం
వాహనాల నంబర్ ప్లేట్లను మార్చాలని ఆదేశించిన ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్ ప్లేట్ ఛార్జిలను కూడా ఖరారు చేసింది. వాహనం రకాన్ని బట్టి రూ.320 మొదలుకుని గరిష్టంగా రూ.800 వరకు చెల్లించాల్సి ఉంటుంది. నకిలీ నంబర్ ప్లేట్ల వినియోగాన్ని కట్టడి చేయడం, వాహనాల చోరీలను నియంత్రించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు పేర్కొన్నారు. 2019 ఏప్రిల్ 1 నుంచి తయారైన వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ నిబంధన ఇప్పటికే దేశ వ్యాప్తంగా అమల్లో ఉంది. పాత వాహనాలు కూడా ఇందుకు అనుగుణంగా నంబర్ ప్లేట్లను మార్చాల్సి ఉంటుంది.
ఆ బాధ్యత వాహన యజమానులదే…
- పాత వాహనాలకు నంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సిన బాధ్యత వాహన యజమానులదే, హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేని వాహనాలను అమ్మడానికి, కొనడానికి అనుమతించరు. వాటిని బదిలీ చేయడానికి కూడా అనుమతించరు.
- నంబర్ ప్లేట్ మార్చిన వాహనాలకు వాహన బీమా, పొల్యూషన్ సర్టిఫికెట్ జారీ చేయరు. గడువు తీరే లోగా నంబర్ ప్లేట్లు మార్చని వాహనాలకు జరిమానాలు విధిస్తారు.
- వాహన తయారీ సంస్థలు డీలర్ల వద్ద హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను బిగించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వం నిర్ణయించిన ధరల్ని అందరికి కనిపించేలా ప్రదర్శించాలి. వాహనదారుడి ఇంటికి వెళ్లి నంబర్ ప్లేట్ మారిస్తే అదనంగా వసూలు చేసేందుకు అనుమతించారు.
- వాహనదారులు హైసెక్యూరిటీ ప్లేట్ల కోసం https://www.siam.in/ లో వాహనం వివరాలను నమోదు చేసి బుక్ చేసుకోవచ్చు. కొత్త ప్లేట్ బిగించిన తర్వాత ఫోటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
హైసెక్యూరిటీ ప్లేట్లకు ఛార్జీలు…
- ద్విచక్ర వాహనానికి రూ.320 నుంచి రూ.380 వరకు వసూలు చేస్తారు.
- ఇంపోర్టెడ్ ద్విచక్ర వాహనాలకు రూ.400-500 వసూలు చేస్తారు.
- కార్లకు రూ.590 నుంచి రూ.700 వసూలు చేస్తారు. ఇంపోర్టెడ్ కార్లకు రూ.700 నుంచి రూ.860 వసూలు చేస్తారు.
- ఆటోలు, మూడు చక్రాల వాహనాలకు రూ.350-450 వసూలు చేస్తారు.
- కమర్షియల్ వాహనాలకు రూ.600-800 చెల్లించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్