




Best Web Hosting Provider In India 2024

Telangana Earthquake : తెలంగాణలో మళ్లీ భూకంపం వచ్చే ప్రమాదం.. అమరావతి వరకు ప్రభావం!
Telangana Earthquake : ఇటీవల భూకంపాలు భయపెడుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ సంభవిస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో.. కొన్ని పరిశోధన సంస్థలు ముందుగానే హెచ్చరిస్తున్నాయి. తాజాగా.. ఎపిక్ ఎర్త్‌క్వేక్ కీలక విషయం వెల్లడించింది. తెలంగాణలో భూకంపం వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.

తెలంగాణలో త్వరలో భూకంపం రాబోతోందని.. ఎపిక్ ఎర్త్‌క్వేక్ అంచనా వేసింది. తమ పరిశోధన ప్రకారం.. తెలంగాణలోని రామగుండం సమీపంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావం రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్ వరకు ఉంటుందని వివరించింది. అటు ఏపీలోని అమరావతి వరకు ఈ భూకంప తీవ్రత ఉండొచ్చని అంచనా వేసింది. మహారాష్ట్ర వరకు దీని ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. ఎపిక్ ఎర్త్‌క్వేక్.. గతంలో కొన్ని ప్రాంతాల్లో భూకంపం వస్తుందని ముందుగానే అంచనా వేసింది. ఆ అంచనాలు కొన్నిసార్లు నిజమయ్యాయి.
తెలంగాణలో భూకంపాలు.. వాటి తీవ్రత..
డిసెంబర్ 4, 2024- ములుగు జిల్లా మేడారం వద్ద 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది గత 50 ఏళ్లలో తెలంగాణలో నమోదైన బలమైన భూకంపాలలో ఒకటి. దీని ప్రభావం హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపించింది.
డిసెంబర్ 7, 2024- మహబూబ్‌నగర్ జిల్లా దాసరిపల్లి వద్ద 3.0 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఇది స్వల్ప తీవ్రత కలిగినది.
జూన్ 13, 1969- భద్రాచలం ప్రాంతంలో 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది.
2020 ఏప్రిల్ 24- ఆసిఫాబాద్‌లో 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.
2021 జనవరి 26- పులిచింతల వద్ద 4.8 తీవ్రతతో భూకంపం నమోదైంది.
1983- మేడ్చల్‌లో 4.5 తీవ్రతతో భూకంపం వచ్చింది.
తీవ్రత తక్కువే..
తెలంగాణ సాధారణంగా తక్కువ భూకంప తీవ్రత కలిగిన జోన్-2లో ఉంది. అయితే.. గోదావరి పరివాహక ప్రాంతంలో ఫాల్ట్ జోన్ ఉండటం వల్ల.. అప్పుడప్పుడు భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. రిక్టర్ స్కేలుపై 5 కంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు తెలంగాణలో చాలా అరుదుగా వస్తాయి.. అని నిపుణులు వివరిస్తున్నారు.
గోదావరి పరివాహక ప్రాంతంలోనే..
‘భూమి ఉపరితలం అనేక పెద్ద, చిన్న పొరలతో నిర్మితమై ఉంటుంది. ఈ పొరలు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఈ కదలికల వల్ల ఒత్తిడి పెరిగి, ఆ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు భూకంపాలు సంభవిస్తాయి. గోదావరి పరివాహక ప్రాంతం అనేక భౌగోళిక పగుళ్లను కలిగి ఉంది. ఈ పగుళ్ల వెంబడి కదలికలు భూకంపాలకు కారణం కావచ్చు’ అని నిపుణు చెబుతున్నారు.
మార్పులకు గురైన కారణంగా..
‘గోదావరి నది ప్రవహించే ప్రాంతం ఒకప్పుడు భౌగోళికంగా చాలా మార్పులకు గురైంది. నది లోయ ఏర్పడటం, భూమి నిర్మాణం మారడం వల్ల అక్కడ బలహీనమైన ప్రాంతాలు ఏర్పడి ఉండవచ్చు. ఈ బలహీనమైన ప్రాంతాల్లో ఒత్తిడి పెరిగినప్పుడు భూకంపాలు వచ్చే అవకాశం ఉంది’ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఎపిక్ ఎర్త్‌క్వేక్ అంచనా వేసిన రామగుండం కూడా గోదావరి పరివాహక ప్రాంతంలోనే ఉండటం గమనార్హం.
సంబంధిత కథనం
టాపిక్