



Best Web Hosting Provider In India 2024

Nallamala Saleshwaram Jathara 2025 : నల్లమల లోయలో ‘లింగమయ్య’ దర్శనం – సలేశ్వరం జాతరకు వేళాయే, ఈ 3 రోజులే ఛాన్స్..!
Nallamala Saleshwaram Jathara 2025 : నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ అభయారణ్యంలో సళేశ్వర క్షేత్రం కొలువు దీరి ఉంది. నల్లమల కొండల్లో కొలువైన ఈ క్షేత్రంలో ఇవాళ్టి నుంచి ఉత్సవాలు జరగనున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు…శివయ్య భక్తులు భారీగా తరలివస్తారు.

సలేశ్వరం.… నల్లమల కొండల్లో కొలువైన లింగమయ్య క్షేత్రం. తెలంగాణ అమర్‌నాథ్ యాత్రగా పేరు గాంచింది. ఇక్కడ కొలువుదీరిన సళేశ్వరుడిని దర్శించుకోవాలంటే పెద్ద యాత్ర చేయాల్సిందే. కర్రల సాయంతో లోయలోకి నడుచుకుంటా వెళ్తే గానీ.. ఆ లింగయ్య దర్శనం దొరకదు. ప్రతి ఏడాది మూడు రోజల పాటు ఇక్కడ ఉత్సవాలు(జాతర) జరుగుతున్నాయి. ఇందుకోసం భక్తులు భారీగా తరలివస్తారు.
నేటి నుంచే జాతర ప్రారంభం
ఎంతో సాహోసోపేతమైన యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతర ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. ఏటా చైత్ర పూర్ణిమ నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 వరకు నిర్వహించనున్న ఈ యాత్రకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయటంతో పాటు తొక్కిసలాట వంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే…?
నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని నల్లమల అడవుల్లో సలేశ్వర క్షేత్రం ఉంటుంది. శ్రీశైలం – హైదరాబాద్ రహదారి గుండా ఇక్కడికి చేరుకోవచ్చు. ప్రధాన రహదారి నుంచి 30 కి.మీకుపైగా లోపలకి వెళ్లాలి. ఆ తర్వాత… 4 నుంచి 5 కి.మీ వరకు నడవాల్సి ఉంటుంది.
సళేశ్వరం క్షేత్రంలోని లింగమయ్యను దర్శించుకునేందుకు భారీ లోయలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాంతమాతం రాళ్లు, రప్పలు ఉంటాయి. కర్రల సాయంతోనే నడవాల్సి ఉంటుంది. ఇదే ప్రాంతంలో నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కనిపిస్తుంది. సళేశ్వరుడి కొలువుదీరిన ప్రాంతంలో…. పైనుంచి నీటి దార ప్రవహిస్తూ ఉంటుంది. చాలా ఎత్తైన ప్రాంతం నుంచి ఈ జలాలు వస్తాయి. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి సళేశ్వరుడిని దర్శించుకుంటారు.
ఇక్కడికి వచ్చే భక్తులు లోయలోకి వెళ్లేటప్పుడు… ‘వస్తున్నాం.. వస్తున్నాం.. లింగమయ్యో’ అంటూ వెళ్తారు. ఇక దర్శనం పూర్తి అయిన తర్వాత… బయటికి వచ్చేటప్పుడు ‘పోతున్నాం.. పోతున్నం లింగమయ్యో’ అంటూ నినాదాలు చేస్తుంటారు. సలేశ్వరం లోయ దాదాపు రెండు కిలో మీటర్ల పొడవు ఉంటుంది. ప్రకృతిలో గడపాలని అనుకునే వారికి ఈ ప్రదేశం చాలా నచ్చుతుంది. సలేశ్వరం వెళ్లే దారిలో చెంచు గుడారాలు దాటుకుంటూ వెళ్లాలి.
పురాతన కాలం నుంచి ఆలయంలో చెంచు పెద్ద మనుషులే పూజరులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు ఉమ్మడి మహబూబ్ నగర్ మాత్రమే కాకుండా సరిహద్దు జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు.
భక్తులకు కీలక సూచనలు…
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అటవీ అధికారులు కొన్ని కీలకమైన సూచనలు చేశారు. ముఖ్యంగా అటవీ ప్రాంతంలోకి వెళ్లే భక్తులు మంటులు ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేశారు. వేసవి దృష్ట్యా ప్రమాదాలు సంభవించి అటవీ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. బీడీ, చుట్ట, సిగరేట్ కాల్చడాన్ని నిషేధించారు. అంతేకాకుండా ప్లాస్టిక్ తో పాటు మత్తు పదార్థాలు పూర్తిగా నిషేధమని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జాతరకు వచ్చే భక్తులకు అన్ని విధాలా సహకరించేందుకు 400 పైగా సిబ్బందితో పాటు వాలంటీర్లను నియమించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అనుకోని ఘటనలు ఏమైనా జరిగితే అత్యవసరంగా రక్షించేందుకు ప్రత్యేక దారిని కూడా ఏర్పాటు చేశారు.
సంబంధిత కథనం
టాపిక్