



Best Web Hosting Provider In India 2024
North India Rains : భారీ వర్షాలకు బిహార్, యూపీ ఉక్కిరిబిక్కిరి- 47మంది బలి!
IMD rain alert : భారీ వర్షాలకు బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ అల్లాడిపోయాయి. పిడుగులు, వర్షాలు, గోడ కూలడం వంటి వివిధ ఘటనల్లో 47మంది మరణించారు. శుక్ర, శనివారాల్లో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు ఇచ్చిన సూచన ప్రజలను భయపెడుతోంది.

దేశంలో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర భారతంలో ఓవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే, మరోవైపు ఆకస్మిక వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల కురుసిన భారీ వర్షాలు, పిడుగుపాటుకు 47మంది మరణించారు.
బిహార్, యూపీలో వర్ష బీభత్సం..
బిహార్‌లోని పలు జిల్లాల్లో పిడుగులు, వడగళ్ల వానలకు 25 మంది మృతి చెందారు. నలందలో 18 మంది, సివాన్‌లో ఇద్దరు, కతిహార్, దర్భంగా, బెగుసరాయ్, భాగల్పూర్, జెహనాబాద్లలో ఒక్కొక్కరు మరణించినట్లు బిహార్ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
బిహార్‌లోని నాలుగు జిల్లాల్లో బుధవారం పిడుగుపాటుకు 13 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలకు సంబంధించిన సంఘటనల్లో 50 మందికిపైగా మరణించారని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
“బిహార్‌లో తుపాను, వర్షం, పిడుగులు, చెట్లు, గోడ కూలిన ఘటనల్లో 50 మందికి పైగా దుర్మరణం చెందడం తీవ్రంగా కలచివేసింది. నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ విషాద సమయంలో విపత్తు బాధిత కుటుంబాలకు భగవంతుడు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను,’ అని ట్వీట్ చేశారు.
దర్భంగా, తూర్పు చంపారన్, గోపాల్గంజ్, పశ్చిమ చంపారన్, కిషన్గంజ్, అరారియా, సుపౌల్, గయా, సీతామర్హి, షియోహర్, నలంద, నవాడా, పాట్నా సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ఈ జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, విపత్తు నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలను పాటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారని బిహార్ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇలా..
బిహార్ పొరుగు రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వానలు, పిడుగులతో కూడిన వర్షం కురవడంతో 15 జిల్లాల్లో 22 మంది మృతి చెందారు.
ఫతేపూర్, ఆజంగఢ్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, ఫిరోజాబాద్, కాన్పూర్ దేహత్, సీతాపూర్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఘాజీపూర్, గోండా, అమేథీ, సంత్ కబీర్ నగర్, సిద్ధార్థ్ నగర్ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. పిడుగుపాటుకు బల్లియా, కన్నౌజ్, బారాబంకి, జౌన్పూర్, ఉన్నావ్ జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
మృతుల కుటుంబాలకు తక్షణమే రూ.4 లక్షల పరిహారం పంపిణీ చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన యోగి క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని, బాధితులకు తగిన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
సర్వే నిర్వహించి, పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని, తద్వారా ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ సీఎం అధికారులను కోరారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link