



Best Web Hosting Provider In India 2024

Kancha Gachibowli Lands : భూముల వేలంలో భారీ స్కామ్… వచ్చే ఎపిసోడ్‌లో ఆ ఎంపీ పేరు బయటపెడతా – కేటీఆర్
KTR On Kancha Gachibowli Lands : కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఎలాంటి సరైన పత్రాలు లేకుండానే ప్రభుత్వం వేలానికి సిద్ధమైందని కేటీఆర్ ఆరోపించారు. దీని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అతి పెద్ద స్కామ్ కు తెరలేపిందన్నారు. ఓ బీజేపీ ఎంపీ సాకారంతో సీఎం రేవంత్ ఇదంతా చేస్తున్నారని పునరుద్ఘాటించారు.

కంచ గచ్చిబౌలి భూముల వేలంతో కాంగ్రెస్ ప్రభుత్వం అతి పెద్ద స్కామ్ కు తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన…. పలు కీలక అంశాలను ప్రస్తావించారు. లేని మార్కెట్ వాల్యూను సృష్టించి… బ్యాంక్ నుంచి ఇప్పటికే రూ. 10 వేల కోట్ల వరకు లోన్ తీసుకుందన్నారు. భూములకు సంబంధించిన ప్రభుత్వం వద్ద సరైన పత్రాలు లేకుండానే ఇదంతా చేస్తుందన్నారు.
తెరవెనక బీజేపీ ఎంపీ సాకారం…
ఈ భూముల వేలం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అతి పెద్ద స్కామ్ కు తెరలేపిందన్నారు. ఓ బీజేపీ ఎంపీ సాకారంతో సీఎం రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. చేస్తున్న తప్పులన్నీ రేవంత్ రెడ్డికి తెలుసని చెప్పారు.
“కంచ గచ్చిబౌలి భూముల అమ్మకాల్లో పెద్ద కుంభకోణం ఉంది.ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి ప్రభుత్వం రూ. 170 కోట్లు కట్టబెట్టింది. ఈ స్కాం లో రేవంత్ రెడ్డి వెనక ఓ బీజేపీ ఎంపి ఉన్నారు. ఇందులో ఓ బ్రోకరేజీ సంస్థ కీలకంగా ఉంది. అసలు ఈ భూమిపై టీజీఐఐసీకి ఎలాంటి హక్కులు లేవు. అలాంటప్పుడు ఎలా వేలం వేస్తారు..?” అని కేటీఆర్ ప్రశ్నించారు.
దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు…
ఈ భూముల వ్యవహారంలోని స్కామ్ పై ఆర్బీఐ, సెబీ, సెంట్రల్ విజిలెన్స్, సీబీఐకి ఆధారాలతో సహా లేఖను రాస్తున్నాం. బీకాన్ ట్రస్టీషిప్, బ్రోకరేజ్ కంపెనీని ఎలా సెలెక్ట్ చేశారు? బీజేపీ ఎంపీ సాకారంతోనే రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారు. ఆ ఎంపీ పేరు త్వరలోనే బయటపెడుతాను. బ్రోకరేజ్ సంస్థను తీసుకురావటంతో పాటు అన్ని వ్యవహారాల్లో కీలకంగా ఉన్నారు” అని కేటీఆర్ ఆరోపించారు.
“సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 0.4 కానోపి ఉన్న కంచె గచ్చిబౌలి భూమి కూడా అటవీ భూమే. రేవంత్ రెడ్డి చేసిన అతిపెద్ద ఆర్థిక నేరం ఏంటంటే అటవీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. అటవీ భూమిని తాకట్టు పెట్టడానికి, అమ్మడానికి ప్రయత్నించడం. ఒక బీజేపీ ఎంపీ, ఒక బ్రోకరేజ్ కంపెనీ సహకారంతో రేవంత్ రెడ్డి కంచె గచ్చిబౌలి భూముల విషయంలో భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డాడు. టీజీఐఐసీకి ఓనర్‌షిప్ లేని కంచె గచ్చిబౌలి భూములకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 10 వేల కోట్లు ఎలా ఇచ్చింది? దీని వెనకాల ఎవరు ఉన్నారు? కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ భూ కుంభకోణంపై విచారణ చేపట్టాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
టాపిక్