




Best Web Hosting Provider In India 2024

Kakatiya Mega Textile : వరంగల్ టెక్స్ టైల్ పార్క్ లో 25 వేల ఉద్యోగాలు – దరఖాస్తు చేసుకోండి ఇలా
వరంగల్ టెక్స్ టైల్ పార్క్ లో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు కిటెక్స్ కంపెనీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. గడవు సమయం దగ్గర పడుతోంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లయ్ చేసుకోవాలని సంబంధిత సంస్థ ఓ ప్రకటన ద్వారా కోరింది.

వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో కిటెక్స్ కంపెనీ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. వివిధ విభాగాల్లో మొత్తంగా 25 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఐదు రోజుల కిందట ప్రకటన విడుదల చేయగా.. రెండు వారాల్లోగా ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అందులో సూచించింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగులు తమ కంపెనీ వెబ్ సైట్ లో దరఖాస్తులు సమర్పిస్తే.. దాని ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి, వివిధ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
కిటెక్స్ ముందడుగు
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలీలో 2017లో గత రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు శ్రీకారం చుట్టింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు అందించే ఉద్దేశంతో దాదాపు రూ.1,350 కోట్లతో 1,150 ఎకరాల్లో ఈ పార్కు పనులు మొదలు పెట్టింది.
ఆ తరువాత 22 కంపెనీలతో సంప్రదింపులు జరిపి రూ.3,900 కోట్ల పెట్టుబడులతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. కానీ అందులో చిన్న పిల్లల దుస్తుల తయారీకి సంబంధించిన కిటెక్స్ గార్మెంట్స్ కంపెనీ ఒకడుగు ముందుకేసి, 1,200 కోట్ల వ్యయంతో 187 ఎకరాల్లో పిల్లల దుస్తుల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసింది. దాంతో పాటు గణేషా ఎకో టెక్ కంపెనీ రూ.588 కోట్లతో సుమారు 50 ఎకరాల్లో రెండు యూనిట్లు నెలకొల్పింది. దక్షిణ కొరియాకు చెందిన యంగాన్ కంపెనీ 8 ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. కానీ ఇందులో కేవలం కిటెక్స్ కంపెనీ మాత్రమే ప్రొడక్షన్ కు రెడీ అయ్యింది.
25 వేలకుపైగా జాబ్స్
కిటెక్స్ కంపెనీ ఇటీవల ఉత్పత్తికి రెడీ కాగా.. అందులో సంస్థలో వివిధ క్యాటగిరీలకు చెందిన 25 వేల ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీర్లు, ఇన్‌చార్జులతో పాటు జిన్నింగ్, బ్లీచింగ్, డైయింగ్, ప్రింటింగ్, కటింగ్, ఎంబ్రాయిడరీ, పవర్ స్టేషన్, ఫైనాన్స్, ఐటీ, సోర్సింగ్, ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్, హెచ్‌ఆర్, ఫైర్ సేఫ్టీ, బాయిలర్, ఎస్‌టీపీ తదితర విభాగాల్లో మొత్తంగా 25 వేల ఉద్యోగాలు భర్తీ చేయనుంది. కాగా అందులో దాదాపు 80 శాతం మహిళలకే అవకాశాలు ఎక్కువగా ఉండటం గమనార్హం.
దరఖాస్తు చేసుకోండి ఇలా..
ఐదు రోజుల కిందట కిటెక్స్ సంస్థ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. రెండు వారాల్లోగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది. ఈ మేరకు అనుభవం కలిగిన ఔత్సాహికులు కిటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన ‘ https://job.kitexgarments.com/Vacancies.aspx ’ వెబ్ లింక్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సిందిగా పేర్కొంది. అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి, అర్హత కలిగిన వెంటనే దరఖాస్తు చేసుకోండి మరి.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).
టాపిక్