




Best Web Hosting Provider In India 2024

Akkada Ammayi Ikkada Abbayi Review: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ.. యాంకర్స్ ప్రదీప్, దీపిక పిల్లి మూవీ ఎలా ఉందంటే?
Akkada Ammayi Ikkada Abbayi Movie Review In Telugu: యాంకర్స్ ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి హీరో హీరోయిన్స్‌గా నటించి లేటెస్ట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. పవన్ కల్యాణ్ మొదటి సినిమా టైటిల్‌తో ఇవాళ రిలీజ్ అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రివ్యూ చూద్దాం.

Akkada Ammayi Ikkada Abbayi Review Review Telugu: బుల్లితెరపై యాంకర్స్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు కథానాయకుడిగా నటించిన రెండో సినిమానే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.
బుల్లితెర యాంకర్స్
మొదటి సారి మెయిన్ హీరోయిన్‌గా దీపిక పిల్లి నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు జబర్దస్త్ డైరెక్టర్స్ నితిన్ భరత్ దర్శకత్వం వహించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొదటి సినిమా టైటిల్‌తో వచ్చిన ఈ మూవీ ఇవాళ (ఏప్రిల్ 11) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూలో తెలుసుకుందాం.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కథ:
హైదరాబాద్‌లోని ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజీనిర్‌గా కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) పనిచేస్తుంటాడు. ఆంధ్ర-తమిళనాడు బార్డర్‌లోని ఓ గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించే కాంట్రాక్ట్ తన పనిచేస్తున్న కంపెనీకి వస్తుంది. దాంతో తన డ్రైవర్ (సత్య)తో కలిసి కృష్ణ ఆ ఊరికి వెళ్తాడు. అయితే, ఆ ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వాటిని బట్టి ఆ ఊరిలోకి కొత్త వాళ్లను రానివ్వరు.
60 మందికి ఒక్క అమ్మాయి
కానీ, ప్రభుత్వ పని కావడంతో కొన్ని నిబంధనల మేరకు వారిని లోపలికి రాణిస్తారు. నిజానికి ఆ ఊరిలో 60 మంది కుర్రాళ్లు పెళ్లి చేసుకోడానికి ఏకైక అమ్మాయి రాజా (దీపిక పిల్లి) ఉంటుంది. రాజాను ఆ గ్రామానికి అదృష్ట దేవతగా భావిస్తారు. ఆ 60 మంది కుర్రాళ్లలో ఎవరో ఒకరిని రాజా వివాహం చేసుకోవాలని, ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తిని ప్రెసిడెంట్‌గా చేయాలని ఊరి వారంతా ముందే ఫిక్స్ అవుతారు.
ఇలాంటి సమయంలో రాజా, కృష్ణ మధ్య ప్రేమ ఎలా చిగిరించింది? వారి ప్రేమ గురించి తెలిసిన ఊరివాళ్ల రియాక్షన్ ఏంటీ? కృష్ణ, రాజా ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే ఈ సినిమానూ చూడాల్సిందే.
విశ్లేషణ:
ప్రదీప్ హీరోగా, దీపిక హీరోయిన్‌గా, జబర్దస్త్ డైరెక్టర్స్ దర్శకత్వం, అది కూడా పవన్ కల్యాణ్ సినిమా టైటిల్‌తో మూవీ అనేసరికి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిపై ఆసక్తి నెలకొంది. ఇక సినిమా అంతా తమిళనాడు, ఆంధ్ర సరిహద్దులో పుట్టిన ఏకైక అమ్మాయి రాజా చుట్టూ తిరుగుతుంది. 60 మందికి ఒక్కరే అమ్మాయి అనే కాన్సెప్ట్, పెళ్లి చేసుకున్న వారే ప్రెసిడెంట్ అవడం వంటివి ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
మూవీ ప్రారంభం నుంచే ఫన్‌తో సాగుతుంది. ఇక సివిల్ ఇంజినీర్ కృష్ణ రావడంతో కథ మలుపు తిరుగుతుంది. రాజా, కృష్ణ మధ్య లవ్ ట్రాక్, సత్య-ప్రదీప్ కామెడీ ట్రాక్ అలరిస్తుంది. గెటప్ శ్రీను కామెడీ ట్రాక్ కూడా బాగా పేలింది. 60 మందిలో ఒకరితో రాజా పెళ్లి, ప్రెసిడెంట్, కమెడియన్స్ కామెడీ ట్రాక్‌తో ఫస్టాఫ్ ముగుస్తుంది.
ఫస్టాఫ్ అలా-సెకండాఫ్ ఇలా
అయితే, ఫస్ట్ హాఫ్ ఎంత ఆసక్తికరంగా సాగిందో, సెకండ్ హాఫ్ మాత్రం కూడా అంతే ఆసక్తికరంగా మలచడంలో దర్శక ద్వయం సఫలం అయింది. కాక పోతే ఫస్ట్ హాఫ్ కామెడీ చాలా ఆర్గానిక్‌గా వస్తే, సెకండ్ హాఫ్‌లో కామెడీ మాత్రం కాస్త ఫోర్స్‌డ్‌గా చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి కథతో గతంలో ఎలాంటి సినిమాలు రాలేదు. కానీ, కొన్ని సిమిలర్ లైన్స్ ఇతర సినిమాల్లో కనిపించాయి.
హీరో,హీరోయిన్‌ల పెళ్లి కావాలంటే.. హీరోయిన్ చెల్లెళ్లకు లేదా హీరో చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేస్తే, ఆ తర్వాత వివాహాలు జరిగేలా నిబంధనలు పెట్టుకున్నట్లుగా గతంలో కొన్ని సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇక్కడ అలాంటి ఒక పాయింట్‌ను ప్రధానంగా తీసుకున్నారు. అది బాగా కనెక్ట్ అయింది. చివరికి క్లైమాక్స్ వరకు సత్య, గెటప్ శ్రీను, ప్రదీప్‌ల కామెడీ కడుపుబ్బా నవ్వించేలా ఉంది.
ఎవరెలా చేశారంటే?
ఇక ప్రదీప్ మాచిరాజు కృష్ణ పాత్రలో ఆకట్టుకున్నాడు. “పక్కవాడు ఎలా పోతే నాకేం” అనుకునే ఒక టిపికల్ మైండ్‌సెట్ ఉన్న కుర్రాడిగా ఇమిడిపోయాడు. రాజా పాత్రలో హీరోయిన్ దీపిక పిల్లి సెట్ అయింది. వీరిద్దరి కాంబినేషన్ స్క్రీన్ మీద బాగుంది. సత్య, గెటప్ శ్రీను కామెడీ టైమింగ్ అలరిస్తుంది. వీరిద్దరి ట్రాక్ బాగానే ప్లస్ అయింది.
మురళీధర్ గౌడ్, రోహిణి వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రథన్ అందించిన పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు. లొకేషన్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. రన్ టైమ్ విషయంలో కాస్తా కేర్ తీసుకుని ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది.
ఫైనల్‌గా చెప్పాలంటే?
దర్శకులు నితిన్ భరత్ డైరెక్టర్స్‌గా దాదాపుగా మెప్పించే ప్రయత్నం చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే పెద్దగా ఎలాంటి ట్విస్టులు లేకుండా సాఫీగా కామెడీతో నవ్విస్తుంది యాంకర్స్ అయిన ప్రదీప్, దీపికల అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా.
రేటింగ్: 2.75/5
సంబంధిత కథనం