




Best Web Hosting Provider In India 2024

NTR District Tragedy : ఎన్టీఆర్ జిల్లాలో తీవ్ర విషాదం.. సైనైడ్ కలిపిన ఐస్‌క్రీమ్ తిని తండ్రీకొడుకులు మృతి
NTR District Tragedy : ఎన్టీఆర్ జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ఐస్‌క్రీమ్‌లో సైనైడ్ కలిపి, తనతో పాటు ఏడేళ్ల కుమారుడికి ఇచ్చి బంగారు ఆభరణాల వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో తండ్రి కొడుకులు మృతి చెందారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారమే ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఎన్టీఆర్ జిల్లా పెనమలూరు మండలంలోని యనమలకుదురు గ్రామంలో విషాదం జరిగింది. తండ్రీకుమారులు మృతిచెందారు. ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యనమలకుదురులోని వినోద్ పబ్లిక్ స్కూల్ రోడ్డులో ఒక అపార్ట్‌మెంట్‌లో వేమిరెడ్డి సాయిప్రకాష్ రెడ్డి (33), అతని భార్య లక్ష్మీ భవాని, ఇద్దరు పిల్లలు తక్షిత (కుమార్తె), ఏడేళ్ల తక్షిత్ (కుమారుడు) ఉన్నారు. సాయిప్రకాష్ రెడ్డి విజయవాడంలోని వన్‌టౌన్‌లో బంగారు ఆభరణాల తయారీ వ్యాపారం చేస్తుంటారు. భార్య లక్ష్మీ భవాని గాంధీనగర్‌లోని జన ఔషధి మెడికల్ షాపులోని పని చేస్తోంది.
వ్యాపారం సాగక అప్పులు..
కరోనా సమయంలో వ్యాపారం సరిగా లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. సాయి ప్రకాష్ రెడ్డి అప్పలు చేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయాడు. కొన్ని అప్పులు కుటుంబ సభ్యులు తీర్చినప్పటికీ.. ఊబి నుంచి బయటపడలేకపోయాడు. తీవ్ర మానసిక క్షోభకు లోనయ్యాడు. భార్య భవాని ధైర్యం చెప్పి.. కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అయినప్పటికీ అతనిలో ఆందోళన తగ్గలేదు. నిరంతరం అప్పులు గురించే బాధపడుతూ.. మానసికంగా కుంగిపోయాడు.
సైనైడ్ కలిపిన ఐస్‌క్రీమ్ తినీ..
ఈనెల 9వ తేదీ బుధవారం ఉదయం సాయిప్రకాష్ రెడ్డి తన రోజువారి పనిలోకి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చాడు. పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు. భవాని తాను మెడికల్ షాప్‌కు వెళ్లి వస్తానని అదే రోజు సాయింత్రం విజయవాడ బయలుదేరింది. ఇంటివద్దే ఉన్న సాయి ప్రకాష్ రెడ్డి సాయంత్రం ఆరు గంటల సమయంలో సైనైడ్ కలిపిన ఐస్‌క్రీమ్‌ను కుమారుడికి ఇచ్చి, తాను కూడా తిన్నాడు. అనంతరం స్నేహితుడు విజయ్‌కి తాను, తక్షిత్ సైనైడ్ తీసుకున్నామని ఫోన్‌లో సాయిప్రకాష్ రెడ్డి వాయిస్ మెసేజ్ చేశాడు.
చికిత్స పొందుతూ మృతి..
వారిద్దరూ అక్కడికక్కడే పడి పోవడాన్ని గమనించిన స్థానికులు లక్ష్మీ భవానికి ఫోన్ చేసి విషయం చెప్పారు. స్థానికులలో సహాయం కుటుంబ సభ్యులు వారిద్దరిని విజయవాడ పటమటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. భార్య లక్ష్మీ భవాని అక్కడికి చేరుకుంది. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు.
విషాదంలో కుటుంబం..
ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయి ప్రకాష్ రెడ్డి భార్య లక్ష్మీ భవాని, కుమార్తె తక్షిత, ఇతర కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం అనంతరం గురువారం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. సాయి ప్రకాష్ రెడ్డి భార్య లక్ష్మీ భవాని ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నామని పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపారు.
సాయి ప్రకాష్ రెడ్డి తన స్నేహితుడు విజయ్‌కు పంపిన వాయిస్ మెసేజ్ ఆధారంగా సైనైడ్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆత్మహత్యకు అప్పులు, ఆర్థిక భారమే కారణమని స్థానికులు చెబుతున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్