


Best Web Hosting Provider In India 2024

ఆంగ్ల వైద్యం కాకుండా మనదేశంలో క్యాన్సర్‌కు ఎలాంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఉన్నాయి?
అలోపతి అంటే ఇంగ్లీష్ మందుల వాడడం. అలోపతికి ముందే ఎన్నో వైద్య విధానాలు మన భారతదేశంలో ఉన్నాయి. వాటిలో ఆయుర్వేదం, హోమియోపతి వంటివి కూడా భాగమే.

క్యాన్సర్ సోకిన వారికి రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ ఆపరేషన్ వంటివి అందిస్తారు. ఇవన్నీ అలోపతి కేటగిరీలోకి వస్తాయి. అంటే ఆంగ్ల వైద్య విధానంలోకి వస్తాయి. ఇవి క్యాన్సర్‌ను ససమర్థవంతంగా ఎదుర్కొంటాయని ఇప్పటికే నిరూపణ జరిగింది. ఆంగ్ల వైద్య విధానంతో పాటు కొంతమంది రోగులు ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఉన్నాయేమో అని వెతుకుతూ ఉంటారు.
ప్రత్యామ్నాయ వైద్య విధానాలు అంటే… సంప్రదాయ వైద్య సంరక్షణ అని చెప్పుకోవచ్చు. క్యాన్సర్ రోగులు కొంతమంది వివిధ కారణాలవల్ల ప్రత్యామ్నాయ చికిత్సల వైపు ఆసక్తి చూపిస్తారు. ఉదాహరణకు ఆయుర్వేదం, హోమియోపతి, ప్రకృతి వైద్యం, చైనీస్ వైద్యం ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయ చికిత్సల జాబితాలోకే వస్తాయి. వీటిని నమ్మి క్యాన్సర్ కు ఈ పద్ధతుల్లో చికిత్స తీసుకునే వారు కూడా ఉన్నారు.
ఆయుర్వేదం
ఈ వైద్య విధానంలో ఆహారంలో మార్పులు చేస్తారు. కొన్ని రకాల మూలికలు వాడడం, వ్యాయామం చేయడం వంటి సహజ పద్ధతుల ద్వారా మనసు, శరీరం, ఆత్మను సమతుల్యం చేయడంపై దృష్టి పెడతారు. ఇది ఒక పురాతన భారతీయ వ్యవస్థ. ఈ ఆరోగ్య విధానంలో క్యాన్సర్ ఎంతవరకు తగ్గుతుంది అనేది అంచనా వేయడం కష్టమే. కానీ ఎంతో మంది క్యాన్సర్ రోగులు ఆయుర్వేదం మందులను కూడా వాడుతున్నారు.
హోమియోపతి
ఇది ఒక సహజ వైద్య ప్రక్రియ. శరీరం తనకు తానే వైద్యం చేసుకోవడానికి ప్రేరేపించే పదార్థాలను హోమియోపతిలో మందులుగా ఇస్తారు. ఇవి క్యాన్సర్ లక్షణాలను తగ్గిస్తాయని కూడా ఎంతోమంది నమ్ముతారు.
ప్రకృతి వైద్యం
ప్రకృతి వైద్యంలో పోషకాహారానికి మూలిక ఔషధాలకు, జీవనశైలిలో మార్పులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. శరీరం తనను తాను స్వస్థపరచుకునే సామర్థ్యాన్ని ఇవ్వాలంటే పోషకాహారాన్ని ఇవ్వాలని, జీవనశైలిలో మార్పులు చేయాలని ప్రకృతి వైద్యం వివరిస్తోంది.
ట్రెడిషనల్ చైనీస్ వైద్యం
ఈ చైనీస్ వైద్యం శరీరంలోని కీలక శక్తిని సమతుల్యం చేయడంపై దృష్టి పెడుతుంది. ఆక్యూపంచర్ వంటి పద్ధతుల ద్వారా కీమోథెరపీ వల్ల వచ్చే వికారాన్ని తగ్గించేందుకు, నొప్పుల నుండి ఉపశమనం పొందేలా చేయడానికి సంప్రదాయ చైనీస్ వైద్యం కృషి చేస్తుంది.
అరోమాథెరపీ
అరోమాథెరపీ అనేది శారీరక, భావోద్వేగ శ్రేయస్సును ప్రోత్సహించడానికి మొక్కల నుండి తీసుకున్న ముఖ్యమైన నూనెలను ఉపయోగించి వైద్యం చేస్తారు. ఇది మానసిక ఆందోళన తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. తద్వారా క్యాన్సర్ చికిత్సలో కొన్ని లక్షణాలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
అలోపతి కాకుండా మిగతా ప్రత్యామ్నాయ చికిత్స పద్ధతులన్నీ కూడా శరీరంపై ఒత్తిడి తగ్గించి, విశ్రాంతిని ఇవ్వడంపై దృష్టిపెడతాయి. భావోద్వేగాలను శాంత పరచడానికి ఉపయోగపడతాయి. క్యాన్సర్ రోగులు చికిత్స తీసుకునే విధంగా సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. వారి భావోద్వేగాలను కాపాడి మొత్తం ఆరోగ్యాన్ని రక్షించేందుకు సహాయపడతాయి. కొన్ని ప్రత్యామ్నాయ చికిత్సలు క్యాన్సర్ లక్షణాలను తగ్గించి, క్యాన్సర్ చికిత్స వల్ల కలిగిన దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయని కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి.
చాలామంది రోగులు ఆంగ్ల వైద్య విధానమైన అలోపతిలో చికిత్స తీసుకున్నాక… మానసిక శ్రేయస్సు కోసం ఇలా ప్రత్యామ్నాయ వైద్య విధానాల సాయాన్ని కోరుతున్నారు. రోగి జీవన నాణ్యతను పెంచడానికి ఈ వైద్య విధానాలు ఎంతగానో సహాయపడతాయి.
(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)
సంబంధిత కథనం