పిల్లలు అబద్ధం ఎందుకు చెబుతారు? ఈ అలవాటు పొగొట్టాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి?

Best Web Hosting Provider In India 2024

పిల్లలు అబద్ధం ఎందుకు చెబుతారు? ఈ అలవాటు పొగొట్టాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి?

Ramya Sri Marka HT Telugu
Published Apr 11, 2025 07:30 PM IST

తల్లిదండ్రులు పిల్లలను అబద్ధాలు చెప్పకూడదని చెప్తూనే పెంచుతారు. అయినప్పటికీ ఏదో ఒక సమయంలో వారు అబద్దం చెబుతుంటారు. ఇలా చేయడం వెనక కారణమంటే? పిల్లవాడికి ఉన్న ఈ అలవాటును మాన్పించాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి?

పిల్లవాడు తల్లిదండ్రులకు అబద్ధం ఎందుకు చెబుతారు
పిల్లవాడు తల్లిదండ్రులకు అబద్ధం ఎందుకు చెబుతారు

మనసు ఎప్పుడూ వద్దు అన్న పనిని చేయడానికి ఆరాటపడుతుంది. ఇది పిల్లల విషయంలో అయితే మరీ ఎక్కువ ఉంటుంది. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు వద్దు అన్ని పనినే చేయడానికి ప్రయత్నిస్తారు. దొరికిపోయినప్పుడు తప్పును కప్పి పుచ్చుకోవడానికి అబద్దాలు చెప్తారు. ఉదాహరణకు చాలా మంది చిన్న పిల్లలు మట్టి తింటారు, అమ్మ వచ్చి అడిగితే లేదు నేను తినలేదు అంటారు. ఇది సాధారణ బాల్య ప్రవర్తన కావచ్చు. కానీ ఇలా అబద్ధం చెప్పడం వారికి అలవాటుగా మారితే మాత్రం తల్లిదండ్రులకు తీవ్రమైన సమస్యగా మారుతంది.

పిల్లలలో అబద్దం చెప్పే అలవాటును సకాలంలో గుర్తించి వారిలో మార్పు తీసుకురాకపోతే పెద్దయ్యాక తల్లిదండ్రులకు ఇది ఇబ్బందికరంగా మారుతుంది. బాల్యం నుంచే పిల్లల ప్రవర్తన, అలవాట్ల పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

పిల్లలు ఎందుకు అబద్ధం చెప్పడానికి చాలా కారణాలుంటాయి..

  1. మనస్తత్వ శాస్త్రం ప్రకారం, పిల్లల చుట్టూ ఉన్న వాతావరణం వారి వ్యక్తిత్వాన్ని, అలవాట్లను నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పిల్లవాడి మొదటి పాఠశాల, అతని ఇల్లు, అతని మొదటి గురువు వారి సంరక్షకులు. వాటిని గమనిస్తూ పిల్లలు అవే అలవాట్లను అవలంబిస్తారు. కొన్నిసార్లు మంచి పెంపకాన్ని ఇవ్వడానికి తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా, తెలిసో తెలియకో వారి చిన్న చిన్న అలవాట్లు కూడా పిల్లలను చాలా పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తాయి.
  2. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక పరిశోధనలో ఐదవ తరగతి వరకు పిల్లలు పెద్దలు చెప్పూ అబద్దాలను విన్నారనీ, వారివల్లే పిల్లలు కూడా తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం చెప్పడం అలవాటు చేసుకున్నారనీ కనుగొన్నారు. అంటే మీ పిల్లలకు అబద్దాలు చెప్పే అలవాటు మీ వల్లే వచ్చిందనట్టు.
  3. అలాగే పిల్లలు తమ కుటుంబాలు లేదా తల్లిదండ్రుల మధ్య సురక్షితంగా, కంఫర్టబుల్‌గా ఫీలవనప్పుడు వారు ఇలాగే కొత్త కొత్త కథలను సృష్టించడం ప్రారంభిస్తారు. చాలాసార్లు పెద్ద పిల్లలు కూడా తమ తల్లిదండ్రులను ఒత్తిడి నుండి రక్షించే పరిస్థితి గురించి అబద్ధాలు చెబుతారు. వీటన్నింటితో పాటు టీవీ, ఇంటర్నెట్ లో లభించే కంటెంట్ కూడా పిల్లల అలవాట్లు, ప్రవర్తనను చాలా వరకు ప్రభావితం చేస్తుంది.
  4. వీటితో పాటు పిల్లలు అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టడానికి మరెన్నో కారణాలు ఉన్నాయి. తప్పు చేస్తే శిక్ష పడుతుందనే భయంతో కొందరు నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు.
  5. కొన్నిసార్లు, పిల్లలు ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి కూడా కాల్పనిక కథలను సృష్టించడం ప్రారంభిస్తారు.ముఖ్యంగా కౌమారదశలో సామాజిక ఒత్తిడి కారణంగా, వారి ఇమేజ్ను పెంచుకోవడానికి పిల్లలు తమ గురించి అతిశయోక్తి చేయడం ప్రారంభిస్తారు. పిల్లలలో అబద్ధం చెప్పే ఈ అలవాటు తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే విషయం అయినప్పటికీ, సరైన వ్యూహంతో వారితో ఈ అలవాటును మాన్పించచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.

అబద్దం చెప్పే అలవాటు మాన్పించడానికి ఏం చేయాలి?

1. పిల్లలతో ఫ్రీగా మాట్లాడండి:

చిన్నప్పటి నుండి పిల్లలతో తల్లిదండ్రులు ఫ్రీగా మాట్లాడాలి. వారికి ఒక కంఫర్టబుల్ సంభాషణను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా వారు వారి ప్రతి సమస్యను మీతో పంచుకోగలుతారు. ఎటువంటి భయం లేకుండా మీతో అన్నీ నిజాలు చెబుతారు.

2. ప్రతిదానికి అరవకండి:

పిల్లల మనస్సు చాలా చంచలంగా ఉంటుంది. మీరు చెప్పిన ప్రతి విషయాన్ని వారు ఒక్కసారికే వినిపించుకోవాలనీ, ఒక్కసారికే అర్థం చేసుకోవాలని ఏం లేదు. బాల్యం నుండి కౌమారదశ వరకు పిల్లలు తమ పరిసరాల నుండి ప్రతిరోజూ ఏదో ఒక కొత్త అనుభూతిని పొందుతారు, ఇది వారిని ఆసక్తిగా, ఉత్సాహంగా ఉంచుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఓపికతో పనిచేయాలి. మీ పిల్లవాడు చెప్పే విషయాలనూ, చేసే పనులనూ వెంటనే నిరాకరించకండి, వారి మీద గట్టిగా అరవకండి. వారి మాటలను ప్రశాంతంగా విని వారితో ఏకీభవించకపోయినా మీ అభిప్రాయాన్ని వారికి నెమ్మదిగా సౌకర్యవంతంగా వివరించడానికి ప్రయత్నించండి.

3. పాజిటివ్ వాతావరణాన్ని సృష్టించండి:

పిల్లలు తరచుగా వారి తల్లిదండ్రులను, వారి చుట్టు పక్కలుండే ఇతర పెద్దలను అనుకరిస్తారు. ఇది కాలక్రమేణా వారి అలవాటులో భాగం అవుతుంది. కాబట్టి పిల్లల ముందు మీరు రోల్ మోడల్, పాజిటివ్ పర్సనాలిటీని మాత్రమే చూపించండి. మీరు నిజాలు మాత్రమే చెప్పడం అలవాటు చేసుకోండి. వారు కూడా అదే నేర్చుకుంటారు.

4. ఒత్తిడి తీసుకోకండి, ఇవ్వకండి:

ప్రతి పిల్లవాడు మరొకరి కంటే భిన్నంగా ఉంటాడు. కానీ తల్లిదండ్రులు పిల్లలను సమాజంలోని ఉత్తమమైన వారిని చూపించి అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెబుతుంటారు. ఈ దిశగా వారిని ఒత్తిడికి గురి చేస్తారు. తమ అంచనాలను అందుకోవాలని పిల్లలను ఇబ్బంది పెడుతుంటారు. ఈ పరిస్థితిని నుంచి బయటపడటానికి పిల్లలు అబద్ధం చెప్పడం ప్రారంభిస్తారు. అలా కాకుండా పిల్లల ఇష్టాలకు విలువనివ్వడం అలవాటు చేసుకోండి. వారిని ఒత్తిడి చేసి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకండి.

5. అబద్దం చెప్తే కోపగించుకోకండి:

పిల్లలలో అబద్ధం చెప్పే అలవాటును మానిపించాలంటే మీరు చేయాల్సిన ముఖ్యమైన పనేంటంటే.. వారు అబద్ధాలు చెప్పినప్పుడు కోపగించుకోకండి. బదులుగా వారు ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందో నెమ్మదిగా, ఓపికగా అడిగి తెలుసుకోండి. నిజం చెప్పడం అలవాటు చేసుకునే వరకూ వారిని ఓపిగా, ప్రేమగా, మద్ధతునివ్వడం అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే క్రమంగా వారు అబద్ధం చెప్పే అలవాటును విడిచిపెడతారు.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024