





Best Web Hosting Provider In India 2024

డబ్బు గురించి భాగస్వామితో చర్చించడంలో తప్పేం లేదు! కలిసి తీసుకునే నిర్ణయాలే ఆర్థికంగా మిమ్మల్ని బలంగా ఉంచుతాయి!
కుటుంబ బాధ్యతలు మోసేవారికి ఆర్థిక ఒత్తిడి, భవిష్యత్ ప్రణాళికలు వంటివి భారంగా అనిపిస్తాయి. అటువంటి సమయంలో ఎవరో కొత్త వ్యక్తితో చర్చించి నిర్ణయాలు తీసుకునే బదులు కష్టసుఖాలు కలిసి అనుభవించాల్సిన మీ భాగస్వామిని సంప్రదించడం బెటర్.

కష్టాలలో, సుఖాలలో తోడుంటామని ఒకరికొకరు ప్రమాణం చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతుంటారు. ఆ తర్వాత కొందరు కుటుంబానికి ఎంతో కీలకమైన ఆర్థికపరమైన నిర్ణయాలను ఒక్కరే తీసుకుంటుంటారు. ఇది తామొక్కరమే సంపాదిస్తున్నామనే ఆలోచనతోనో లేదంటే తమ భాగస్వామికి తెలియకూడదనో ఇటువంటి ఆలోచనలు చేస్తుంటారు. మరికొందరు ఇద్దరూ సంపాదించే వారైనా కూడా ఎవరి ఆలోచనలు వారిగా ఉండి ఫ్యూచర్ ప్లానింగ్ సరిగా చేసుకోరు. వాస్తవానికి ఇద్దరూ కలిసి తీసుకునే నిర్ణయాలే బలంగా ఉంటాయట. ఇలా సక్సెస్ అయిన జంటను మీరు చాలా చోట్ల చూడొచ్చు కూడా.
ఆర్థిక లక్ష్యాలలో భాగస్వామి సహకారం
సంతోషం, దుఃఖాన్ని పంచుకున్నప్పుడు, జీవితాన్ని కలిసి ప్రణాళిక చేసుకున్నప్పుడు, ఆర్థిక ప్రణాళికలు కూడా కలిసి ఉండాలి. దీనికి, మీ ఆర్థిక ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం కూడా అవసరం. మీరు ఏదైనా ఆస్తి అంటే ఇల్లు కొనాలనుకుంటున్నారా? లేదా పిల్లల చదువు కోసం డబ్బులు పొదుపు చేయాలనుకుంటున్నారా? లేదా పదవీ విరమణ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ఇలాంటి పలు అంశాలలో మీ ఇద్దరికీ వేర్వేరు కలలు ఉండవచ్చు. అలాంటప్పుడు, వాటిని మీ భాగస్వామితో పంచుకోవడం మంచిది. ఇది పరస్పర అంగీకారానికి దోహదం చేస్తుంది. మీరు ఒకే దిశలో పనిచేసినప్పుడు, మీ ఆర్థిక కలలను సాధించడానికి మీరు తక్కువ కాలంలోనే లక్ష్యాలను చేరుకోగలుగుతారు.
బడ్జెట్ అవసరం
బడ్జెట్ రూపొందించడం ఆర్థిక పరిస్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇద్దరు వేర్వేరు వ్యక్తులు సంపాదిస్తున్నప్పుడు, ఖర్చు చేస్తున్నప్పుడు, ఆదాయం, ఖర్చులను లెక్కించాల్సిన అవసరం తప్పక ఉంటుంది. ఈ విషయంలో ఖర్చులను అవసరమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులుగా రెండు భాగాలుగా విభజించాలని చెబుతున్నారు నిపుణులు. దీని కోసం మీరు ఏ రకమైన ఖర్చులను తగ్గించగలరో, ఎక్కడ పొదుపు చేయగలరో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
ఖర్చులను సమానంగా పంచుకోండి
ప్రతి వ్యక్తి ఆదాయం వారి సామర్థ్యం, పని ఆధారంగా వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి, మీ ఇద్దరిలో ఒకరి ఆదాయం తక్కువగా ఉంటే, మరొకరిది ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి ఖర్చుల విషయంలో అభిప్రాయ భేదాలకు దారితీయవచ్చు. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి, మీరు ఇద్దరూ మీ ఆదాయం ప్రకారం ఖర్చులను సమానంగా పంచుకునే విధానాన్ని అనుసరించవచ్చు. ఇలా చేయడం వల్ల ఎవరిపైనా ఆర్థిక ఒత్తిడి ఉండదు, ఎవరికీ హీనభావం కలుగదు.
చర్చలు నిర్లక్ష్యం చేయకండి
మీ చుట్టూ ఉన్నవారిలో మీకు సలహాలు ఇచ్చే వారుంటారు. మీ డబ్బుల గురించి మీ భాగస్వామికి నిజం చెప్పకూడదని కొందరి ఆలోచనలను మీ మీద రుద్దుతుంటారు. కానీ, మీరు ఇద్దరూ మీ ఆర్థిక లక్ష్యాలు, ఖర్చులు, పెట్టుబడుల గురించి ఓపెన్‌గా మాట్లాడుకోగలిగితే, సమస్యలకు త్వరగా పరిష్కారం లభిస్తుంది. చర్చ ద్వారా, మీ భాగస్వామి ఆర్థిక పరిస్థితి గురించి మీకు తెలుస్తుంది. మీరు ఎంత ఖర్చు చేయగలరో, ఎంత పెట్టుబడి పెట్టగలరో తెలుసుకుంటారు. ఈ విషయంలో పారదర్శకత పరస్పర విశ్వాసానికి ఆధారం అవుతుంది.
ఆలోచించి సరైన పెట్టుబడి పెట్టండి
మీరు మొదటి దశను, అంటే మీ ఆదాయంలో ఒక భాగాన్ని పొదుపు చేయడం, ఖర్చులను నిర్వహించడం పూర్తి చేసిన తర్వాత, మరొక ముఖ్యమైన విషయం మీ దృష్టిని ఆకర్షిస్తుంది. అదే పెట్టుబడి, దీన్ని కూడా మీరిద్దరు కలిసి, ఆలోచించి అమలుచేస్తే ప్రభావవంతమైన ఫలితం ఉంటుంది. దీనికి షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ లేదా బంగారం వంటి ఎంపికలు ఉన్నాయి. మహిళలను పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహించడానికి కొన్ని పథకాలు అమలులో ఉన్నాయి. వీటిలో మంచి వడ్డీ రేట్లు లభిస్తున్నాయి. మీరు ఆ దిశలో కూడా ఆలోచించవచ్చు. మీరిద్దరికీ పెట్టుబడి గురించి పూర్తిగా తెలియకపోతే, ఆర్థిక సలహాదారుని సహాయం తీసుకోవడం మంచిది. సరైన పెట్టుబడి ద్వారా, మీరు భవిష్యత్తులో మీ లక్ష్యాలను సులభంగా సాధించగలరు.
అత్యవసర నిధి అవసరం
జీవితంలో సమస్యలు చెప్పిరావు. అనారోగ్యం, ఉద్యోగం కోల్పోవడం లేదా ఇంట్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడటం వంటి సమస్యలు ఎప్పుడైనా మీ తలుపు తట్టవచ్చు. అలాంటి పరిస్థితులకు మీరు ఆర్థికంగా సిద్ధంగా ఉండటం అవసరం. కాబట్టి, ఊహించని ఖర్చుల కోసం మీకు అత్యవసర నిధి ఉండటం అవసరం. ఈ అత్యవసర నిధి అనేది కనీసం మీకు 6 నెలల ఖర్చులకు సరిపోయేదిగా ఉండాలి.
సంబంధిత కథనం