





Best Web Hosting Provider In India 2024

హనుమాన్ జయంతి రోజున స్వామికి ఇష్టమైన ఆంజనేయ వడలు తయారు చేసి నైవేద్యంగా పెట్టండి.. ఇదిగోండి రెసిపీ!
హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుడికి ఇష్టమైన వంటకాలను తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఈసారి పవనపుత్రుడికి అత్యంత ప్రీతికరమైన వడలను తయారు చేసి ఆయన మెడలో మాలగా వేయండి. స్వామి ప్రసన్నుడై మీకు ఆశీస్సులు అందిస్తాడు. ఆంజనేయ వడ తయారు చేయడం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి.

దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఇంట్లోనూ, ఆలయాల్లోనూ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి రకరకాల నైవేద్యాలను సమర్పిస్తున్నారు. ఈ రోజున హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనకు ప్రతీ కరమైన ప్రసాదాలను చేసి పెట్టడం వల్ల సామి అనుగ్రహం లభిస్తుందని, ఆయన ఆశీస్సులు ఉంటే ధైర్యం, శక్తితో పాటు ఆరోగ్యం, ఆనందం కలిసి వస్తాయని భక్తుల నమ్మకం. మీరు కూడా ఈ రోజున హనుమంతుడికి ఇష్టమైన పదార్థాలను వంటి స్వామికి నైవేద్యంగా పెట్టాలనుకుంటే ఈ ఆంజనేయ వడ రెసిపీ మీ కోసమే.
హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది వడమాల. దీన్ని కొన్ని చోట్ల ఆంజనేయుడి వడ అని పిలుస్తారు. తమిళనాడులో ఇది చాలా ఫేమస్. అక్కడి ఆలయాల్లో, కొన్ని షాపుల్లో ఇవి దొరుకుతాయి. కరకరలాడుతూ ఉండే ఆంజనేయ వడలు చాలా రుచిగా ఉంటాయి. హనుమాన్ జయంతి రోజున వీటిని తయారు చేసి ఆయనకు ప్రసాదంగా పెట్టండి. దీన్ని సింపుల్‌గా తయారు చేయడం ఎలాగో తెలుసుకోండి.
ఆంజనేయ వడ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
- మినప పప్పు- ఒక కప్పు
- మిరియాలు- రెండు టేబుల్ స్పూన్లు
- రుచికి సరిపడా ఉప్పు
- జీలకర్ర- ఒక టేబుల్ స్పూన్
- నూనె – రెండు టేబుల్ స్పూన్లు
- ఇంగువ – పావు టీస్పూన్
- డీప్ ఫ్రైకి సరిపడా నూనె
ఆంజనేయ వడ తయారు చేసే విధానం:
- ఆంజనేయ వడ తయారు చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో మినప పప్పు వేసి నీరు పోసి 20 నిమిషాల పాటు నానబెట్టండి.(20 నిమిషాల కన్నా ఎక్కువ నానితే వడలు సరిగ్గా రావని గుర్తుంచుకోండి).
- ఇలా 20 నిమిషాల పాటు నానిన పప్పును చుక్క నీరు లేకుండా వడకట్టి పక్కకు పెట్టుకోండి.
- ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వడకట్టిన మినప పప్పు వేయండి.
- తరువాత దాంట్లో మిరియాలు, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి మిక్సీ పట్టండి.(మిక్సీ పట్టేటప్పుడు దీంట్లో చుక్క నీరు కూడా పోయకూడదు, పోసారంటే వడలు పాడైపోతాయి).
- ఇప్పుడు దీంట్లో కొద్దిగా వేడి వేడి నూనె పోసి, ఇంగువ వేసి కలపండి. పిండి గట్టిగా, చిక్కగా, బరకగా చపాతీ పిండిలా ఉండేలా చూసుకోండి.
- ఇప్పుడు శుభ్రమైన కాటన్ వస్త్రాన్ని తడి చేసి తీసుకుని దాన్ని నేల మీద పరచాలి.
- తరువాత మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని బట్ట మీద వడలాగా తయారు చేసి మధ్యలో రంధ్రం చేయండి.
- ఇలా మొత్తం పిండితో వడలు తయారు చేసుకని కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆరకపోతే వడలు బూరెల్లా పొంగుతాయి.
- ఇప్పుడు వడలు ఆరే లోపు డీప్ ఫ్రైకి కోసం ఒక కడాయి తీసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయండి.
- నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో మనం తయారుచేసి పక్కకు పెట్టుకున్న వడలు వేసి వేయించండి.
- మీడియం ఫ్లేంలో రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టుకోండి.
- మిగిలిన వడలను కూడా ఇలాగే సగం వేయించుకున్న తర్వాత తిరిగి మొదట వేయించిన వడలను వేయించుకోండి.
- అంటే వడలను ఒకేసారి వేయించడం కాకుండా రెండు సార్లు వేయించాలి.
అంతే కరకరలాడే, రుచికరమైన ఆంజనేయ వడలు రెడీ అయినట్టే. వీటిని హనుమంతుడికి మాలగా కట్టి వడమాల సమర్పించండి.
సంబంధిత కథనం