





Best Web Hosting Provider In India 2024

AP Inter Results 2025 : పరీక్షలు.. మార్కులు.. ర్యాంకులే భవిష్యత్తు కాదు.. తొందరపాటు నిర్ణయాలొద్దు!
AP Inter Results 2025 : పరీక్షలు ముగిశాయి. ఇక ఫలితాల కాలం వచ్చింది. ఈ సమయంలో ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. శనివారం ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల అవుతాయి. వీటిల్లో మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల కాబోతున్నాయి. దీంట్లో మార్కులు తక్కువ వచ్చాయనో.. ఉత్తీర్ణత సాధించలేదనో కుంగిపోకుండా.. ధైర్యంగా మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచంలో ఎంతోమంది ప్రముఖులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వచ్చిన వారేనని.. వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని స్పష్టం చేస్తున్నారు.
జీవితం ముగిసిపోదు..
‘పరీక్షలు, మార్కులు, ర్యాంకులే భవిష్యత్తు కాదు. జీవితంలో మార్కులే పరమావధి కాదు. తక్కువ మార్కులు వచ్చినా.. ఫెయిల్ అయినా జీవితం ముగిసిపోదు. విద్యార్థులు నిరాశ చెందకుండా మరింత ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే.. విజయం సాధ్యం అవుతుంది. అందుకు ఉదాహరణ సచిన్ టెండూల్కర్. పది ఫెయిల్ అయినా.. వరల్డ్ స్టార్ క్రికెటర్ అయ్యారు. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ గోపాల్ చెప్పారు.
టెలీమానస్‌కు ఫోన్ చేయండి..
విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడటానికి కేంద్రం టెలీమానస్‌ను తీసుకొచ్చింది. టెలీ మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్‌వర్కింగ్ అక్రాస్ స్టేట్స్ (టెలీమానస్)కు దేశవ్యాప్తంగా 14416 లేదా 1800 8914416 టోల్‌ఫ్రీ నంబరు కేటాయించారు. పరీక్షల ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆత్మహత్య ఆలోచనలు, మద్యం వ్యసనాలు, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేయొచ్చు.
పెరుగుతున్న ఒత్తిడి..
ఆ నంబరుకు ఫోన్ చేస్తే ఐవీఆర్‌ఎస్ ద్వారా భాషను ఎన్నుకోవాలి. ఆ భాషలోని సుశిక్షితులైన కౌన్సిలర్‌కు కనెక్ట్ చేసి మాట్లాడిస్తారు. సైకియాట్రిక్ వైద్య నిపుణులున్న కేంద్రానికి సిఫార్సు చేస్తారు. ఒకవేళ వ్యక్తిని ప్రత్యక్షంగా ఇంటివద్దే కలవాల్సి ఉంటే.. ప్రాథమిక వైద్య సిబ్బందికి సమాచారం పంపిస్తారు. ఏప్రిల్, మే నెలల్లో పలు పరీక్షల ఫలితాల విడుదల అవుతాయి. ఫలితాల తేదీలు సమీపిస్తున్న కొద్దీ విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అందుకే టెలీమానస్‌కు ఫోన్ చేసి విద్యార్థులు మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని అధ్యాపకులు చెబుతున్నారు.
వాట్సాప్ ద్వారా ఫలితాలు..
ఇవాళ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు అధికారులు ఫలితాలను విడుదల చేయనున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 అందుబాటులో ఉంటుంది. వాట్సాప్ నెంబర్ ద్వారా ఇంటర్ ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎస్ఎంఎస్ ద్వారా కూడా రిజల్ట్ తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు.
సంబంధిత కథనం
టాపిక్