




Best Web Hosting Provider In India 2024

Nerella Incident : నేరెళ్ల ఘటనపై దుష్ప్రచారాన్ని ఆపండి.. లేకపోతే చర్యలు తప్పవు.. ఎస్సీ కమిషన్ హెచ్చరిక
Nerella Incident : నేరెళ్ల ఘటన గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై.. ఎస్సీ కమిషన్ సీరియస్గా స్పందించింది. దుష్ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసింది. లేకపోతే.. చర్యలు తీసుకోక తప్పదని ఎస్సీ కమిషన్ హెచ్చరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల గ్రామంలో 2017 జులైలో ఇసుక అక్రమ దందా జరిగింది. దీన్ని అడ్డుకునేందుకు యత్నించిన దళితులపై పోలీసుల కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా జాతీయ ఎస్సీ కమిషన్ తోపాటు అప్పటి లోక్సభ స్పీకర్ మీరా కుమారి నేరెళ్లను సందర్శించి.. బాధితులకు బాసటగా నిలిచారు.
ప్రచారాన్ని వెంటనే ఆపాలి..
అప్పటి ఘటన గురించి కొంతమంది సోషల్ మీడియా వేదికగా జాతీయ ఎస్సీ కమిషన్ను బద్నాం చేస్తున్నట్లు సమాచారం అందుకున్న.. కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ తీవ్రంగా స్పందించారు. దళితుల పక్షాన పనిచేసే ఎస్సీ కమిషన్ను నిందించడాన్ని తప్పుపట్టారు. తక్షణమే ఆ దుష్ప్రచారాన్ని ఆపాలని సూచించారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నివేదిక బహిర్గతం..
నేరెళ్ల ఘటనలో ఎస్సీ కమిషన్ జరిపిన విచారణతోపాటు ప్రభుత్వానికి పంపిన మధ్యంతర నివేదికను రామచందర్ మీడియాకు విడుదల చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా, బాధ్యులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తూ.. ఆ నివేదికను రూపొందించిన అంశాన్ని గుర్తు చేశారు. జాతీయ ఎస్సీ కమిషన్ ప్రతిష్టను దిగజార్చే విధంగా కొంత మంది వ్యక్తులు మాట్లాడుతున్నట్లు.. ఢిల్లీలోని జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి వచ్చిందని చెప్పారు.
వెంటనే స్పందిస్తాం..
మెజిస్టీరియల్ అధికారాలున్న ఎస్సీ కమిషన్.. దళితులపై జరిగే దాడులు, వేధింపులపై ఎప్పటికప్పుడు స్పందిందని రామచందర్ స్పష్టం చేశారు. ఘటనలపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడంలో అగ్రభాగాన ఉందన్నారు. 2017 జులైలో నేరెళ్ల గ్రామంలో జరిగిన ఘటనపై స్వయంగా ఎస్సీ కమిషన్ ఆ గ్రామంలో పర్యటించింది. బహిరంగ విచారణ జరిపిందని, ఈ విషయం అక్కడి ప్రజలకు, అధికారులకు, పోలీస్ సిబ్బందికి తెలుసన్నారు.
స్టేట్మెంట్ రికార్డ్ చేశాం..
విచారణ జరిగిన వెంటనే ఎస్సీ కమిషన్ కరీంనగర్ జైలుకు వెళ్లి నేరెళ్ల బాధితులను కలిసి స్టేట్ మెంట్ రికార్డు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులను విచారణకు పిలిచి వారి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశామని రామచందర్ చెప్పారు. అదే ఏడాది ఆగస్టు 7న అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మధ్యంతర నివేదికను పంపిస్తూ.. తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశించిందన్నారు. ఈ విషయం మీడియాలో వచ్చిందని వివరించారు.
నివేదికలోని అంశాలు..
2017 ఆగస్టు 7న ఫైల్ నెం 3/33/17టీఎస్ఆర్యూ పేరుతో పంపిన మధ్యంతర నివేదికలో ప్రధానంగా 5 అంశాలను ప్రస్తావిస్తూ చర్యలకు ఆదేశించింది.
1.ఈ ఘటనపై హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపాలి.
2.నేరెళ్ల ఘటనపై విచారణ సాఫీగా జరగాలంటే.. సిరిసిల్ల జిల్లా ఎస్పీని బదిలీ చేయాలి. ఆ జ్యూరిడిక్షన్ పరిధిలో ఉండకూడదు.
3.సంబంధిత డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలి.
4.బాధితులకు పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలి. చికిత్స అందించాలి.
5.బాధితులకు రూ.5 లక్షల పరిహారం అందించాలి.
ఇంత స్పష్టంగా నివేదిక ఇచ్చినప్పటికీ కొందరు కావాలని దుస్ప్రచారం చేయడం సబబు కాదని.. రామచందర్ వ్యాఖ్యానించారు.
(రిపోర్టింగ్- కె.వి. రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్