





Best Web Hosting Provider In India 2024

రెస్టారెంట్ స్టైల్ మేథీ చమన్ కర్రీని ఇంట్లోనే ఈజీగా తయారు చేయచ్చు.. ఇదిగోండి సింపుల్ రెసిపీ!
మీకు మేథీ చమన్ కర్రీ అంటే ఇష్టమా? ఎప్పుడు రెస్టారెంట్‌కు వెళ్లినా తప్పకుండా ఆర్డర్ చేసి తింటారా? అయితే ఈ రెసిపీ మీ కోసమే. ఈ టిప్స్‌తో రెసిపీతో ట్రై చేశారంటే రెస్టారెంట్ స్లైల్ మేథీ చమన్ కర్రీని ఇంట్లోనే ఆస్వాదించవచ్చు. ఇదిగోండి ఈజీ రెసిపీ ఇవాళే ట్రై చేసేయండి.

రుచికరమైన మేథీ చమన్ కర్రీ
రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు చాలా మంది ఆర్డర్ చేసే కర్రీల్లో మేథీ చమన్ కర్రీ ముందుంటుంది. చపాతీలు, పరోటాలు, బిర్యానీ, రైస్ ఇలా అన్నింటిలోకి సెట్ అయ్యే ఈ కర్రీ అంటే చాలా మందికి ఇష్టం. మామూలుగా మెంతికూర తినడానికి ఇష్టపడని వారు కూడా ఈ మేథీ చమన్ కర్రీని ఇష్టంగా తింటారు. మీకు కూడా ఈ కర్రీ అంటే చాలా ఇష్టమైతే ఈ రెసిపీ మీ కోసమే. ఈ చిట్కాలతో వండారంటే మీరు ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మేథీ చమన్ కర్రీని తయారు చేసుకోవచ్చు. ఖర్చు మిగలించుకోవడంతో పాటు అంతకుమించిన రుచిని ఆస్వాదించవచ్చు. మరి ఆలస్యం ఎందుకు రెస్టారెంట్ స్టైల్ మేథీ చమన్ కర్రీ రెసిపీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి.
మేథీ చమన్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
- జీడిపప్పు – 50 గ్రాములు
- నూనె- 8 టేబుల్ స్పూన్లు
- సోంపు – అరటీస్పూన్
- జీలకర్ర – అరటీస్పూన్
- ఉల్లిపాయలు- రెండు మీడియం సైజ్
- పచ్చిమిరపకాయలు- రెండు
- అల్లం వెల్లుల్లి పేస్ట్- అరటేబుల్ స్పూన్
- టమాటాలు- రెండు
- ధనియాల పొడి- ఒక టీస్పూన్
- పసుపు- పావు టీ స్పూన్
- కారం పొడి- ఒక టీస్పూన్
- గరం మసాలా- అర టీస్పూన్
- కసూరీ మేథీ- రెండు టేబుల్ స్పూన్లు
- ఉప్పు – రుచికి సరిపడా
- నీరు – అరకప్పు
- మెంతి ఆకులు- ఒకటిన్నర కప్పు
- పనీర్- 200గ్రాములు
- క్రీం- పావు కప్పు(పాల మీగడ క్రీం)
- నెయ్యి- ఒక టీస్పూన్
మేథీ చమన్ కర్రీ తయారు చేసే విధానం..
- మేథీ చమన్ రెసిపీ తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు వేడి నీటిలో 50 గ్రామలు జీడిపప్పులను వేసి నానబెట్టండి.
- అరగంట తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా తయారు చేసుకుని పక్కకు పెట్టుకోండి.
- ఇప్పుడు ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టి దాంట్లో ఎనిమిది టేబుల్ స్పూన్ల నూనె పోయండి. (ఇంత నూనె అవసరమా మీకు అనిపించవచ్చు. రెస్టారెంట్ స్టైల్ రుచి రావాలంటే ఈ కూరకు ఎక్కువ నూనె అవసరం అవుతుంది.)
- నూనె కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో అరటీస్పూన్ సోంపు, అరటీస్పూన్ జీలకర్ర వేసి వేయించండి.
- ఇవి కాస్త వేగిన దీంట్లో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేయండి.
- ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా వేసి బంగారు రంగులోకి మారిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేయండి.
- పచ్చిమిర్చీ కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించండి.
- అన్నీ చక్కగా వేగిన తర్వాత దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేయండి.
- టమాటోలు పూర్తిగా ఉడికి మెత్తటి గుజ్జులా మారేంతవరకూ వీటిని ఉడికించాలి.
- ఇవి మెత్తగా ఉడికి నూనె పైకి తేలుతుండగానే ఇందులో ధనియాల పొడి, పసుపు, కారంపొడి, గరం మసాలా వేయండి.
- తరువాత చేత్తో మెత్తగా నలిపిన కసూరీ మేథీ రుచికి సరిపడా ఉప్పుతో పాటు కొద్దిగా నీరు పోసి బాగా కలపండి. (నీరు పోయడం వల్ల మసాలాలు మాడకుండా చక్కగా ఉడుకుతాయి)
- మసాలాలన్నీ చక్కగా ఉడికి వీటిలో నుంచి నూనె పైకి తేలెంత వరకూ ఉడికించిన తర్వాత దీంట్లో శుభ్రగా కడిగి కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకులను వేసి బాగా కలపండి.
- మెంతి కూరను మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి అప్పుడప్పుడూ కలుపుతూ నూనె పైకి తేలేంత వరకూ ఉడికించాలి. లేదంటే మెంతి ఆకులు చేదెక్కి కూర రుచి పాడైపోతుంది.
- మెంతి ఆకులన్నీ చక్కగా ఉడికిపోయి కూరలో నుంచి నూనె పైకి తేలిన తర్వాత దీంట్లో ముందుగా నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్టును వేయండి.
- దీంతో పాటు కప్పు నీటిని కూడా పోసి బాగా కలిపి ఉడికించండి.
- ఈ మిశ్రమాన్ని మధ్యమధ్యలో కలుపుతూ మీడియం మంట మీద నూనె పైకి తేలెంత వరకూ ఉడికించాలి. మంట పెంచారంటే కూర మాడిపోయి తినకుండా అయిపోతుంది.
- ఇలా పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించిన తర్వాత దీంట్లో చిన్నగా తరిగిన పనీర్ ముక్కలను వేయండి.
- తరువాత దీంట్లో ఫ్రెష్ క్రీం, సన్నగా తురుముకున్న పనీర్‌ను వేసి బాగా కలపండి.
- ఇప్పుడు దీంట్లో చేత్తో బాగా నలిపి పెట్టుకున్న కసూరీ మేథీ పొడితో పాటు కొద్దిగా నెయ్యి వేసి బాగా కలపి స్టవ్ ఆఫ్ చేశారంటే రెస్టీరెంట్ స్టైల్ మేథీ చమన్ కర్రీ రెడీ అయినట్టే.రెసిపీ నచ్చింది కదా.. లేట్ ఎందుకు ట్రై చేసేయండి మరీ.
సంబంధిత కథనం