






Best Web Hosting Provider In India 2024

OTT Review: ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమా భయపెట్టిందా.. థ్రిల్ ఇచ్చిందా!
Chhorii 2 Review OTT: ఓటీటీలోకి ఛోరీ 2 చిత్రం ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ హారర్ థ్రిల్లర్ సీక్వెల్ మూవీ భయపెట్టిందా.. అంచనాలను నిలబెట్టుకుందా అనేది ఈ రివ్యూలో తెలుసుకోండి.

సినిమా: ఛోరీ 2, స్ట్రీమింగ్: అమెజాన్ ప్రైమ్ వీడియో (ఏప్రిల్ 11 నుంచి, హిందీ)
ప్రధాన నటీనటులు: నుష్రత్ బరూచా, సోహా అలీ ఖాన్, హార్దిక శర్మ, గష్మీర్ మహాజానీ, సౌరభ్ గోయల్ తదితరులు
సినిమాటోగ్రఫీ: అన్షుల్ చోబే, ఎడిటర్: అభిషేక్ ఓజా, సంగీతం: అద్రిజ గుప్తా
నిర్మాతలు: భూషణ్ కుమార్, కృషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, జాక్ డేవిస్
దర్శకత్వం: విశాల్ ఫురియా
మరాఠీ మూవీ లాపాఛపీకి హిందీ రీమేక్‍గా 2021లో ‘ఛోరీ’ చిత్రం వచ్చింది. ఇది నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. సుమారు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఆ చిత్రానికి రీమేక్‍గా ‘ఛోరీ 2’ కూడా డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‍కే వచ్చింది. ఈ పక్కా హారర్ థ్రిల్లర్ చిత్రంపై ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ఈ ఛోరీ 2 సినిమా అంచనాలకు తగ్గట్టుగా థ్రిల్లింగ్‍గా ఉందా.. భయపెట్టిందా అనే విషయాలు ఈ రివ్యూలో చూడండి.
కథ ఇలా..
ఛోరీకి కొనసాగింపుగా ఛోరీ 2 కథ మొదలవుతుంది. తన కడుపులో బిడ్డను రక్షించుకునేందుకు భర్త రాజ్‍బీర్ (సౌరభ్ గోయల్), అత్తమామలపై దాడి చేసి ఆ గ్రామం నుంచి తప్పించుకుంటుంది సాక్షి (నుష్రత్ బరూచా). వేరే ఊరికి వెళ్లి ఆడపిల్ల ఇషానీ (హార్దిక మెహతా)కి జన్మనిస్తుంది. పోలీస్ ఆఫీసర్ సమర్ (గష్మీర్ మహాజానీ).. సాక్షికి సాయం చేసి ఉండేందుకు ఇల్లు ఇస్తాడు. అయితే, సూర్యుడి కాంతి తగిలితే చర్మం కాలిపోయే సమస్య సాక్షి కూతురు ఇషానీకి ఉంటుంది. ఏడేళ్ల సమయం సాగిపోతుంది. ఓ రోజు కొందరు ఇషానీని కిడ్నాప్ చేస్తారు. కూతురిని వెతుక్కుంటూ వెళ్లిన సాక్షి కూడా అదే గ్రామంలో ప్రమాదంలో చిక్కుకుంటుంది. ఇక్కడ భయానక పరిస్థితులు, ఊహించని అనూహ్యమైన విషయాలు జరుగుతుంటాయి. కూతురిని కాపాడుకునేందుకు సాక్షి అరాటపడుతూ ఉంటుంది. ఇషానీని కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు ఎత్తుకెళ్లారు? ఆ పాపతో దాసీ మా (సోహా అలీ ఖాన్) ఏం అవసరం ఉంటుంది? తన కూతురిని సాక్షి రక్షించుకుందా? ఆమెకు ఎదురైన సవాళ్లు, అనుకోని విషయాలు ఏంటి? అనేవి ఛోరీ 2 సినిమాలో ఉంటాయి. (ఛోరీ అంటే తెలుగులో పాప, మహిళ అని అర్థం.)
కథనం ఇలా..
ఛోరీ 2 చిత్రాన్ని పక్కా హారర్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు దర్శకుడు విశాల్ ఫురియా. కామెడీ లాంటి సైడ్ ట్రాక్‍కు వెళ్లకుండా అనుకున్న అంశాలకే కట్టుబడ్డారు. హారర్‌తో పాటు బాలికలపై జరిగే కొన్ని సామాజిక దురాచారాలను, మూఢ నమ్మకాలను మేళవించి ఈ స్టోరీ రాసుకున్నారు. సినిమాలో అసలు కథలోకి వెళ్లేందుకు ఎక్కువగా సమయం తీసుకోలేదు దర్శకుడు. ఆరంభంలో కథనం రేసీగా ఉంటుంది. ఆసక్తికరంగా సాగుతుంది. గతం వెంటాతుందేమోనని సాక్షి కంగారు పడడం సస్పెన్స్ రేకెత్తిస్తుంది. సూర్యుడి కాంతి వల్ల ఇషానీకి ఉండే సమస్య వెనుక ఏదో మిస్టరీ ఉందనే ఆసక్తి కలుగజేస్తుంది.
సాక్షితో ప్లాష్‍బ్యాక్‍ను దర్శకుడు ఈ చిత్రంలో సింపుల్‍గా చెప్పిస్తాడు. ఫస్ట్ పార్ట్ చూడని వారికి కూడా ఈ సీక్వెల్ మూవీ బాగానే అర్థమవుతుంది. మేజర్ పాయింట్స్ మిస్ అయిన ఫీలింగ్ ఉండదు.
ఇషానీని కిడ్నాప్ చేసే సీన్, చెరకు తోటలో సాక్షిని ట్రాప్ చేసే ఎపిసోడ్ సస్పెన్స్‌ఫుల్‍గా సాగుతాయి. థ్రిల్లింగ్‍గా అనిపిస్తాయి. ఈ సీన్లలో హారర్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఇషానీని కాపాడుకునేందుకు అండర్ గ్రౌండ్‍లో సాక్షి చేసే అన్వేషణ, ఆమెకు ఎదురయ్యే కొన్ని ట్విస్టులు మెప్పిస్తాయి.
రిపీట్ అయినట్టుగా..
సెకండాఫ్‍లో అండర్‌గ్రౌండ్‍లో కొన్ని సీన్లు రిపీడెట్‍గా అనిపిస్తాయి. ఇషానీ కోసం సాక్షి వెతికే ఎపిసోడ్ బాగానే ఉన్నా.. కాస్త డ్రాగ్ చేసిన ఫీలింగ్ అనిపిస్తుంది. స్క్రీన్‍ప్లే మరింత మెరుగ్గా ఉండి ఉంటే మరింత థ్రిల్ పంచేది.
క్లైమాక్స్.. హడావుడిగా..
ఈ సినిమా క్లైమాక్స్ కాస్త నిరాశపరుస్తుంది. హడావుడిగా చుట్టేసినట్టు అనిపిస్తుంది. సడెన్‍గా మనసు మారిపోవడం లాంటివి అంత కన్విన్సింగ్‍గా అనిపించదు. ముగింపును డైరెక్టర్ మరింత బాగా తెరకెక్కించాల్సింది. క్లైమాక్స్‌లో ఏదైనా కాన్‍ఫ్లిక్ట్ ఉండాల్సింది. చివర్లో బాల్య వివాహాలు, బాలికలపై జరుగుతున్న దురాచారాల గురించి సందేశం ఉంటుంది. అది బాగానే అర్థమవుతుంది.
భయం కాస్త తక్కువే..
ఛోరీ 2 మూవీలో ఉన్నంతలో హారర్ ఎలిమెంట్లు బాగానే ఉన్నాయి. అయితే, మరీ వణించే రేంజ్‍లో తరచూ భయపెట్టే సీన్లు ఉండవు. మోస్తరుగానే ఉంటాయి. హారర్ సీన్లతో భయపెట్టే కన్నా.. కథపైనే మేకర్స్ ఎక్కువగా దృష్టి పెట్టారు.
సాంకేతిక విషయాలు ఇలా..
డైరెక్టర్ విశాల్ ఫురియా అనుకున్న కథకు కట్టుబడి సినిమాను తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ కథనం మెప్పిస్తుంది. ఇంట్రెస్టింగ్‍గా నడుస్తుంది. సెకండాఫ్‍లో కాస్త స్క్రిన్‍ప్లే ఎక్కువ దృష్టి పెట్టాల్సింది. క్లైమాక్స్ కూడా మెరుగ్గా ఉండాల్సింది. ఓవరాల్‍గా అయితే ఓ డీసెంట్ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని చూపించారు. అన్షుల్ చోబే సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. కలర్ గ్రేడింగ్ సూటయ్యేలా ఉంది. అద్రిజ గుప్తా ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. టీ సిరీస్‍కు తగ్గట్టుగా నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పర్ఫార్మెన్స్ ఇలా..
సాక్షి పాత్రకు నుష్రత్ బరుచా పూర్తి న్యాయం చేశారు. తన కూతురిని కాపాడుకునేందుకు ఏమైనా చేసే తల్లిలా నటనతో మెప్పించారు. దాసీ మాగా సోహా అలీ ఖాన్ యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. భయపెట్టేలా ఆమె పర్ఫార్మెన్స్ సాగుతుంది. మేకోవర్ కూడా బాగా సూటైంది. ఇషానీగా చేసిన బాలనటి హార్దిక మెహతా మెప్పించారు. సెటిల్డ్ యాక్టింగ్‍తో ఆకట్టుకున్నారు. గష్మీర్ మహాజానీ, సౌరభ్ గోయల్ సహా ఇతర నటీనటులు వారి పాత్రల్లో ఓకే అనిపించారు.
మొత్తంగా..
ఛోరీ 2 సినిమాలో కొన్ని లోపాలు ఉన్నా ఆకట్టుకుంటుంది. హారర్ చిత్రాలు నచ్చే వారిని మెప్పిస్తుంది. ముఖ్యంగా ఎలాంటి పక్కదోవ పట్టకుండా పక్కా హారర్ థ్రిల్లర్ చిత్రం చూడాలనుకునే వారికి బాగా అనిపిస్తుంది. అక్కడక్కడా స్క్రీన్‍ప్లే, క్లైమాక్స్ ఆశించిన రేంజ్‍లో లేకపోయినా.. ఓవరాల్‍గా సినిమా ఓకే అనిపిస్తుంది. అభ్యంతకరమైన సీన్లు, మితిమీరిన హింస లేకపోవటంతో కుటుంబంతో కలిసి కూడా చూడొచ్చు. ఈ వీకెండ్ ఓటీటీలో ఓసారి ఛోరీ 2 చూసేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ చిత్రం హిందీలో స్ట్రీమ్ అవుతోంది.
సంబంధిత కథనం