




Best Web Hosting Provider In India 2024

BRS Silver Jubilee Sabha : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లైన్ క్లియర్ – పర్మిషన్ ఇచ్చిన వరంగల్ పోలీసులు
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లైన్ క్లియర్ అయింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో… నగర పోలీసులు సభకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ప్రొసీడింగ్స్ కాపీని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నేతలకు అందజేశారు. మరోవైపు సభ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. ఏప్రిల్ 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సమీపంలో నిర్వహించనున్న సభకు అనుమతులు ఇస్తూ వరంగల్ పోలీసులు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఈ మేరకు పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఒడితల సతీశ్ కుమార్, ఇతర నేతలకు వరంగల్ కమిషనరేట్ పరిధి కాజీపేట ఏసీపీ తిరుమల్ పర్మిషన్ కాపీలను అందజేశారు.
దీంతో కొద్దిరోజులుగా బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహణపై నెలకొన్న సందిగ్ధానికి ఎట్టకేలకు తెరపడినట్లయ్యింది. ఇదిలాఉంటే ఇప్పటికే బహిరంగ సభ నిర్వహణ కోసం బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా.. రాష్ట్ర ప్రభుత్వానికి, వరంగల్ సీపీ హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సభ నిర్వహణకు శనివారం సాయంత్రం వరంగల్ పోలీసులు అనుమతులు ఇస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారు.
కోర్టుకెళ్లిన బీఆర్ఎస్
ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు, బహిరంగ సభ నిర్వహణకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఆ పార్టీ నేతలు మార్చి 28న కాజీపేట ఏసీపీకి దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ దరఖాస్తు దాదాపు 10 రోజులకుపైగా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఈ నెల 9న బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, ఇతర నేతలు హైకోర్టుకు వెళ్లారు. దీంతో ఈ నెల 11న విచారణ జరిపిన హైకోర్టు.. అనుమతుల జాప్యంపై వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి, వరంగల్ పోలీస్ కమిషనర్ కు నోటీసులు ఇచ్చింది.
‘వివరణ ఇవ్వకుండానే కోర్టుకు..’
బీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహణ అనుమతుల కోసం హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో శనివారం ఉదయం వరంగల్ పోలీసులు ఈ విషయంపై ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మార్చి 28న బీఆర్ఎస్ నేతలు పర్మిషన్ కోసం దరఖాస్తు అందజేశారని పేర్కొన్నారు. కానీ సభ నిర్వహణకు ఎంతమంది ప్రజలు వస్తున్నారు..? ఎన్ని వాహనాలు…? సభా ప్రాంగణం విస్తీర్ణం.. పార్కింగ్ ఏర్పాట్లు.. ఇతర వివరాలు అందించాల్సిందిగా అదే రోజు ఒక ఫార్మాట్ ను రూపొందించి, పోలీసులకు అందజేశామన్నారు.
దానికి సరైన వివరణ ఇవ్వకుండానే బీఆర్ఎస్ నేతలు ఈ నెల 9న రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారని పోలీసులు తెలిపారు. కోర్టుకు వెళ్లిన అనంతరం ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో పోలీసులు అడిగిన వివరాలను అందజేశారన్నారు. ఈ మేరకు ఆ వివరాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. కాగా బీఆర్ఎస్ నేతలు వివరాలను పరిశీలించి, శనివారం సాయంత్రం పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. దీంతో సభ నిర్వహణకు అడ్డంకులు తొలగినట్లయ్యింది.
1,213 ఎకరాలు.. 10 లక్షల మంది
గులాబీ పార్టీ పాతికేళ్ల సంబరానికి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 1213 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తుండగా.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి మొత్తంగా 10 లక్షల మందితో సభ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయడంపై ఫోకస్ పెట్టారు.
ఇప్పటికే చింతలపల్లి రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోగా.. ఆ భూములన్నీ చదును చేసి, సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ సభలో గులాబీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగంపై ప్రజల్లో ఇప్పటినుంచే ఆసక్తి వ్యక్తమవుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ సభ పెనుమార్పులు తీసుకొస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతుండగా, రజతోత్సవ మహా సభ గులాబీ పార్టీకి ఏమేరకు సత్ఫలితాలను తీసుకొస్తుందో చూడాలి.
(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ప్రతినిధి, ఉమ్మడి వరంగల్ జిల్లా).
టాపిక్