Mangalagiri : మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కల.. నెరవేర్చే అవకాశం నాకు దక్కింది : లోకేష్

Best Web Hosting Provider In India 2024

Mangalagiri : మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కల.. నెరవేర్చే అవకాశం నాకు దక్కింది : లోకేష్

Basani Shiva Kumar HT Telugu Published Apr 13, 2025 02:15 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Basani Shiva Kumar HT Telugu
Published Apr 13, 2025 02:15 PM IST

Mangalagiri : మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కల.. ఆ కలను నెరవేర్చే అవకాశం తనకు దక్కిందని.. మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. భారతదేశానికే ఆదర్శంగా మంగళగిరి వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. వంద పడకల ఆసుపత్రిని ఏడాదిలోగా పూర్తిచేస్తామని చెప్పారు.

శిలాఫలకం వద్ద సెల్ఫీ తీసుకుంటున్న మంత్రి లోకేష్
శిలాఫలకం వద్ద సెల్ఫీ తీసుకుంటున్న మంత్రి లోకేష్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

భారతదేశానికే ఆదర్శంగా మంగళగిరి వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతామని.. మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భవన నమూనా చిత్రాలను పరిశీలించి నేతలకు వివరించారు. కూటమి నేతలతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 1984లో నందమూరి తారకరామారావు వైవీసీ (యార్లగడ్డ వెంకన్న చౌదరి) క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకం వద్ద.. లోకేష్ సెల్ఫీ దిగారు.

మూడు దశాబ్దాల కల..

‘మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కల. ఆ కలను నెరవేర్చే అవకాశం మనకు వచ్చింది. అందరి సహకారంతో నిర్మిస్తాం. 1984లో మంగళగిరి పట్టణంలో 30 పడకల ఆసుపత్రి, ఈ ప్రాంగణంలో క్యాన్సర్ చికిత్స కోసం ఆనాడు నందమూరి తారక రామారావు శంకుస్థాపన చేశారు. మంగళగిరి ఆసుపత్రిని కూడా నిర్మించారు. లక్షలాది మందికి వైద్యం అందించారు. మంగళగిరి 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేయాలని ఇక్కడి ప్రజలను నన్ను కోరారు. ఆసుపత్రి కోసం పోరాడి సాధించుకున్న కమిటీ సభ్యులు నన్ను కలిశారు. ఇప్పుడున్న స్థలంలో కాకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సువిశాల ప్రాంగణం ఉండాలనే ఆలోచనతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశాం’ అని లోకేష్ వివరించారు.

కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా..

‘వంద పడకల ఆసుపత్రి నిర్మాణంపై అనేకసార్లు సమీక్షించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే భవన నమూనాలు ఖరారు చేశాం. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ఈ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతాం. జోనింగ్, స్టాఫింగ్, మెరుగైన సౌకర్యాలు అందిస్తాం. అమరావతి పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ఈ ఆసుపత్రికి రద్దీ కూడా బాగా ఉంటుంది. ఆర్థో, డయాలసిస్ సెంటర్ వంటి వాటిని అందుబాటులోకి తీసుకువస్తాం. తలసేమియా, డీ అడిక్షన్ సెంటర్‌ను కూడా ఏర్పాటుచేస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించారు. అందులో భాగంగా రెండో కేబినెట్ మీటింగ్ లోనే మంగళగిరికి వంద పడకల ఆసుపత్రిని కేటాయించాం’ అని లోకేష్ వ్యాఖ్యానించారు.

అదే కూటమి ప్రభుత్వ లక్ష్యం..

‘ఒక నిర్ణయం జీవితాన్ని మార్చివేస్తుంది. నా జీవితంలో తీసుకున్న నిర్ణయం మంగళగిరిలో పోటీచేయడం. 2019లో 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఆ రోజు నుంచి కసితో పనిచేసి ప్రజలకు దగ్గరయ్యాను. 53వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరాను. మీరు ఎంత మెజార్టీ ఇస్తే అంత బలమొస్తుందని ఆనాడు చెప్పాను. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 91వేల ఓట్ల భారీ మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు. కేబినెట్ లో ఎప్పుడు మంగళగిరి ప్రస్తావన వచ్చినా చర్చే ఉండదు. ఏది అడిగినా శాంక్షన్ చేయాలని మంత్రులు నాకు మద్దతుగా నిలుస్తారు. ఇందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. ఎన్నికల ముందు మంగళగిరి ప్రజలకు ఇచ్చిన హామీలను పద్ధతి ప్రకారం నెరవేరుస్తున్నాం. మంగళగిరి ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తాం. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే మంగళగిరిని అభివృద్ధి చేస్తాం’ అని లోకేష్ స్పష్టం చేశారు.

మంగళగిరికే మొదటి ప్రాధాన్యత..

‘ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు కూడా మంగళగిరేనా అని అన్నారు. రాష్ట్రమంతా తిరగాలని అన్నారు. 2019 ఎన్నికల్లో నా పరువు పోయింది, ఓడిపోయాను. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు. మిమ్మల్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. వారి నుంచి శబ్ధం రాకుండా చేసింది మంగళగిరి ప్రజలని చెప్పాను. అందుకే నాకు ప్రయార్టీ ఉందని చెప్పాను. ప్రజలు నాపై బాధ్యత పెట్టారు. భరోసాతో మీరు ఉన్నారు. రచ్చబండలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. ఇందులో భాగంగానే ఆసుపత్రి నిర్మాణం, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి. భూగర్భ గ్యాస్, భూగర్భ వాటర్ పైప్ లైన్, భూగర్భ గ్యాస్, పవర్ అందిస్తాం. దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వత పట్టాలు అందిస్తున్నాం. ఇళ్లు లేని వారికి నిర్మించి ఇస్తాం. ఇవన్నీ యుద్ధప్రాతిపదికన చేస్తున్నాం’ అని నారా లోకేష్ చెప్పారు.

ఏడాదిలోగా పూర్తిచేస్తాం..

‘ఈ రోజు నుంచి వంద పడకల ఆసుపత్రిని ఏడాదిలో పూర్తిచేసే బాధ్యత ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుపైన ఉంది. లేనిపక్షంలో పక్కనే ఉన్న పవనన్నకు ఫిర్యాదుచేస్తా. కమిటీ సభ్యులకు కూడా బాధ్యత ఉంది. పోరాడి తెచ్చుకున్నారు. మీ పర్యవేక్షణలో నిర్మాణం జరగాలి. నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తాం. భారతదేశానికే ఆదర్శంగా వంద పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దుతాం. మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కల. ఆ కలను నెరవేర్చే అవకాశం మనకు వచ్చింది. అందరి సహకారంతో నిర్మిస్తాం’ అని లోకేష్ స్పష్టం చేశారు.

 

Basani Shiva Kumar

eMail

సంబంధిత కథనం

టాపిక్

Mangalagiri Assembly ConstituencyNara LokeshAp GovtAndhra Pradesh News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024