



Best Web Hosting Provider In India 2024
Anakapalle Fire Accident : ఉపాధి కోసం వెళ్తే.. సమాధి స్వాగతం పలుకుతోంది.. గతంలోనూ పేలుళ్లకు ఎంతోమంది బలి
Anakapalle Fire Accident : వారంతా నిరుపేదలు. కుటుంబాన్ని పోషించడం కోసం కాయకష్టం చేసేవారు. సొంతూరుకు దగ్గరే ఉపాధి లభిస్తుందని సంతోషించారు. కానీ.. ఆ ఉపాధి సమాధి దగ్గరకు సాగనంపుతుందని ఊహించలేకపోయారు. అనకాపల్లి జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రాల్లో ఇప్పటివరకు ఎందరో అసువులు బాసారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చాలా ప్రాంతాల్లో బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో వందలాది మంది పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాల్లో ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రాణాలు అగ్గిలో బూడిదయ్యాయి. తాజాగా కోటవురట్ల పరిధిలో జరిగిన ఘటనలో భారీగా ప్రాణనష్టం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి 8 మంది మృతిచెందారు.
గతంలో జరిగిన ఘటనలు..
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ శివారు గ్రామం కొత్తపాలెం సమీపంలో రేకుల షెడ్డులో బాణసంచా తయారీ కేంద్రం అనధికారికంగా నడిచేది. దాంట్లో 2022 సెప్టెంబర్‌లో ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి రేకులు 200 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.
గోకులపాడులో 11 మంది..
సబ్బవరం మండలం గుల్లేపల్లి, మల్లునాయుడుపాలెం గ్రామాల సరిహద్దులో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో.. ఐదేళ్ల కిందట ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. అచ్యుతాపురం పరిధిలోని రాంబిల్లి మండలం నారాయణపురంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్ల ధాటికి ఆరుగురు మృతి చెందారు. 2015లో ఎస్.రాయవరం మండలం గోకులపాడులో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్లలో 11 మంది మృతి చెందారు.
ఈ ప్రాంతాల్లో ఎక్కువ..
పాయకరావుపేట, అన్నవరం, కోటవురట్ల, సబ్బవరం పరిధిలో బాణసంచా తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పెద్దగా అధికారుల పర్యవేక్షణ ఉండదనే టాక్ ఉంది. దీంతో అనుమతుల్లేకపోయినా ఇబ్బంది ఉండదని భావించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ కూలీ ఇతర పనుల్లో కంటే.. ఇక్కడే డబ్బులు ఎక్కువ వస్తాయని నిర్వాహకులు ఆశ చూపుతున్నారు. రోజుకు 700 నుంచి 800 రూపాయలు కూలీ ఇస్తుండటంతో.. ఉపాధి కోసం వెళ్లి ప్రమాదాల్లో బలైపోతున్నారు.
శుభకార్యమైనా.. విషాదమైనా..
గతంలో బాణాసంచా వినియోగం ఎక్కువగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. శుభకార్యమైనా, విషాదమైనా.. అన్నింటికీ బాణసంచా కాల్చడం ఎక్కువైంది. రాజకీయ నాయకుల ఊరేగింపులకైతే చెప్పనక్కర్లేదు. ఈ బాణసంచాను గతంలో లైసెన్సు దుకాణాల్లో కొనుగోలు చేసేవాళ్లు. ఇప్పుడు స్థానికంగా అందుబాటులో ఉండటంతో అక్కడే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో 365 రోజులూ తయారీ ఉంటుంది.
సామర్థ్యానికి మించి..
బాణసంచా ఆర్డర్లు ఎక్కువగా వస్తుండటంతో.. నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సామర్థ్యానికి మించి పేలుడు నిల్వలు పెడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ, అగ్నిమాపక, పోలీసు శాఖల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదు. పరిమితికి మించి ఉత్పత్తి కోసం చేసే ప్రయత్నాల్లో నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ఈ కారణంగా ప్రమాదాలు జరుగి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్