






Best Web Hosting Provider In India 2024

RP Sisodia IAS: ఏపీ ఐఏఎస్ వర్గాల్లో కలకలం, చర్చనీయాంశంగా ఆర్పీ సిసోడియా బదిలీ, ఆధిపత్య పోరులో ఏపీ సెక్రటేరియట్…
RP Sisodia IAS: ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారి బదిలీ వ్యవహారం బ్యూరోక్రాట్లలో చర్చనీయాంశంగా మారింది.రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆర్పీసిసోడియా ఆకస్మిక బదిలీ వెనుక ఏమి జరిగిందనే చర్చ జోరుగా సాగుతోంది. ఐఏఎస్‌ల ఆధిపత్య పోరులో సీఎస్ రేసులో ఉన్న IASను తప్పించారనే ప్రచారం జరుగుతోంది.

RP Sisodia IAS: ఏపీ రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా బదిలీ వ్యవహారం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారుల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా సిసోడియాను అప్రధాన్య పోస్టుకు బదిలీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. గత నెలలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సిసోడియా స్వాగతోపన్యాసం చేయాల్సి ఉన్నా ఆయన మాట్లాడలేదు.
ఇటీవలి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆర్పీ సిసొడియా స్వాగతోపన్యాసం చేయకుండా కొందరు సిఎంఓ అధికారులు అడ్డు పడ్డారనే ప్రచారం జరిగింది. అప్పట్లోనే ఏపీ ఐఏఎస్ అధికారుల్లో ఏదో జరుగుతోందనే ప్రచారం జరిగింది. తాజాగా సిసోడియాకు స్థాన చలనం కలగడంతో అధికారుల మధ్య ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారింది.
ఆదివారం పలువురు ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉన్న పలువురు అధికారులకు కూడా పోస్టింగ్ దక్కింది. వీరిలో వైసీపీ హయంలో చక్రం తిప్పిన అధికారులు కూడా ఉన్నారు. జగన్ హయంలో సిఎంఓలో పనిచేసిన అధికారులతో పాటు పలువురు కన్ఫర్డ్ ఐఏఎస్‌లకు పోస్టింగ్ దక్కింది. ఈ క్రమంలో స్పెషల్ సీఎస్‌గా ఉన్న అధికారిని అప్రధాన్య పోస్టుకు బదిలీ చేయడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అధికారుల మధ్య పోటీ…
ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా 1992 బ్యాచ్‌కు చెందిన విజయానంద్ ఉన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో విజయానంద్ పదవీ విరమణ చేస్తారు. ప్రభుత్వం మరికొంత కాలం ఆయన పదవీ కాలాన్ని పొడిగించే అవకాశాలు లేకపోలేదు.
సీఎస్ కంటే సీనియార్టీలో శ్రీలక్ష్మీ ముందు ఉన్నారు. శ్రీలక్ష్మీపై పలు అభియోగాలు ఉన్నాయి. గత ప్రభుత్వం పురపాలక శాఖ బాధ్యతలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియార్టీలో ముందున్నా శ్రీలక్ష్మీని పక్కన పెట్టారు. ఆమె తర్వాత సీనియార్టీలో అనంతరాము, సాయిప్రసాద్; అజయ్ జైన్ ఉన్నారు. సాయిప్రసాద్ 2026 మే నెలలో, అజయ్ జైన్ 2026 జులైలో పదవీ విరమణ చేస్తారు. వారి తర్వాత సీనియర్‌గా 1991 బ్యాచ్‌కు చెందిన ఆర్పీ సిసోడియా ఉన్నారు. ఈ క్రమంలో అధికారుల మధ్య నెలకొన్న విభేదాలతో సిసోడియా బలయ్యారని ప్రచారం జరుగుతోంది.
మాజీ ఉద్యోగి పాత్ర…
అధికారుల పనితీరుపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిఘా వర్గాల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ క్రమంలో కీలక శాఖలకు బాధ్యులుగా ఉన్న అధికారుల పని తీరుపై నెలన్నర క్రితం ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారాన్ని సేకరించారు. ఈ క్రమంలో సిఎంఓలో పనిచేసే అధికారుల పనితీరుపై ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారాన్ని సేకరించాయి.
పలువురు అధికారుల వ్యవహార శైలిపై నిఘా వర్గాలు సమాచారాన్ని సేకరించినా కొందరు అధికారులు ప్రత్యేకంగా ఆర్పీ సిసోడియా పనితీరును ప్రభుత్వ పెద్దలకు చేరవేసినట్టు తెలుస్తోంది. దీని వెనుక జరిగిన పరిణామాలపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పాలనా వైఫల్యాలకు బాధ్యుడిని చేసి…
రెవిన్యూ శాఖ బాధ్యుడిగా జిల్లా కలెక్టర్ల పనితీరుకు స్పెషల్ సీఎస్‌ను బాధ్యుడిని చేసినట్టు ఐఏఎస్‌లలో ప్రచారం జరుగుతోంది. జిల్లాల్లో పెండింగ్ ఫైల్స్ క్లియర్ కాకపోవడానికి సిసోడియాను బాధ్యుడిని చేసి కొద్ది రోజులుగా పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు కీలకమైన రెవిన్యూ శాఖను తమకు నచ్చిన వారికి అప్పగించే క్రమంలోనే సిసోడియాను పదవి నుంచి తప్పించారనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో సిసోడియాపై ఇచ్చిన నివేదికలో పలు ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. రెవిన్యూ శాఖలో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం పెరగడం, భూ కేటాయింపులు, అనుమతులను మంజూరు చేయడంలో నిబంధనల ఉల్లంఘనలు తెరపైకి వచ్చాయి.
కుల సంఘాల ప్రమేయం…
రెవిన్యూశాఖలో పనిచేస్తోన్నఓ రిటైర్డ్ ఉద్యోగిపై పలు ఆరోపణలు రావడంతో కొద్ది రోజుల క్రితం అతడిని పదవి నుంచి తప్పించారు. 73ఏళ్ల సదరు ఉద్యోగి.. రిటైర్మెంట్ తర్వాత కూడా రెవిన్యూ శాఖలో పని చేస్తున్నారు. అనుభవం పేరుతో రెవిన్యూ శాఖలో చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలో విశాఖపట్నంలో చేసిన భూ కేటాయింపులు వివాదాస్పంగా మారాయి. జిల్లాల్లో భూముల వ్యవహారాల్లో వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, రెవిన్యూ శాఖ ఉన్నతాధికారి పేరుతో పైరవీలు చేస్తున్నట్టు తెలియడంతో అతడిని తొలగించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారికి మాజీ ఉద్యోగికి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగినట్టు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.
తమ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగిని తొలగించడంతో కొన్ని కుల సంఘాలు రెవిన్యూ శాఖ కార్యదర్శిపై సీఎంఓలో ముఖ్యమైన అధికారులకు ఫిర్యాదులు చేశాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టుకు ఆర్పీ సిసోడియా ప్రయత్నాలు చేస్తున్నారని తెలియడంతో ఆయన్ని కీలక బాధ్యతల నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా వ్యక్తిగత ఆరోపణలతో నివేదికలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
గుంటూరు జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడితో ఐఏఎస్ అధికారి సన్నిహితంగా ఉంటున్నాడని నిఘా వర్గాల ద్వారా గుర్తించాయి. సీఎస్ రేసులో ఉన్న ఇతర ఐఏఎస్‌లు అప్రమత్తం కావడం, సిసోడియాను కీలక బాధ్యతల నుంచి తప్పించేందుకు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది.
ఎవరా ప్రైవేట్ వ్యక్తులు…?
ఆర్పీ సిసోడియా రెవిన్యూ శాఖ బాధ్యతలు నిర్వహించిన సమయంలో “కవి” పేరుతో ఓ ప్రైవేట్ వ్యక్తి పెత్తనం చెలాయించినట్టు తెలుస్తోంది. రెవిన్యూ శాఖ మంత్రి తాలుకా అంటూ గత పది నెలలుగా రెవిన్యూ శాఖలో చక్రం తిప్పాడని ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడు కావడంతో ఆ శాఖ కార్యదర్శి చూసి చూడనట్టు వదిలేశారు. ప్రైవేట్ సంభాషణల్లో ఐఏఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలను రికార్డు చేసి సిఎంఓకు చేరవేయడంతో తాజా బదిలీ జరిగినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో రెవిన్యూ శాఖలో ప్రైవేట్ వ్యక్తుల నిర్వాకంపై కొందరు రెవిన్యూ శాఖ కార్యదర్శిని అప్రమత్తం చేసినా మంత్రి తాలుకాగా ప్రచారం కావడంతో సిసోడియా తేలిగ్గా తీసుకోవడం ఆయన కొంప ముంచినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఆ శాఖ బాధ్యులు సురక్షితంగా ఉంటే ఐఏఎస్ అధికారి మాత్రం బలయ్యారు. మొత్తంగా ఏపీ క్యాడర్ ఐఏఎస్‌లలో నెలకొన్న విభేదాలు తాజా బదిలీలు అద్దం పడుతున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్