






Best Web Hosting Provider In India 2024

క్యాన్సర్ ఒక అంటు వ్యాధా? వస్తే మరణం తప్పదా? క్యాన్సర్ గురించి అపోహలు వాస్తవాలు ఇదిగో
క్యాన్సర్ గురించి ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయి. చాలామందికి క్యాన్సర్ అంటే ఏమిటో కూడా సరిగా తెలియదు. ఇక్కడ మేము ప్రజల మనసులో ఉన్న అపోహలకు అసలైన వాస్తవాలను వివరించాము.

క్యాన్సర్ ఎందుకు వస్తుంది? అది ఇతరులకు వ్యాపిస్తుందా? క్యాన్సర్ వస్తే చివరికి మరణమేనా? ఇలాంటి సందేహాలు ప్రజల మనసుల్లో ఎన్నో ఉన్నాయి. వారిలో ఉన్న కొన్ని అపోహలు కూడా క్యాన్సర్ పట్ల భయాన్ని పెంచేస్తున్నాయి. క్యాన్సర్ గురించి ఉన్న తప్పుడు ఆలోచనలు, అపోహలే ఎన్నో అనర్ధాలకు దారితీస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మేము క్యాన్సర్ విషయంలో ప్రజల్లో ఉన్న అపోహలకు అసలైన వాస్తవాలను చెప్పాము. మేము చెప్పిన వాస్తవాలన్నీ కూడా సైన్స్ ఆధారిత సమాచారం నుంచి స్వీకరించినవి.
అపోహ: క్యాన్సర్ వస్తే ఇక మరణించడమే.
వాస్తవం: నిజానికి క్యాన్సర్ వస్తే ఇక మరణం ఒక్కటే మిగిలిందని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. క్యాన్సర్ కు చికిత్స చేయడం సాధ్యమే. ఎందుకంటే ప్రారంభ దశలోనే క్యాన్సర్ ను గుర్తించి చికిత్స చేస్తే… చాలా వరకు క్యాన్సర్ కేసులు నయం అవుతాయి. కాబట్టి ప్రారంభ రోగ నిర్ధారణ, చికిత్స చాలా అవసరం. క్యాన్సర్ ఇతర శరీర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకుంటే ఎక్కువ కాలం జీవించవచ్చు. రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్లను ప్రారంభ దశలోనే గుర్తిస్తే దాన్ని నయం చేయవచ్చు. వారు ఇతరులు లాగే ఎక్కువ ఏళ్ళు జీవించే అవకాశం ఉంది.
అపోహ: క్యాన్సర్ ఒక అంటువ్యాధి.
వాస్తవం: ఇది పూర్తిగా అబద్ధం. క్యాన్సర్ అంటువ్యాధి కాదు. అవయవ మార్పిడి ద్వారా కూడా క్యాన్సర్ ఒకరి నుండి ఒకరికి సోకించదు. క్యాన్సర్ ఉన్న వ్యక్తి తిన్న ప్లేట్లో మీరు తినడం వల్ల కూడా మీకు ఆ వ్యాధి రాదు. క్యాన్సర్ సోకిన వ్యక్తులను సంబంధించిన అవయవాలను ఇతరులకు మార్పిడి కూడా చేయరు వైద్యులు.
అపోహ: కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే మీకు ఖచ్చితంగా వస్తుంది.
వాస్తవం: క్యాన్సర్ జన్యుపరమైనది. వారసత్వంగా వచ్చేది… అన్నది నిజమే. అయితే కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నంత మాత్రాన మీకు కూడా కచ్చితంగా వస్తుందని మాత్రం చెప్పలేము. వస్తే రావచ్చు. లేదా రాకపోనూ వచ్చు. వారసత్వంగా వచ్చిన ఒక అసాధారణ జన్యువు మీలో కూడా ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ జన్యువు మీ శరీరంలో లేకపోతే క్యాన్సర్ రాదు.
అపోహ: మొబైల్ వాడకం క్యాన్సర్ కు కారణం అవుతుంది.
వాస్తవం: ఇప్పటివరకు జరిగిన అధ్యయనాల ప్రకారం సెల్ ఫోన్లు క్యాన్సర్‌కు కారణం అవుతాయని నిరూపణ జరగలేదు. క్యాన్సర్ అనేది జన్యు మ్యుటేషన్ వల్ల వస్తుంది. సెల్ ఫోన్లు ఆ జన్యువులను దెబ్బతీయని తక్కువ ఫ్రీక్వెన్సని విడుదల చేస్తాయి. కాబట్టి సెల్ ఫోన్లు క్యాన్సర్ కు కారణం అవుతాయని ఏ పరిశోధనా చెప్పలేదు.
అపోహ: క్యాన్సర్‌ను నయం చేసే మూలికలు ఉన్నాయి.
వాస్తవం: కొన్ని అధ్యయనాలు క్యాన్సర్ చికిత్సకు మూలికా ఉత్పత్తులు రోగులకు కొంతవరకు సహాయపడతాయని నిరూపించాయి. కానీ ఆ మూలికా ఉత్పత్తుల వల్లే క్యాన్సర్ పూర్తిగా నయం అవుతుందని మాత్రం ఏ పరిశోధనా చెప్పలేదు. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ తీసుకుంటున్నప్పుడు వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులను తగ్గించడానికి ప్రత్యామ్నాయ వైద్య విధానంలో కొన్ని మూలికలను ఉపయోగించవచ్చు. అవి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గిస్తాయి. అంతేకానీ ఏ మూలికా ఉత్పత్తులు కూడా క్యాన్సర్ ను పూర్తిగా నయం చేస్తాయని ఇంతవరకు నిరూపణ జరగలేదు.
అపోహ: క్యాన్సర్ సర్జరీ లేదా ట్యూమర్ బయాప్సీ చేస్తున్నప్పుడు క్యాన్సర్ ఇతర అవయవాలకి వ్యాప్తి చెందుతుంది
వాస్తవం: వైద్యులు చేసే శస్త్ర చికిత్స వల్ల శరీరంలో ఇతర భాగాలకు క్యాన్సర్ వ్యాపించే అవకాశం చాలా తక్కువ. బయాప్సీలు చేసినప్పుడు లేదా క్యాన్సర్ కణితులను తొలగించేటప్పుడు చేసే శస్త్ర చికిత్స సమయంలో సర్జన్లు చాలా ప్రత్యేక పద్ధతులను ఉపయోగిస్తారు. అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. శరీరంలో క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా చాలా జాగ్రత్త పడతారు.
(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)
సంబంధిత కథనం