






Best Web Hosting Provider In India 2024

AP Bureaucrats: కృష్ణా కరకట్ట వెంబడి ఏం జరుగుతోంది..? వీకెండ్ పార్టీల వెనుక మర్మం ఏమిటి..
AP Bureaucrats: ఏపీ ముఖ‌్యమంత్రి నివాసం, క్యాంపు కార్యాలయం ఉన్న ప్రాంతానికి చేరువలో జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న గెస్ట్ హౌస్‌లలో జరుగుతున్న కార్యకలాపాలపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

AP Bureaucrats: ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు పట్టు సాధించే క్రమంలో జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వానికి తలవొంపులు తెచ్చేవిగా మారుతున్నాయి. నిఘా వర్గాలకు తెలిసినా పూర్తి స్థాయి సమాచారాన్ని ఉన్నత స్థాయిలో నివేదించక పోవడంతో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోందనే విమర్శలు ఉన్నాయి. .
ఏపీ ముఖ్యమంత్రి ఉండవల్లి నివాసానికి కూతవేటు దూరంలో. కరకట్ట వెంబడి ఉన్న కొన్ని గెస్ట్‌హౌస్‌ల్లో జరుగుతున్న కార్యకలాపాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సార్లు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వీటిలో జరుగుతున్న పార్టీల్లో ఇటీవల ఓ ఉన్నతాధికారిని హనీ ట్రాప్ చేశారనే వార్తల నేపథ్యంలో పార్టీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న కొన్ని గెస్ట్‌హౌస్‌లతో పాటు, మంగళగిరి ప్రాంతంలో వారాంతాల్లో ఉన్నత స్థాయి అధికారుల కోసం ఏర్పాటు చేస్తున్న పార్టీల వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పనులు చక్కబెట్టే పవర్ బ్రోకర్లు వీటిని నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
కృష్ణానది వెంబడి ఉన్న గెస్ట్‌హౌస్‌లతో పాటు స్విమ్మింగ్ ఫూల్స్, శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. కొందరు ఉన్నతాధికారులు వ్యాయామం కోసం, విరామ సమయాల్లో ఇక్కడ సేదతీరుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం జరిగిన పార్టీపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.
అర్థరాత్రి వరకు సాగిన ఈ పార్టీ వీడియోలను కొందరు సేకరించి ప్రభుత్వానికి చేరవేశారు. ఇదంతా పథకం ప్రకారం జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కరకట్ట వెంబడి ఉన్న వనంలో జరిగిన పార్టీపై నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో కొందరు అధికారుల బదిలీలు జరిగాయి.
ఆ పార్టీలో ఏం జరిగింది…
మరోవైపు పథకం ప్రకారం పార్టీకి ఆహ్వానించి తనను బలి చేశారని ప్రభుత్వ ఆగ్రహానికి గురైన అధికారి సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఇదంతా కుట్రలో భాగంగా జరిగిందని ఆయన చెబుతున్నారు.కరకట్ట పార్టీలో పాల్గొన్న వారి వ్యవహార శైలిపై ప్రభుత్వం ఆగ్రహంతో ఉన్నా అక్కడ జరిగిన పార్టీ, దాని నిర్వాహకులపై ఎలాంటి చర్యలు లేకపోవడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యమంత్రి నివాసానికి చేరువలో తరచూ ఈ తరహా కార్యక్రమాలు జరుగుతున్నా వాటిని కట్టడి చేయక పోవడం వెనుక గుట్టు అంతు చిక్కడం లేదు. ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న అధికారులకు వల వేసి వారిని ఉచ్చులోకి దించుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లో త పనులు చక్కబెట్టుకోడానికి వారిని ప్రలోభాలకు గురి చేసి పబ్బం గడుపుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల కృష్ణా తీరంలో జరిగిన పార్టీపై ప్రభుత్వం తీవ్రంగానే స్పందించినా అక్కడ ఏమి జరిగిందో బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. పార్టీలో మద్యానికి మాత్రమే పరిమితమయ్యారా, చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడ్డారా అనే దానిపై స్పష్టత రాలేదు. చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు జరిగితే ఘటన జరిగిన ప్రదేశంలో పోలీసులు ఏం చర్యలు చేపట్టారనే దానిపై కూడా స్పష్టత లేదు. ఈ తరహా కార్యక్రమాల నిర్వాహకుల్ని కట్టడి చేస్తున్న దాఖలాలు కూడా లేవు. హై ప్రొఫైల్ వ్యక్తుల కనుసన్నల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
కొందరు అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు..
ఏపీలో కొందరు అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినా అవి ముఖ్యమంత్రి వరకు చేరడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు సన్నిహితులతో కలిసి వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఇటీవల పత్రికల్లో కథనాలు సైతం వెలువడ్డాయి.
ఈ క్రమంలో అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం కూడా చర్చనీయాంశంగా అయ్యింది. కొందరు అధికారుల భార్యలు విజయవాడ నగరంలోని స్టార్ హోటళ్లలో ప్రత్యేకంగా కార్యాలయాలను, బొటిక్‌లు నిర్వహిస్తూ ప్రభుత్వ పనులు చక్కబెడుతున్నారని ప్రతి పనికి రేట్ ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరిగింది.
ఆరేడుగురు అధికారులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చినా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారికి క్లీన్ చిట్ ఇచ్చేశారని ఐఏఎఎస్ అధికారులు గుర్తు చేస్తున్నారు. 2018లో ఓ అధికారి క్రమశిక్షణా రాహిత్యంపై అప్పటి డీజీపీ ఠాకూర్ నివేదిక ఇచ్చినా వాటిపై చర్యలు తీసుకోలేదని, నివేదికలో ఉన్న ఆరోపణల్ని వ్యక్తిగత అంశాలుగా పరిగణించి వదిలేశారని సదరు అధికారి ఇప్పుడు కీలక బాధ్యతల్లో ఉన్నారని, వ్యక్తిగత అలవాట్ల ఆధారంగా కొందరిని టార్గెట్ చేయడం ఏమిటనే చర్చ జరుగుతోంది.
సంబంధిత కథనం
టాపిక్