AP Finance Memo: ఏపీలో పాత బిల్లులకు మంగళం.. ఏటా కొత్తగా బిల్లులు పెట్టాల్సిందే, కాంట్రాక్టర్లపై ఆర్థిక శాఖ పిడుగు

Best Web Hosting Provider In India 2024

AP Finance Memo: ఏపీలో పాత బిల్లులకు మంగళం.. ఏటా కొత్తగా బిల్లులు పెట్టాల్సిందే, కాంట్రాక్టర్లపై ఆర్థిక శాఖ పిడుగు

Sarath Chandra.B HT Telugu Published Apr 15, 2025 02:17 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu
Published Apr 15, 2025 02:17 PM IST

AP Finance Memo: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ బిల్లుల చెల్లింపు విధానంలో ఆర్థిక శాఖ కీలక సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల్ని తర్వాత ఏడాదికి పంపే విధానానికి స్వస్తి పలికారు. ఇకపై పెండింగ్‌ బిల్లుల్ని ఏటా కొత్తగా నమోదు చేయాలంటూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు చేశారు.

బిల్లుల చెల్లింపు కోసం పీయూష్‌ కుమార్‌కు వినతి పత్రం ఇస్తున్న కాంట్రాక్టర్లు (ఫైల్ ఫోటో)
బిల్లుల చెల్లింపు కోసం పీయూష్‌ కుమార్‌కు వినతి పత్రం ఇస్తున్న కాంట్రాక్టర్లు (ఫైల్ ఫోటో)
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

AP Finance Memo: ఏపీలో ప్రభుత్వ బిల్లులు చెల్లింపు విధానంలో ఆర్థిక శాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కాంట్రాక్టర్లు, వెండర్లకు చెల్లించాల్సిన బిల్లుల విధానంలో కీలక మార్పులు చేపట్టింది. ప్రతి ఏడాది చెల్లించాల్సిన బకాయిల్ని తర్వాతి ఆర్థిక సంవత్సరానికి పొడిగించే సాంప్రదాయానికి స్వస్తి పలికింది. ఆర్థిక సంవత్సరం చివరిలో పెండింగ్‌ బిల్లులు రద్దై పోతాయని ఏప్రిల్ 9న కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో పెండింగ్‌ ఫైనాన్స్‌ బిల్లుల్ని క్యారీ ఫార్వార్డ్‌ చేసే విధానాన్ని ఆర్థిక శాఖ రద్దు చేసింది. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న బిల్లుల భారాన్ని తగ్గించుకునే క్రమంలో పెండింగ్‌ బిల్లుల్ని బదలాయించే విధానాన్ని రద్దు చేసింది. దీంతో కాంట్రాక్టర్లు ఏ ఏడాదికి ఆ ఏడాదికి కొత్తగా బిల్లులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆదాయానికి ఖర్చుకు పొంత లేదు…

సాధారణంగా ఆర్థిక శాఖలో బిల్లులు చెల్లించాలంటే దానికి తగిన బడ్జెట్ కేటాయింపులు ఉండాలి. వివిధ రకాల అవసరాల నిమిత్తం చేసే ఖర్చులకు చెల్లించడానికి అదనపు నిధులు కూడా అవసరం అవుతాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఏపీ వార్షికాదాయం రూ.1.74లక్షల కోట్లుగా ఉంది.

2024-25లో దాదాపు రూ.20వేల కోట్ల రుపాయల ఆదాయం తగ్గింది. 2025-26లో రూ.3.25లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలను రూపొందించారు. ఈ క్రమంలో వాస్తవ ఆదాయానికి రాబడికి మధ్య తీవ్రమైన అంతరం ఉంది. ఈ లోటులో కొంత భాగాన్ని రుణాల రూపంలో ప్రభుత్వం సమకూర్చుకుంటోంది.

ఏటేటా పెరుగుతున్న అదనపు ఖర్చు…

మరోవైపు ప్రభుత్వానికి అత్యవసర పరిస్థితుల్లో ఏర్పడే ఖర్చులకు, పథకాలు, పరిహారాలకు ఏటా రూ.25-50వేల కోట్ల వరకు ఖర్చవుతోంది. బడ్జెట్‌ అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వం ఖర్చు చేసే విధానాలకు ఏపీలో ప్రభుత్వాలు ఎప్పుడో తిలోదకాలిచ్చాయి. గతంలో ఏటా నాలుగు త్రైమాసికాల్లో నిధులను విడుదల చేసేవారు. రాబడికి అనుగుణంగా ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు త్రైమాసికాలకు నిధుల విడుదల జరిగేది. ప్రస్తుతం రాజకీయ బడ్జెట్‌లను అమలు చేయాల్సిన పరిస్థితులు ఉండటంతో ఆదాయానికి, వ్యయానికి మధ్య పొంతన ఉండటం లేదు.

ఖర్చు చేయాల్సింది ఇలా…

ప్రతి శాఖకు అవసరానికి అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపులు ముందుగానే నిర్ణయిస్తారు. సెక్రటేరియట్‌ డిపార్ట్‌మెంట్‌లో బడ్జెట్‌కు పరిపాలనపరమైన అమోదం ఇచ్చిన తర్వాత అయా విభాగాల శాఖాధిపతులకు నిధుల వినియోగంపై తగిన సూచనలు చేస్తారు. సంబంధిత శాఖకు సారథ్యం వహించే కమిషనర్‌, డైరెక్టర్‌, ఈఎన్‌సీలు నిధులకు అనుగుణంగా ఖర్చులను నిర్ణయిస్తారు. ఆ తర్వాత వర్క్‌ ఆర్డర్‌, పర్చేచ్ ఆర్డర్లు విడుదల చేస్తారు. ప్రాధాన్యతక్రమంలో వీటికి కేటాయింపులు చేస్తారు.

ఈ క్రమంలో పనులు పూర్తి చేసిన వాటికి బిల్లులు పెట్టడం, శాఖల వారీగా కొనుగోళ్ల బిల్లులకు చెల్లింపులు గతంలో ట్రెజరీ ద్వారా చెల్లింపులు చేశారు. ప్రస్తుతం ఆర్థిక శాఖలోనే ఈ చెల్లింపులు జరుగుతున్నాయి. బిల్లుల చెల్లింపు అధికారం ఆర్థికశాఖ అధికారుల చేతిలో ఉంటోంది. ఈ క్రమంలో నిధుల లభ్యత, పనుల ప్రాధాన్యతను బట్టి బిల్లుల చెల్లింపు జరుగుతోంది.

బకాయిలు తర్వాతి ఏడాదికి బదిలీ..

ఏదైనా శాఖకు సంబంధించిన బిల్లులకు ఆర్ధిక సంవత్సరం ముగిసేలోపు చెల్లింపు జరగకపోతే వాటిని తర్వాతి ఏడాదికి బదిలీ చేసేవారు. ఈ క్రమంలో నాలుగైదేళ్లుగా చెల్లింపులు ఆలస్యమవుతున్న బిల్లులు కూడా ఉన్నాయి. గతంలో పాత బిల్లులకు కొత్త నంబర్ ఇచ్చి పెండింగ్‌లో ఉంచేవారు. తాజాగా ఈ విధానాన్ని రద్దు చేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్స్‌ను తర్వాతి ఏడాదికి పంపడాన్ని పూర్తిగా రద్దు చేశారు.

కాంట్రాక్టర్ల ఆందోళన…

సాధారణంగా ఒక బిల్లు పరిపాలనా అమోదం లభించి, పని పూర్తి చేసుకున్న తర్వాత బిల్లు దశకు రావడానికి చాలా సమయం ఉంటుంది. ఈ క్రమంలో అన్ని దశలు దాటుకుని, అందరి అమోదంతో బిల్లుగా నమోదైన వాటిని రద్దు చేసి మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాలంటే తీవ్రమైన శ్రమతో కూడుకున్న వ్యవహారమని ఏపీ ప్రభుతవ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లేశ్వరరావు చెప్పారు. పాత బిల్లులను కొత్తగా నమోదు చేయాలంటే ప్రతి కార్యాలయంలో వాటిని ధృవీకరించడం సాధ్యమయ్యే పని కాదని చెబుతున్నారు.

ప్రస్తుతం బిల్లుల చెల్లింపు కోసం దాదాపు రూ.25-30వేల కోట్ల విలువైన పాత బిల్లులు ఎదురు చూస్తున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అదనపు కేటాయింపులు లేకుండా పాత బిల్లుల్ని కొత్తగా నమోదు చేయడమంటే వాటి చెల్లింపులు సాధ్యం కావని చెబుతున్నారు. ఆర్థిక శాఖ భారాన్ని తగ్గించుకోడానికి జీరో బడ్జెట్‌ విధానం అమలు చేస్తున్నా కాంట్రాక్టర్ల పాలిట శాపంగా మారుతుందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.

కాంట్రాక్టర్లకు గతంలో గడువు పొడిగింపు వెసులుబాటు ఉండేదని, ప్రభుత్వ నిర్ణయం.. తమను అయోమయానికి గురి చేస్తోందని దీని పర్యావసానాలు ఊహించలేని విధంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. 2022లో హెచ్‌టీలో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Ias OfficersAp BureaucratsGovernment Of Andhra PradeshTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024