



Best Web Hosting Provider In India 2024
Khammam : రైతుల కన్నీటి దృశ్యం.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్ష్యం.. హరీశ్ రావు ఎమోషనల్ కామెంట్స్
Khammam : రాష్ట్రంలో వరికోతలు ప్రారంభం అయ్యాయి. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. కొన్నిచోట్ల కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఇటు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ధాన్యాన్ని తడవకుండా చూసేందుకు అన్నదాతలు కష్టాలు పడుతున్నారు. ఈ పరిణామాలపై హరీశ్ రావు ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం బాగుపదడదని గుర్తు పెట్టుకోండి.. అంటూ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యాఖ్యానించారు. నమ్మి ఓటేసినందుకు.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గొంతు కోస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు దుర్మార్గ వైఖరిని యావత్ తెలంగాణ గమనిస్తున్నదన్న హరీశ్.. మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ పాలకులారా.. రైతన్న గోస ఇకనైనా పట్టించుకోండని హితవు పలికారు. వారి కన్నీటి కష్టాలు తీర్చండని సూచించారు.
కడుపు తరుక్కుపోతున్నది..
‘ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన రైతు దంపతులు బొల్లం రామయ్య, చంద్రకళ ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతున్నది. అకాల వర్షాలు, సాగు నీటి గోస, కరెంట్ కష్టాలను ఎదుర్కొని.. కౌలుకు తీసుకున్న 18 ఎకరాల్లో వరి సాగు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వ రూపంలో విపత్తు రైతన్నను నట్టేట ముంచింది. కొండంత సంబురంతో పంటను కొనుగోలు కేంద్రానికి తరలించి 20 రోజులు గడిచినా.. ప్రభుత్వం పంట కొనుగోలు చేయలేదు. దీంతో అకాల వర్షం ఆ రైతన్నను నిండా ముంచింది. కష్టపడి పండించిన ధాన్యమంతా తడిసి ముద్దయింది’ అని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కన్నీటి దృశ్యమే ప్రత్యక్ష సాక్ష్యం..
‘ప్రభుత్వం ధాన్యం కొనకపోగా.. పరిహారం కూడా చెల్లించకపోవడంతో తడిసిన ధాన్యం కుప్ప ముందు రైతు కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదని చెప్పడానికి.. ఈ కన్నీటి దృశ్యమే ప్రత్యక్ష సాక్ష్యం. రైతుల జీవితాల్లో కాలం తెచ్చిన విపత్తు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన విపత్తు ఇది. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు. కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా నేడు అకాల వర్షాలపాలు చేసి ఆగం చేస్తున్నారు’ అని హరీశ్ రావు విమర్శించారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..
యాసంగి (రబీ) సీజన్ 2024-25 కొరకు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 8,000 పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 1,000 కి పైగా కేంద్రాలు ప్రారంభించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఇందిరా క్రాంతి పథకం మహిళా సంఘాలు, ఇతర సంస్థల ద్వారా ఈ కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
రైతుల ఖాతాల్లోకి రూ.46 కోట్లు..
ఏప్రిల్ 9, 2025 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1,838 కొనుగోలు కేంద్రాల ద్వారా.. 95,131 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డు రకం 9,973 టన్నులు, సన్న రకం 85,158 టన్నులు ఉన్నాయి. ఇప్పటివరకు రూ. 220.70 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా.. రూ. 46.54 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్